ఉపవాసం మరియు దుఆ
"ఇస్లాం ధర్మంలో ఉపవాసం అనేది ఆత్మను పవిత్రం చేసే ఒక గొప్ప ఆధ్యాత్మిక సాధన. అల్లాహ్ సాన్నిహిత్యాన్ని పొందడానికి, మన ప్రార్థనలు (దువాలు) అంగీకరించబడటానికి ఉపవాసం ఒక శక్తివంతమైన మార్గంగా నిలుస్తుంది. మన ప్రియ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారు ఒక ప్రసిద్ధ హదీసు (తిర్మిధి) ద్వారా ప్రార్థనల అంగీకారం గురించి వివరిస్తూ… ముగ్గురి ప్రార్థనలు ఎన్నటికీ తిరస్కరించబడవ’ని సెలవిచ్చారు.
మొదటిది, ఉపవాసం ఉన్న వ్యక్తి తన ఉపవాసాన్ని విరమించే (ఇఫ్తార్) సమయాన చేసే ప్రార్థన. రోజంతా అల్లాహ్ ప్రీతి కోసం ఆకలి దప్పులను ఓర్చుకుని, వినమ్రతతో వేడుకునే భక్తుడి మొరను, సృష్టికర్త తప్పక ఆలకిస్తాడు.
రెండవది, సమాజంలో ధర్మాన్ని నిలబెట్టే న్యాయమైన పాలకుడి ప్రార్థన. ప్రజల కష్టసుఖాలను కనిపెట్టుకుంటూ, అన్యాయానికి తావులేకుండా పాలించే నాయకుడికి అల్లాహ్ తఆలా వద్ద ప్రత్యేక గౌరవం ఉంటుంది.
మూడవది, అన్యాయానికి గురైన బాధితుడి ప్రార్థన. ఎవరైనా ఇతరుల వల్ల బాధింపబడినప్పుడు వారు చేసే ఆర్తనాదం నేరుగా అల్లాహ్ తఆలా చెంతకు చేరుతుంది.
ఈ విధంగా ఉపవాసం ఉన్న సమయంలో మనం చేసే ప్రతి అభ్యర్థన అల్లాహ్ కరుణతో స్వీకరించబడుతుంది. ముఖ్యంగా ఇఫ్తార్ సమయానికి ముందు చేసే దువాలకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. కాబట్టి, ఉపవాస దీక్షలో ఉన్న ప్రతి విశ్వాసి ఈ పవిత్ర సమయాన్ని వృధా చేయకుండా, తన కోసం, తన కుటుంబం కోసం మరియు లోక కల్యాణం కోసం భక్తితో ప్రార్థించాలి. అప్పుడే ఉపవాసం యొక్క అసలైన లక్ష్యం నెరవేరుతుంది."
ఈ స్థితి గురించి ఇమామ్ అల్-మునావి (రహ్మతుల్లాహ్ అలైహి) వివరిస్తూ, ఉపవాసం అనేది అల్లాహ్ తఆలాకు అవిధేయత చూపకుండా తన శరీర భాగాలను రక్షించుకునే పవిత్ర ప్రక్రియ అని పేర్కొన్నారు. ఒక వ్యక్తి తన ఇష్టాయిష్టాలను మరియు కోరికలను అల్లాహ్ కోసం త్యాగం చేయడం వల్ల అతని శరీరం మరియు మనసు స్వచ్ఛతను పొందుతాయి, తద్వారా అతని దుఆ అంగీకరించబడుతుంది. ఉపవాసం వల్ల కలిగే శారీరక బలహీనత మరియు ఆకలి, మనిషిని అల్లాహ్ తఆలా ముందు మరింత వినమ్రంగా మారుస్తాయి. అటువంటి వినమ్రతతో, తన అవసరాన్ని గుర్తిస్తూ చేసే ప్రార్థన అల్లాహ్ కరుణకు పాత్రమవుతుంది.
ముఖ్యంగా ఇఫ్తార్ సమయానికి ఉన్న విశిష్టత గురించి ప్రియ ప్రవక్త (స) గారు ఇలా సెలవిచ్చారు: "నిజానికి, ఉపవాసం ఉన్న వ్యక్తికి తన ఇఫ్తార్ సమయంలో ఒక ప్రార్థన ఉంటుంది, అది తిరస్కరించబడదు" (ఇబ్న్ మజా). ఈ పవిత్ర సందర్భంగా ఖురాన్ లోని అత్యంత ఓదార్పునిచ్చే వాక్యం (ఆయత్ 2:186) మనకు కనిపిస్తుంది:
وَإِذَا سَأَلَكَ عِبَادِي عَنِّي فَإِنِّي قَرِيبٌ ۖ أُجِيبُ دَعْوَةَ
الدَّاعِ إِذَا دَعَانِ ۖ فَلْيَسْتَجِيبُوا لِي وَلْيُؤْمِنُوا بِي لَعَلَّهُمْ يَرْشُدُونَ
అర్థం: "మరియు నా దాసులు, నన్ను గురించి నిన్ను అడిగితే: 'నేను (వారికి) అతి సమీపంలోనే ఉన్నాను. పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని పిలుపును విని, జవాబిస్తాను. కాబట్టి వారు సరైన మార్గం పొందటానికి, నా ఆజ్ఞలను అనుసరించాలి మరియు నా యందు విశ్వాసం కలిగి ఉండాలి' అని చెప్పండి."
పవిత్ర ఖురాన్‌లోని ఈ శ్లోకం విశ్వాసి హృదయానికి అమితమైన శాంతిని మరియు ధైర్యాన్ని ఇచ్చే ఒక అద్భుతమైన వచనం. ఉపవాస నియమాలను వివరించే సందర్భంలో ఈ ఆయత్ రావడం వెనుక ఒక గొప్ప అంతరార్థం ఉంది. ఉపవాసం వల్ల కలిగే శారీరక శ్రమను మర్చిపోయేలా, అల్లాహ్ తఆలా తన దాసులకు ఇచ్చే అత్యంత మధురమైన హామీ ఇది.
ప్రత్యేకమైన శైలి – అల్లాహ్ సాన్నిహిత్యం:
సాధారణంగా ఖురాన్‌లో ఎవరైనా ప్రవక్త గారిని ఏదైనా అడిగినప్పుడు, అల్లాహ్ "వారు నిన్ను అడుగుతారు... (ఓ ముహమ్మద్) వారితో చెప్పు (ఖుల్)" అని సమాధానమిస్తాడు అల్లాహ్ తఆలా. కానీ ఈ ఆయత్ లో మాత్రం అల్లాహ్ 'చెప్పండి' అనే పదాన్ని కూడా పక్కన పెట్టి, నేరుగా "నిజంగా నేను సమీపంలోనే ఉన్నాను" అని బదులిచ్చాడు. దీని ద్వారా అల్లాహ్ తనకి, తన దాసుడికి మధ్య ఉన్న దూరాన్ని పూర్తిగా తొలగించి మాట్లాడటం చూడవచ్చు. ప్రార్థన చేసే సమయంలో మనకు, మన సృష్టికర్తకు మధ్య ఎటువంటి మధ్యవర్తులు లేదా అడ్డంకులు లేవని ఇది స్పష్టం చేస్తోంది.
దుఆ (ప్రార్థన) యొక్క ప్రాముఖ్యత:
ఈ అయాహ్ ప్రకారం, అల్లాహ్ మన గళ సిర (Jugular vein) కంటే మనకు దగ్గరగా ఉంటాడు. "ప్రార్థించేవాడు నన్ను పిలిచినప్పుడు నేను అతని ప్రార్థనకు సమాధానమిస్తాను" అని అల్లాహ్ అభయమిస్తున్నాడు. రంజాన్ మాసంలో 'దుఆ' అనేది ఒక ముఖ్యమైన భాగమని ఇబ్న్ అషూర్ వంటి పండితులు వివరించారు. ఉపవాసం ఉన్న వ్యక్తి చేసే దుఆ అల్లాహ్ తఆలా వద్ద తిరస్కరించబడదని హదీసుల ద్వారా కూడా మనకు తెలియజేయబడింది.
దుఆ చేసే పద్ధతులు:
అల్లాహ్ మనకు దగ్గరగా ఉన్నాడని తెలిసినప్పుడు, మనం ఆయనను వేడుకునే విధానం కూడా గౌరవపూర్వకంగా ఉండాలి:
అల్లాహ్ స్తోత్రంతో ప్రారంభించడం: దుఆ చేసే ముందు అల్లాహ్‌ను కొనియాడాలి (హమ్ద్).
ప్రవక్త (సఅస) పై దరూద్ చదవడం: ఇది దుఆ ఆమోదానికి ఒక ముఖ్యమైన మెట్టు.
వినమ్రత (Humility): అత్యంత వినయంతో, కళ్ళలో నీళ్ళతో అల్లాహ్‌ను వేడుకోవాలి.
నమ్మకం (Conviction): అల్లాహ్ నా దుఆను ఖచ్చితంగా వింటాడు మరియు ఆమోదిస్తాడు అనే బలమైన నమ్మకంతో అడగాలి.
చేతులు చాచడం: అల్లాహ్ ముందు యాచకుడిలా చేతులు చాచి అడగడం సున్నత్.
ముఖ్యమైన దుఆలు:
1. ఇఫ్తార్ సమయంలో దుఆ (ఉపవాసం విరమించేటప్పుడు):
"దహబజ్ జమాఉ వబ్ తల్లతిల్ ఉరూకు వ సబతల్ అజ్రు ఇన్ షా అల్లాహ్."
(దాహం తీరింది, నరాలు తడిశాయి, అల్లాహ్ తలిస్తే పుణ్యం ఖాయమైంది.)
2. క్షమాపణ కోసం దుఆ (లైలతుల్ ఖద్ర్ లో చదివేది):
"అల్లాహుమ్మ ఇన్నక అఫువ్వున్ తుహిబ్బుల్ అఫ్వ ఫాఫు అన్నీ."
(ఓ అల్లాహ్! నీవు క్షమించేవాడవు, క్షమించడాన్ని ప్రేమిస్తావు, కావున నన్ను క్షమించు.)
3. ఇహపర లోకాల మేలు కోసం:
"రబ్బనా ఆతినా ఫిద్దున్యా హసనతవ్ వ ఫిల్ ఆఖిరతి హసనతవ్ వకినా అజాబన్నార్."
(ఓ మా ప్రభువా! మాకు ఇహలోకంలోనూ, పరలోకంలోనూ మేలును ప్రసాదించు మరియు మమ్మల్ని నరకాగ్ని నుండి రక్షించు.)
ఇక ఆఖరిగా, ఈ శ్లోకం కేవలం ఒక సమాచారం మాత్రమే కాదు, అది ఒక ఆత్మీయ అనుబంధం. మనం ఒంటరివారం కాదని, మన ప్రతి మాటను వినేవాడు మరియు మనకు అత్యంత సమీపంలో ఉన్నవాడు అల్లాహ్ తఆలా అని చాటిచెబుతుంది.


