"స్వాతంత్య్ర సమరంలో ముస్లిం యోధులు: భారతదేశానికి స్వాతంత్ర్యం అందించిన వీరులు"

మన భారతదేశం బ్రిటీష్ అనాధికార పాలన నుండి ఆగష్టు 15, 1947 న స్వాతంత్య్రం  పొందింది. దాదాపు 77 సంవత్సరాల క్రితం జరిగిన ఒక ముఖ్యమైన రోజు ఇది. 1857 నాటి సుప్రసిద్ధ తిరుగుబాటుతో సహా బ్రిటీష్ పాలనలో జరిగిన అనేక ఉద్యమాలు మరియు సంఘర్షణల యొక్క ఫలితం. ఈ పోరాటంలో గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, అబ్దుల్ గఫార్ ఖాన్, మౌలానా ఆజాద్ లాంటి ముఖ్యమైన నాయకులు పాల్గొన్నారు. అంతేగాక "మొదటి భారత స్వాతంత్ర్య పోరాటం" మౌలవి అహమదుల్లా షా నేతృత్వంలో నిర్వహించబడింది. బ్రిటిష్ రాజ్‌కు వ్యతిరేకంగా కుట్ర పన్నినందుకు 27 సంవత్సరాల వయస్సులో ఉరి తీయబడిన మొదటి వ్యక్తి అష్ఫాఖుల్లా ఖాన్. షా నవాజ్ ఖాన్ ఇండియన్ నేషనల్ ఆర్మీలో రాజకీయ నాయకుడిగా కాకుండా చీఫ్ ఆఫీసర్ మరియు కమాండర్‌గా పనిచేశారు. అలాగే ఎందురో స్త్రీలు కూడా ఆ పోరాటంలో పాల్గొన్నారు.

అయితే! ప్రస్తుతం, భారతీయ ముస్లింలు ఎంతో వివక్షను ఎదుర్కొంటున్నారు. వారి దేశభక్తినినే ప్రశ్నిస్తున్నారు. మతతత్వ పార్టీలు ముస్లింలను పక్కనపెట్టి చరిత్రను తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అలాగే సామాజిక మాద్యామాల ద్వారా భారతీయ ముస్లింల గురించి తప్పుదారి పట్టించే సమాచారాన్ని ముస్లిం వ్యతిరేక పద్ధతిలో ప్రచారం చేస్తున్నారు. భారత స్వాతంత్ర్యం కోసం ముస్లింల త్యాగాలు అతీతం. చరిత్రలో సాధారణంగా, భారతీయ ముస్లింలు స్వాతంత్య్ర పోరాటానికి చాలా సహాయపడినారు. అంతేకాకుండా వలసవాదానికి వ్యతిరేకంగా జరిగిన జాతీయ పోరాటంలో వారు తమయొక్క  ప్రాణాలను కూడా అర్పించారు. ఢిల్లీలోని ఇండియా గేట్‌పై పేర్కొన్న 95300 మంది స్వాతంత్య్ర సమరయోధులలో 61945 మంది ముస్లింల పేర్లే ఉన్నాయి. మొత్తం విముక్తి యోధులలో 65% మంది ముస్లింలు అని మిల్లీ క్రానికల్‌లోని ఒక కథనంలో నివేదించారు. "భారత స్వాతంత్ర్యం ముస్లింల రక్తంతో ఏర్పడింది. వారు కొంత మంది అయినప్పటికీ,  స్వాతంత్య్ర పోరాటంలో చాలా పెద్ద పాత్రనే పోషించారు" అని ప్రముఖ కుష్వంత్ సింగ్ చెప్పారు.

భారత స్వాతంత్ర్య పోరాటంలో, ముస్లిం స్వాతంత్య్ర సమరయోధులు చాలా గణనీయంగా కృషి చేశారు. అయితే, కొన్ని మతోన్మాద గ్రూపులు చరిత్రలో తమ పాత్రను తక్కువ చేయడానికి విశ్వప్రయత్ననాలు చేస్తున్నాయి. కావున మనం భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ప్రముఖ ముస్లిం నాయకులను గురించి అవగాహణ చేసుకోవడం చాలా ముఖ్యం. అందువల్ల స్వాతంత్ర్యం కోసం పోరాడిన కీలకమైన ముస్లిం నాయకుల జీవిత చరిత్ర గురించి చాలా క్లుప్తంగా వివరిస్తున్నాను.

  1. మౌలానా అబుల్ కలాం ఆజాద్: మౌలానా అబుల్ కలాం ఆజాద్ ప్రముఖ భారతీయ పండితుడు, స్వాతంత్ర్య సమరయోధుడు మరియు భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నాయకుడు. అయన నవంబర్ 11, 1888 న సౌదీ అరేబియాలోని మక్కా నగరంలో పండితుల కుటుంబంలో జన్మించాడు. వారి తండ్రి, మౌలానా ముహమ్మద్ ఖైరుద్దీన్, బెంగాలీ ముస్లిం పండితుడు, వారి తల్లి అరబ్ దేశానికి చెందినది. అబుల్ కలాం గారి కుటుంబం 1890 లో భారతదేశానికి తరలివెళ్లి, కలకత్తాలో స్థిరపడింది. మౌలానా  ఆజాద్ ఇంట్లోనే తన తల్లిదండ్రుల వద్ద విద్యను అభ్యసించారు. అంతేగాక ప్రతిభావంతుడు,బహుముఖశాలి. అరబిక్, పర్షియన్, ఉర్దూ మరియు ఇంగ్లీషు లాంటి అనేక భాషలను నేర్చుకున్నాడు. 12 సంవత్సరాల వయస్సులో అయన వ్యాసాలను ప్రచురించాడు, మరియు లిసానుల్-సిద్క్ అనే మాసపత్రికను ప్రారంభించాడు.

స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన యొక్క పాత్ర: ఆజాద్ చిన్న వయస్సులోనే భారత స్వాతంత్య్ర ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొన్నారు. హిందూ-ముస్లింల ఐక్యత కోసం కృషిచేశారు. భారతదేశ విభజన  చర్యను వ్యతిరేకించారు, విభజన దేశ సమగ్రతకు హాని కలిగిస్తుందని విశ్వసించారు. అతను విప్లవ నాయకులచే చాలా ప్రభావితమయ్యాడు మరియు బ్రిటిష్ పాలనను తీవ్రంగా ఖండించాడు.

1912లో, అతను "అల్-హిలాల్" అనే ఉర్దూ వారపత్రికను ప్రారంభించాడు. ఇది స్వాతంత్ర్యం గురించి అవగాహన కల్పించడం మరియు ముస్లింల మద్దతు పొందడం కోసం పనిచేసింది. అతను ఖిలాఫత్ ఉద్యమంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషించాడు మరియు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ యొక్క అహింసా విధానాన్నికి మద్దతు ఇచ్చాడు.

  1. బహదూర్ షా జఫర్: బహదూర్ షా జఫర్, అక్టోబర్ 24, 1775న ఢిల్లీలో జన్మించారు. చివరి మొఘల్ చక్రవర్తి మరియు భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో ముఖ్యమైన వ్యక్తి. బహదూర్ షా జఫర్ అక్బర్ షాII మరియు లాల్ బాయిలకు మీర్జా అబూ జాఫర్ సిరాజుద్దీన్ ముహమ్మద్ గా జన్మించారు. తన తల్లిదండ్రులకు ద్వితియ కుమారుడు మరియు తొలుత వారసుడిగా అంగీకరించలేదు. వారికి అరబిక్ మరియు పెర్షియన్ భాషలపై చాలా నైపుణ్యం ఉండేది. అలాగే అతనికి పోరాట కళలు, గుర్రపు స్వారీ మరియు విలువిద్యలు వెన్న పెట్టినవిద్యలు. జఫర్ కవిత్వం, సంగీతం మరియు నగీషీ వ్రాతపై చాలా ఆసక్తిని పెంచుకున్నారు. నైపుణ్యత కలిగిన ఉర్దూ కవి మరియు కాలిగ్రాఫర్ కూడను. అతని సాహిత్య నైపుణ్యం అతనికి పెర్షియన్ భాషలో "జఫర్" అనే కలం పేరును సంపాదించిపెట్టింది. వారు మొఘల్ సామ్రాజ్యం మరియు విస్తృత అనుభవాల గురించి తన మనోభావాలను ప్రతిబింబించే అనేక గజల్స్‌ను వ్రాసాడు.

స్వాతంత్య్ర ఉద్యమంలో బహదూర్ షా జాఫర్ యొక్క పాత్ర: బహదూర్ షా జఫర్ భారతదేశపు చివరి మొఘల్ చక్రవర్తి. వారు శక్తివంతమైన పాలకుడు కానప్పటికీ, బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్య్రం కోసం భారతదేశం యొక్క పోరాటంలో అతను ముఖ్యమైన పాత్ర పోషించాడు. 1857 భారత తిరుగుబాటు సమయంలో, సిపాయిలు (భారత సైనికులు) మరియు విప్లవకారులు బహదూర్ షా జాఫర్‌ను హిందుస్తాన్ చక్రవర్తి చేశారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటానికి నాయకత్వం వహించాలని వారు కోరుకున్నారు. మొదట, జఫర్ కి  అయిష్టంగా ఉన్నప్పటికీ, చివరికి అతను తిరుగుబాటు నాయకుడిగా అంగీకరించాడు. అతని మద్దతు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటుకు మరింత చట్టబద్ధతను ఇచ్చింది.

          తిరుగుబాటు సమయంలో ఢిల్లీలోని జఫర్ కోర్టు విప్లవ కార్యకలాపాలకు కేంద్రంగా మారింది. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా వివిధ సమూహాలను ఏకం చేసేందుకు ప్రయత్నించారు. అతను మతసహనం మరియు హిందూ - ముస్లింల ఉమ్మడి సంస్కృతిని నొక్కి చెప్పాడు. అయినప్పటికీ, తిరుగుబాటులో అతని ప్రమేయం బ్రిటిష్ వారిచేత ఓడిపోయిన తర్వాత అనేక సమస్యలకు దారితీసింది.

వారు ఓడిపోయినప్పటికీ, 1857 భారత తిరుగుబాటు సమయంలో బహదూర్ షా జఫర్ నాయకత్వం అతన్ని భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రతిఘటనకు చిహ్నంగా చేసింది. ఆయన కవిత్వం మరియు ఐకమత్యంపై నమ్మకం ఇప్పటివరకు ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉంది. అందుకే భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో ఆయన ఒక ముఖ్యమైన వ్యక్తి మరియు మన భారతీయలు ఆయనని ఇప్పటి వరకు గుర్తు చేసుకొంటారు.

  1. కెప్టెన్ అబ్బాస్ అలీ: అబ్బాస్ అలీ 1920 జనవరి 3న బులంద్‌షహర్ (ఉత్తరప్రదేశ్)లోని ఖుర్జాలో జన్మించారు. అయన స్వాతంత్ర్య సమరయోధుల రాజ్‌పుత్ ముస్లిం కుటుంబానికి చెందినవాడు. ఆయని తాత పేరు రుస్తమ్ అలీ ఖాన్. 1857 తిరుగుబాటు తర్వాత బులంద్‌షహర్‌లోని కాలా ఆమ్‌లో బ్రిటిష్ సైన్యం అతనిని ఉరితీసింది. తన యుక్తవయస్సులోనే పాఠశాల విద్యను పూర్తి చేశారు. తర్వాత అయన భారత విముక్తి అనే ఉద్యమంలో చేరారు. అబ్బాస్ అలీ తన పాఠశాల దశ నుండే భగత్ సింగ్ యొక్క విప్లవాత్మక సూత్రాలకు ప్రభావితమయ్యాడు. భగత్ సింగ్ మరణశిక్షను వ్యతిరేకిస్తూ ఖుర్జాలో మార్చి 25, 1931న జరిగిన నిరసనలో కూడా అతను పాల్గొన్నాడు. భగత్ సింగ్ ను ఉరితీసిన వెంటనే, అతను భగత్ సింగ్ స్థాపించిన నౌజవాన్ భారత్ సభలో చేరాడు మరియు అతను పాఠశాలలో ఉండగానే దాని కార్యకలాపాలలో చురుకుగా పాల్గొన్నాడు.

          అయన 1936లో ముహ్మద్ అష్రఫ్ ప్రేరణతో స్థాపించబడిన పార్టీల విద్యార్థుల శాఖ అయిన ఆల్-ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (AISF)లో చేరాడు. ఇంకా ఆయన ఇండియన్ నేషనల్ ఆర్మీ (INA) అని పిలువబడే ఆజాద్ హింద్ ఫౌజ్‌లో చేరాడు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ దర్శకత్వం వహించిన 1945లో INA యొక్క (ఛలో డిల్లీ) ప్రచారంలో ఆయన ఒక ముఖ్య భాగం అయ్యాడు.

ఆయన అరకాన్‌లో భారత సైన్యంతో యుద్ధంలో నిమగ్నమయ్యాడు. కానీ అతను 60000 ఇతర INA సైన్యాల మధ్య పట్టుబడ్డాడు మరియు ఆ తరువాత కోర్టు-మార్షల్ చేయబడ్డాడు మరియు చివరికి మరణశిక్ష గురయ్యారు. 1947లో స్వాతంత్య్ర వచ్చిన తర్వాత, ప్రధాన మంత్రి నెహ్రూ ప్రభుత్వం విడుదల చేసింది తర్వాత రాజకీయాల్లో చేరాడు. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించినప్పుడు ఆయన 19 నెలలు జైలు జీవితం గడిపారు. అంతేగాక తన జీవిత కాలంలో 50 సార్లు పైగా జైలు జీవితం గడిపాడు. గుండె నొప్పి కారణంగా, అయన అక్టోబర్ 11, 2014 న మరణించాడు.

4.మౌలానా మజరుల్ హక్: ఆయన 1866 డిసెంబర్ 22న బీహార్‌ పాట్నాలోని బహుపురాలో జన్మించారు. ఈయన తండ్రి పేరు షేక్ అహ్మదుల్లాహ్ మరియు తండ్రికి ఏకైక కుమారుడు. మజరుల్ హక్ తన ప్రారంభ దశలో ఉర్దూ మరియు పర్షియన్ భాషలను అభ్యసించారు. ఆ తరువాత పాట్నా కాలేజియేట్ స్కూల్‌లో చదివారు. ఆయన లక్నోలోని కానింగ్ కళాశాలలో తన విద్యను పూర్తి చేశాడు. లండన్‌లో న్యాయశాస్త్రం చదివాడు, 1891లో బారిస్టర్‌గా భారతదేశానికి తిరిగి వచ్చాడు.

భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత, జాతీయవాద ఉద్యమంలో క్రియాశీలకంగా మారాడు. ఆయన హిందూ-ముస్లింల ఐక్యతను విశ్వసించి భారతదేశ స్వాతంత్య్రం కోసం రెండు వర్గాలను ఏకతాటిపై తీసుకురావడానికి ఎంతో కృషి చేశారు. మహాత్మాగాంధీకి మద్దతుగా చంపారన్ సత్యాగ్రహం మరియు సహాయ నిరాకరణ ఉద్యమం వంటి ఉద్యమాలలో ఆయన కీలక పాత్ర పోషించారు. మజరుల్ హక్ పాట్నాలో సదాకత్ ఆశ్రమాన్ని స్థాపించాడు, ఇది జాతీయవాద కార్యకలాపాలకు కేంద్రంగా మారింది. ఆయనని స్వాతంత్ర్యం మరియు విద్యను ప్రోత్సహిస్తూ ది మదర్‌ల్యాండ్ అనే పత్రికను కూడా ప్రచురించాడు. చివరికి ఆయన  జనవరి 2, 1930న మరణించాడు. ఆయన గౌరవార్థం, 1998లో పాట్నాలో మౌలానా మజరుల్ హక్ విశ్వవిద్యాలయం స్థాపించబడింది.

5.మౌలానా హస్రత్ మోహానీ: అయన జనవరి 1, 1875న ఉత్తరప్రదేశ్‌లోని (ఉన్నావ్) జిల్లా కస్బా మోహన్‌లో జన్మించాడు. ఆయన యొక్క అసలు పేరు సయ్యద్ ఫజల్-ఉల్-హసన్. వారి కలంపేరు హస్రత్. మోహన్‌లో పుట్టిన మోహని హస్రత్‌తో అనుబంధం ఏర్పడింది. ఆ తర్వాత హస్రత్ మోహనిగా పేరు తెచ్చుకున్నాడు. అయన ప్రాథమిక విద్య పూర్తి చేసిన తర్వాత అలీఘడ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో చేరాడు. కళాశాలలో ఉండగానే విప్లవ కార్యకలాపాల్లో చేరారు, దీనివల్ల 1903లో జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది. కాలేజీ నుండి బహిష్కరించబడినప్పటికీ, ఆయన యొక్క స్వేచ్ఛా తపన అచంచలమైనది. ఆయన 1903లో అలీఘర్ నుండి 'ఉర్దూ-ఎ-ముఅల్లా' పత్రికను ప్రచురించడం ప్రారంభించాడు. ఈ ప్రచురణ బ్రిటీష్ పాలన యొక్క నిరంకుశత్వం మరియు విమోచ విధానాలను విమర్శించే కథనాలను అందించింది. విపరీతమైన శిక్షార్హత లేకుండా, మౌలానా తన రచన ద్వారా స్వాతంత్య్ర ఉద్యమంపై అవగాహనను వ్యాప్తి చేయడం కొనసాగించాడు. 1907లో ఆయన మరోసారి జైలులో ప్రవేశించవలసి వచ్చింది. వారి రచనా ప్రభావం గురించి బ్రిటిష్ వారికి తెలుసు. ఆయని యొక్క అత్యున్నత ప్రభావానికి భయపడి ఆయన్ని ప్రచురణ మూసివేయబడింది. అందులో పాల్గొన్న కాంగ్రెస్ వాదుల్లో ఆయన ఒకరు. అతను 1907 వరకు కాంగ్రెస్‌లో పనిచేశాడు. బాలగంగాధర్ తిలక్ కాంగ్రెస్‌ను విడిచిపెట్టిన వెంటనే మౌలానా దానిని అనుసరించారు. హింసాత్మక విప్లవకారులకు వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర్య పోరాటంలో అయన తన ధైర్యాన్ని ప్రదర్శించాడు. కమ్యూనిస్టు పార్టీ స్థాపనలో కూడా పాల్గొన్నారు. 1925లో మరోసారి జైలు పాలయ్యాడు. 'ఇంఖిలాబ్ జిందాబాద్' అనే నినాదాన్ని 1921లో మౌలానా హస్రత్ మోహనీ మొట్టమొదట పలికారు. హస్రత్ మోహాని మే 13, 1951న మరణించారు.

స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల వల్ల మనం స్వేచ్ఛగా ఈ దేశంలో జీవిస్తున్నాము. మనం వారి త్యాగాలను స్మరించుకోవాలి. శాంతి, సామరస్యంతో జీవీస్తూ సామాజిక న్యాయాన్ని కొనసాగించడానికి కృషి చేయాలి. స్వాతంత్య్ర సమరయోధుల యొక్క కథలు నేటి చిన్నారులకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. వారి కష్టాలు జీవితంలోని వ్యత్యాసాలను, వారు పోరాడిన విలువల ప్రాముఖ్యతను చూపిస్తాయి. ఈ దేశంలో శాంతిని పెంపొందించడం ద్వారా, భారతీయ పౌరుడిగా మనం వాళ్ళ త్యాగాన్ని గౌరవించాలి. ఆ సమరయోధుల వల్లే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. స్వాతంత్య్ర పోరాటంలో భారతీయ ముస్లింల నిర్ధేశం చాలా కీలకమైనది.  అందుకే వారి ఉనికిలోనే స్వాతంత్య్రం ఇమిడిపోయింది. ప్రతి సంవత్సరం ఆగస్టు 15న మనం స్వాతంత్య్ర వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటాం. భారతదేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధులను ఎల్లపుడు స్మరించుకోవాలని కోరుకుంటున్నాము. దేశం కోసం వారు చేసిన త్యాగాలను మనం ఎప్పటికీ మరచిపోకూడదు. ఈ వీరుల జీవిత చరిత్రలు మన దేశభక్తిని పెంపోదిస్తాయి.

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter