'కాక్రోచ్ జనతా పార్టీ'
ఇటీవల భారతదేశంలో ఒక కోర్టు విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ.. నకిలీ డిగ్రీలతో జర్నలిజం, లా, ఆర్టీఐ వంటి రంగాల్లోకి ప్రవేశిస్తూ వ్యవస్థను నాశనం చేస్తున్న యువకులందరినీ 'బొద్దింకలు' (Cockroaches), (Parasites) అని సంబోధించారు. అయితే, ఈ వ్యాఖ్యలు నిరుద్యోగ యువతను ఉద్దేశించి చేసినవేనంటూ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగింది. ఆ తర్వాత సీజేఐ గారు తర్వాత వివరణను ఇస్తూ... తాను సాధారణ నిరుద్యోగులను అనలేదని, కేవలం నకిలీ సర్టిఫికెట్లతో చట్టవిరుద్ధంగా చొరబడే వారిని మాత్రమే అన్నానని స్పష్టత ఇచ్చారు. యువకులే ఈ దేశానికి మూల స్తంభాలని సర్దిచెప్పారు. కానీ, ఆ లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఇక ఒక్కసారిగా యువతలోని అసంతృప్తి మొత్తం, ఒక పెద్ద డిజిటల్ నిరసనగా, ఇంటర్నెట్లో యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే, ఈ అసంతృప్తిని అందుకున్నాడు 30 ఏళ్ల 'అభిజిత్ దీప్కే'. ఆయన పూణేలో జర్నలిజం చదివి, అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ నుండి పబ్లిక్ రిలేషన్స్ లో మాస్టర్ చేశాడు. ఈయనకి డిజిటల్ మార్కెటింగ్ లో మరియు రాజకీయంలో మంచి అనుభవం ఉంది. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) యొక్క మాజీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా 'అభిజీత్ దిప్కే' పని చేశాడు.
ఇక మే 16న అతను తన ఎక్స్ (ట్విట్టర్) లో ఒక గూగుల్ ఫారం పోస్ట్ చేసి, "బొద్దింకలందరూ ఏకం అవ్వండి అని వ్యంగ్యంగా అంటూ, ఈ 'కాక్రోచ్ జనతా పార్టీ'ని ప్రకటించాడు. చాట్ జెపిటి, క్లౌడ్ లాంటి ఏఐ టూల్స్ ను ఉపయోగించి, కేవలం 24 గంటల్లోనే పార్టీ లోగో, నినాదాలు, వెబ్సైట్ అన్ని తయారు చేశేసాడు.
ఇంకా ఈ పార్టీలో చేరడానికి కొన్ని అర్హతలు కూడా ఉంచాడు. కచ్చితంగా నిరుద్యోగి, బద్ధకస్తుడు, ఎప్పుడూ ఫోన్ పట్టుకుని ఆన్లైన్ లోనే గడపాలి, ఇక వ్యవస్థ మీద మీకున్న కోపాన్ని చాలా ప్రొఫెషనల్ పద్ధతిలో తిట్టగలగాలి. ఇంకా ఈ పార్టీ సెక్యులర్ (లౌకిక), సోషలిస్ట్ (సామాజిక), డెమొక్రటిక్ (ప్రజాస్వామ్య), బద్ధకస్తుల కూటమి అని చెప్పుకుంటుంది.
ఈ వ్యంగ్య పార్టీకి ఉన్న అసాధాకరమైన క్రేజ్ మరియు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోవర్లను చూస్తే, ఇంస్టాగ్రామ్ లో సంవత్సరాల తరబడి ఉన్న భాజాపా యొక్క ఫాలోవర్లు 8.8 మిలియన్లు ఉన్నారు. ఇంకా కాంగ్రెస్ కు 13.3 మిలియన్లు మాత్రమే. మరి సరికొత్తగా ప్రారంభించిన సీజేపీకి (కాక్రోజ్ జనతా పార్టీ) మాత్రం కేవలం కొద్ది రోజుల్లోనే 20 మిలియన్ల ఫాలోవర్లను చేజిక్కించుకొని సరికొత్త రికార్డును సృష్టించింది. ఇంకా ఈ ప్రధాన రాజకీయ ఆన్లైన్ నమోదుల సమాచారం లభ్యం కానప్పటికీ, ఆన్లైన్ ద్వారా కాక్రోచ్ జనతా పార్టీకి మాత్రం ఇప్పటికే 3.5 లక్షల సభ్యత లభించడం గొప్ప విషయం.
ఇక ఇదంతా కేవలం సరదా కోసం చేస్తున్నారా అంటే, పూర్తిగా అలా అనలేం. ఎందుకంటే 'కాక్రోచ్ జనతా పార్టీ' విద్యార్థుల సమస్యలపై చాలా గట్టిగా మాట్లాడుతుంది. ముఖ్యంగా ఇటీవల జరిగిన నీట్ పరీక్షల అవకతవకల గురించి, ప్రశ్న పత్రాల లీకేజ్ గురించి ప్రశ్నిస్తూ, గట్టిగా గొంతు పెంచింది. ఇంకా సీబీఎస్సీ 'రీ చెకింగ్' ఫీజు రద్దు చేయాలని గట్టిగా చెప్పింది.
అంతేకాదు రాబోయే బీహార్ లోని, బాంకిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో, తమ అభ్యర్థిని పోటీకి నిలబెట్టాలని ఈ పార్టీ మద్దతుదారులు గట్టిగా చెబుతున్నారు.
అంటే ఒక ఇంటర్నెట్ జోక్ కాస్తా, జాతీయ ఎలక్షన్లలో పాల్గొనే వరకు దారితీస్తుంది అన్నమాట. ఈ మొత్తాన్ని చూసి ప్రభుత్వమే కదిలిపోయింది. దీంతో ఇక 'కాక్రోచ్ జనతా పార్టీ'కి చెందిన ఎక్స్ ఖాతా భారత దేశంలోనే నిలిపివేయబడింది. కేంద్ర ఐటి మంత్రిత్వ శాఖ, ఇంటలిజెన్స్ బ్యూరో ఇచ్చిన జాతీయ భద్రతా సమాచారం మేరకు ఐటి చట్టం, సెక్షన్ 69a కింద చర్య తీసుకుంది మరియు ఈ ఖాతా నిలిపివేసే సమయానికి, దాదాపు దీని ఫాలోవర్లు రెండు లక్షలకు పైగా ఉన్నారు. ఇంకా అకౌంట్ నిలిపివేసిన కొద్ది గంటల్లోనే, ఫౌండర్ అభిజిత్ దీప్కే "ఎట్ ది రేట్ ఆఫ్ కాక్రోచ్ ఇస్ బ్యాక్" అనే కొత్త ఎక్స్ ఖాతాను తెరిచి మొదటి పోస్ట్ గా "మా నుంచి తప్పించుకోగలరనుకుంటున్నారు" అంటూ పెట్టిన పోస్టు, కేవలం కొన్ని గంటల్లోనే 39 వేలకు పైనే ఫాలోవర్లను చేజిక్కించుకుంది. ఎక్స్ ఖాతా బ్లాక్ అయిపోయినప్పటికీ, ఈ పార్టీ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఇంకా కేవలం ఐదు రోజుల్లోనే ఏకంగా 18 మిలియన్ల ఫాలోవర్లకు పైనే దూసుకుపోతుంది. ఇది అధికార భాజాపాపార్టీ 8.8 మిలియన్లు మరియు కాంగ్రెస్ 13.3 మిలియన్ల కన్నా చాలా ఎక్కువ. ఇదే సమయంలో 'అభిజిత్ దీప్కే' తన ఇంస్టాగ్రామ్ ఖాతా మరియు కొన్ని వ్యక్తిగత ఖాతాలో హ్యాక్ చేయడానికి ప్రయత్నించబడుతున్నాయంటూ ఆరోపించారు.
ఇంకా ఈ నిరసన కేవలం ఇంటర్నెట్కే పరిమితం కాకుండా, రోడ్డుపైకి కూడా వచ్చేసింది. ఢిల్లీలోని "కాలింది గంజ్" వద్ద యువకులందరూ కట్టుగలసి కాక్రోచ్ వేషధారణ ధరించిమరీ, "నేను కాక్రోచ్ ను", "మై కాక్రోచ్ హూ" అనే బోర్డులతో, యమునా నదిని శుభ్రపరిచే కార్యక్రమంలో పాల్గొని, సరికొత్త పద్ధతిలో నిరసన తెలిపారు.
ఈ హాస్యాస్పద రాజకీయం కేవలం మీమ్స్కే (హాస్య పూరిత చిత్రాలు / వీడియోలు) పరిమితం కాలేదు. తృణమూల్ కాంగ్రెస్ (TMC) ఎంపీలు మహువా మోయిత్రా, కీర్తి ఆజాద్లతో పాటు సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్ ... వంటి ప్రముఖులు ఈ పార్టీ ట్వీట్లకు స్పందించారు. 'తాను కూడా ఈ కాక్రోచ్ పార్టీలో చేరాలనుకుంటున్నాను' ,'మై కాక్రోచ్ హూ' అంటూ కొన్ని ప్రతిస్పందనలు వచ్చాయి. ఇంకా మహువా మోయిత్రా ట్వీట్ చేయగా... '1983 వరల్డ్ కప్ గెలవడమే మీకున్న పెద్ద అర్హత, వెల్కమ్ టు CJP' అంటూ సదరు పార్టీ హ్యాండిల్ ఆమెను ఆహ్వానించింది.
ఈ సందర్భంలో కాక్రోచ్ జనతా పార్టీ ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తోంది. యువత తమ బాధను వ్యక్తపరచడానికి సంప్రదాయ రాజకీయ వేదికలకంటే కొత్త, సృజనాత్మక, మరియు వ్యంగ్య రూపాలను ఎంచుకుంటోంది. అందువల్ల ఇది కేవలం ఒక ఇంటర్నెట్ ట్రెండ్ కాదు; మారుతున్న రాజకీయ సంస్కృతికి సూచిక కూడా.
కామెడీ వెనుక అసలు రాజకీయం?
పైకి ఇదంతా కేవలం ఒక సరదా మీమ్ పేజీలా కనిపిస్తున్నప్పటికీ, దీని వెనుక పెద్ద రాజకీయ వ్యూహం ఉందనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ పార్టీని స్థాపించిన అభిజీత్ దిప్కే సాధారణ నెటిజన్ (డిజిటల్ ప్రపంచంలో లేదా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారిని నెటిజన్లు అంటారు) కాదు. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 'ఆమ్ ఆద్మీ పార్టీ' (AAP) తరఫున సోషల్ మీడియా ప్రచారాన్ని నడిపించిన కీలక వ్యక్తి. గతంలో రైతుల నిరసనలు, ఈవీఎంలపై అనుమానాలు, బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక ప్రచారాల్లో ఇతను చురుగ్గా పాల్గొన్నారు. దీనితో పాటు ఈ పార్టీ మేనిఫెస్టోను గమనిస్తే విపక్షాల అజెండా స్పష్టంగా కనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.
ఇది కేవలం నిరుద్యోగ యువత చేసిన ఆకతాయి సృష్టా? లేక డిజిటల్ ప్లాట్ఫామ్లపై బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు నడుపుతున్న ఒక పక్కా ప్లాన్డ్ సోషల్ మీడియా ప్రయోగమా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
చివరిగా ఒక్క మాట, పక్క దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ యువత రోడ్లపైకి వచ్చి ప్రభుత్వాలను పడగొట్టాయి. కానీ మనదేశంలో అలాంటి జగడాలు జరగాల్సిన అవసరం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి తావులేదు. కానీ రాజకీయ నాయకులను సోషల్ మీడియాలో ప్రశ్నించడం, వారి అబద్ధాలను నమ్మకపోవడం, వారి రిపోర్టు కార్డులను షేర్ చేయడం వలన యువత ఒక డిజిటల్ సత్యాగ్రహం చేయవచ్చు అని ఈ ఉజ్వలం నిరూపిస్తుంది.
ఇంకా ఈ బొద్దింకల ప్రత్యేకత ఏంటంటే, ఒక దాన్ని నొక్కితే ఇంకో ఐదు పుట్టుకొస్తాయి. అణు బాంబు వేసినా అవి తట్టుకోగలవు. మన దేశంలో నిరుద్యోగులు పెరుగుతున్న ధరలు మరియు యువతలో రాజకీయం పట్ల ఎంత అసంతృప్తి ఉందో చెప్పడానికి ఈ బొద్దింకల పార్టీ ఒక గొప్ప ఉదాహరణ. మొత్తానికి నవ్వుకుంటూనే మన వ్యవస్థను ప్రశ్నించే, ఈ పార్టీ నాకు కూడా నచ్చింది.


