ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం
ప్రపంచానికి వచ్చే ప్రతి ఒక్కరూ ఏదో ఒక లక్ష్యాన్ని సాధించాలనే ఆశతో ఈ లోకంలోకి అడుగు పెడతారు. కానీ తమ లక్ష్యాన్ని తెలియజేసుకోకుండా ప్రపంచ పనులలో లేదా తమ సమయాన్ని ఉత్సాహంగా గడపడానికి ఉపయోగించిన కొంతమంది ఇప్పటికీ ఉన్నారు. లక్ష్యాన్ని తెలుసుకున్న కొంతమంది తమ లక్ష్యాన్ని కోల్పోయి వివిధ రకాల ప్రపంచ కార్యాలలో మునిగిపోయారు. కొంతమంది ప్రపంచాన్ని పొందాలన్నా ఆశతో అనేక రకాల ప్రయత్నాలు చేసి లోకాన్నే నాశనం చేశారు. దీనివలన తరువాతి రోజుల్లో ప్రజలు తమ క్రూరత్వాన్ని పెంచి వారి మనుషులను వారే చంపడం మొదలుపెట్టారు. ఇలాంటి నలిగి కరిగి చెడిపోతున్న మూర్ఖత్వలోకంలో దివ్య కాంతిని నింపి ప్రపంచ చరిత్రనే మార్చిన మామూలు మనిషే మన ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం.
ఇలాంటి ప్రపంచాన్ని కాంతితో నింపడానికి అల్లాహ్ ఇష్టపడిన వారిని ప్రపంచానికి ప్రవక్తగా పంపారు. కానీ వచ్చిన అందరూ తమ దేశానికి లేదా తమ ఊరికి మాత్రమే ప్రవక్తగా వచ్చారు. వచ్చిన అందరూ అల్లాహ్ ఆశించినట్టుగా పరలోకానికి చేరిపోయారు. చేరిపోయిన తర్వాత ఇతరులను ఈ లోకానికి ప్రవక్తగా పంపడం జరిగింది. కానీ మన ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తరువాత ఏ ప్రవక్తను అల్లాహ్ పంపలేదు. ఖురాన్ లో అల్లాహ్ ఈ విధంగా ప్రవచించారు.
وما أرسلناك إلا رحمة للعالمين
మన ప్రభువు ఈ సృష్టిని సృష్టించక ముందే మన దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క కాంతిని సృష్టించారు. ఆ కాంతితోనే ఈ లోకాన్ని సృష్టించాడు. మన దైవ ప్రవక్త కాంతి సృష్టించిన తరువాతే దూతలని, మనుషులని, లోకాన్ని మరియు జంతువులని సృష్టించడం జరిగింది. దైవ ప్రవక్త ఈ ప్రపంచంలోకి అడుగు వేసినప్పుడు ఆయన మామూలు మనిషిగా వచ్చారు. కానీ వారి మంచితనమే అతన్ని అల్లాహ్ వద్ద గౌరవాన్ని పెంచింది. 40 సంవత్సరాలు ఉన్నప్పుడు వారిని ప్రవక్తగా ఎన్నుకున్నాడు.
ప్రవక్త కాకముందే పెద్దలను గౌరవించేవారు, చిన్నపిల్లలను చాలా ప్రేమించేవారు మరియు దయ చూపించేవారు ,ఇతరులకు ఏ కష్టం వచ్చినా సహించలేకపోయేవారు, పేదల పట్ల దయ చూపించి ఆహారాన్ని పంచేవారు. వారు తమ యవ్వన వయసులోనే అతని ముఖ్య లక్ష్యాన్ని పొందాలని ఒంటరిగా సమయాన్ని గడిపేవారు. అసలు మనం ఈ ప్రపంచానికి రావడం గల కారణం ఏమిటి? దేవుడు మమ్మల్ని ఎందుకు సృష్టించాడు అనే ప్రశ్నలు అతని మెదడులో తిరుగుతూ ఉండేవి. ఈ ప్రశ్నలే అతన్ని దేవుడి దగ్గరకు చేరుకునే మార్గం అయింది.
జిబిరిల్ అలైహి సలాం వచ్చి "మిమ్మల్ని అల్లాహ్ ప్రవక్తగా ఎన్నుకున్నారు" అని శుభవార్తను తెలిపారు. శుభవార్త విన్న మరుక్షణం నుండే ఇస్లాం పై శ్రద్ధ వహించడం మొదలుపెట్టారు. ఇస్లాం వైపు ప్రజలను పిలవడం మొదలుపెట్టారు. అల్లాహ్ వారికి చెప్పాలనుకున్న ప్రతి మాట ఖురాన్ రూపంలో జిబ్రిల్ అలైహిస్సలాం ద్వారా ప్రవక్త వద్దకు చేర్చారు. అనేకరకాల జాతుల, కుల మతాల వారిని ఇస్లాం వైపు పిలిచి స్వర్గదారిని చూపించారు. పిలిచిన ప్రతిసారి అందరూ ఇస్లాం వైపు రాలేదు. వారిలో చాలామంది వారికి వ్యతిరేకంగా నిలబడ్డారు. ఆఖరికి తన సొంత తెగ ఖురైష్ కూడా వారికి వ్యతిరేకంగా నిలబడ్డారు.
ఇలాంటి ఎన్నో ద్వేష రోషాలతో, క్రూరత్వంతో మన ప్రవక్తను హింసించేవారు. కానీ ఒక సంఘటన మాత్రం చరిత్రనే మార్చేసింది. ప్రవక్త ఇస్లాం వైపు పిలవడానికి తాయిఫ్ ప్రవేశించారు. ప్రజలను ఇస్లాంను వివరించారు. కానీ ప్రజలు తిరగబడ్డారు, హింసించారు మరియు రాళ్లు విసిరి కొట్టారు. కొట్టి గాయపరిచారు. అతని శరీరం మొత్తం రక్తంతో కారడం చూడలేక అల్లాహ్ జిబ్రీల్ అలైహి సలాంని పంపి తాయిఫ్ని ధ్వంసం చేయడానికి అనుమతిని కోరారు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఓ జిబ్రిల్ వీళ్ళని ఏం చేయొద్దు వీరు కాకపోతే వారి సంతానం ఇస్లాం స్వీకరించవచ్చు, కనుక ఈ ఊరిని ఏం చేయకండి అని తెలిపారు.
ఇలాంటి మంచి మనసు, దయతో కూడిన హృదయం, ఓర్పుతో కలిగిన వ్యక్తి మన ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇతని గురించి మనం ఎంత చర్చించుకున్నా ఎంత తెలుసుకున్నా తక్కువే!