ఫిఫా - 2026 “ట్రియండా”

ఆరోగ్యకరమైన జీవితానికి మంచి ఆహారం ఎంత ముఖ్యమో, ఆటా పోటీలు కూడా శరీరానికి అంతే ముఖ్యం. మన దైనందిన జీవితంలో మనం చేసే వ్యాయామాలు, ఆడే ఆటలు, ఒకవైపు నుంచి మన శరీరాన్ని శారీరకంగా ధృఢపరుస్తూనే, మరోవైపు నుంచి మానసికంగానూ మనల్ని బలోపేతం చేస్తాయి.. ఇంకా మన భారత దేశంలో ఎక్కువ శాతం మంది ప్రజలు ఆడే ఆటలు సుమారుగా జాతీయ మరియు అంతర్జాతీయ క్రీడలై ఉంటాయి. క్రికెట్, కబడ్డీ, టెన్నిస్, హాకీ, ఫుట్బాల్… ఇలా ఎన్నో ఉన్నాయి. ఇంకా ఈ క్రీడలన్నింటికీ చాలా పెద్ద పెద్ద చరిత్రలే ఉన్నాయి. ఇక భారతదేశంలో ఫుట్బాల్ ప్రేమికుల కొరత మాత్రం లేదు.

 ఈ సంవత్సరం మన భారతదేశంలో ‘టీ20 ఐపీఎల్’ ముగిసిన తర్వాత, ఒక్క భారతీయులే కాకుండా యావత్ ప్రపంచం నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే అంతర్జాతీయ వెన్నెల కోసం ఎదురుచూస్తోంది. అదే “ఫిఫా” అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడా పోటీ! ప్రపంచం మొత్తం ఆసక్తిగా వీక్షించే అత్యద్భుతమైన ఘట్టం ఫిఫా! మెస్సీ,రోనాల్డో,ఎంబాపెలాంటి ఫుట్బాల్ యోధులు మైదానంలో పాదరసంలో కదలాడుతూ చేసే విన్యాసాలు.. ఒక్కొక్కరూ తమ తమ ప్రతిభను చూపిస్తుండగా, వారి వారి నామస్మరణలతో దద్దరిల్లిపోయే స్టేడియాలు.. ఇంకా యావత్ ప్రపంచాన్ని టీవీలకి, ఫోన్లకి అతుక్కుపోయేలా చేసే వారి ఉత్కంఠభరితమైన దృశ్యాలు.. సుమారుగా 40 రోజుల పాటు సాగే ఈ ‘బంతాట’ వైపు అందరూ ఆకర్షితులవుతారు.

ఇంకా అందరికీ ఇష్టమైన ఈ ఫుట్బాల్ పండుగ, ఫిఫా ప్రపంచకప్, ఈ సంవత్సరం జూన్ 11 నుంచి జూలై 19 వరకు జరగనుంది. ఇదివరకు ఎన్నడు లేని విధంగా మూడు దేశాల్లో మ్యాచ్లు నిర్వహించడం, జట్లతో పాటు మ్యాచ్ల సంఖ్య పెరగడం, మెస్సీ, రోనాల్డోలాంటి స్టార్లకు ఆఖరి కప్ కానుండడం.. ఇలా ఈ ప్రపంచకప్ కు ఎన్నో విశేషాలు ఉన్నాయి. ప్రతి నాలుగేళ్లకోసారి వచ్చే ప్రపంచకప్, మొట్టమొదటిసారిగా 1930లో మొదలైంది. అప్పటి ప్రెసిడెంట్ గా 'రాబర్ట్ గురైన్'.ఈయన స్పెయిన్ దేశస్తుడు. ప్రస్తుతం ఇటలీకి చెందిన గియన్నీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. 

 దాని తరువాత రెండో ప్రపంచ యుద్ధం కారణంగా 1942,1946వ సంవత్సరాల్లో టోర్నమెంట్ జరగలేదు. దాని తర్వాతి ప్రయత్నం చాలా సునాయాసంగా, సాఫీగా, ప్రతిసారి టోర్నీకి అమితమైన ఆదరణను పెంచుకుంటూ సాగింది.

ఇంకా ఈ ఏడాది నెలకొనే ప్రపంచకప్ మునపటి టోర్నమెంట్లకు ఎంతో భిన్నంగా ఉండబోతుంది. 2022లో గల్ఫ్ దేశం కతార్ లో జరిగిన టోర్నీలో 32 జట్లు పోటీపడ్డాయి. ఇక ఆటను మరింత విశ్వవ్యాప్తం కోసం ఈసారి జట్ల సంఖ్యను 48 కి పెంచారు. దీంతో టోర్నీలో రికార్డు స్థాయిలో 104 మ్యాచ్లు జరుగునున్నాయి. 

ఈ ప్రపంచకప్నకు మూడు దేశాలు ఆతిథ్యం ఇవ్వడం అబ్బురపరిచే విషయం. దీంతో అమెరికా, మెక్సికో, కెనడా దేశాల్లో టోర్నీ జరగనుంది. ఇలా రెండు కన్నా ఎక్కువ దేశాలు కలిసి ప్రపంచకప్ నిర్వహించడం ఇదే తొలిసారి. గతంలో రెండు సార్లు (1970,1986) నిర్వహించిన మెక్సికో, మూడో పర్యాయం నిర్వహిస్తూ అత్యధిక సార్లు ‘ఫిఫా కప్’నకు ఆతిథ్యమిచ్చిన దేశంగా ఘనత వహిస్తోంది. 1994లో ప్రపంచకప్నకు వేదికగా నిలిచిన అమెరికాకు, ఇది రెండవ ఆతిథ్యం. కెనడాకు మొదటిసారి. ఇక జూన్ 11న మెక్సికో సిటీ స్టేడియంలో, మెక్సికో దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ తో మొదలై..జూలై 19న అమెరికాలోని ‘ది మెట్ లైఫ్ స్టేడియం’లో జరిగే ఫైనల్ పోరుతో ఈ టోర్నీ ముగుస్తుంది. మెస్సీ ఆధ్వర్యంలో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటినా తన తొలి మ్యాచ్ను జూన్ 16న అల్జీరియాతో ఆడనుంది.

క్వార్టర్ ఫైనల్స్ నుంచి మ్యాచ్లన్నీ అమెరికా స్టేడియాల్లో నిర్వహిస్తున్నారు. బెర్ముడా, కెంచుకి, బ్లూ గడ్డితో మైదానాలను తయారు చేశారు. ఫైనల్స్ సహా 8 మ్యాచ్లకు ఆతిథ్యమిస్తున్న మెట్ లైఫ్ స్టేడియంలో సాధారణంగా రగ్బీ మ్యాచ్లు జరుగుతుంటాయి. కానీ ఫిఫా టోర్నీకి అనుగుణంగా ఈసారి స్టేడియాన్ని ముస్తాబు చేశారు. ఇంకా అన్ని ఫిఫా స్టేడియాల్లోనూ మ్యాచ్ల కార్నర్ కిక్కులను దృష్టిలో ఉంచుకొని కార్నర్లలో 1700 పైగా సీట్లను తొలగించారు.

మొత్తంగా ఇప్పటిదాకా 22 సాకర్ ప్రపంచకప్లు జరిగితే వాటిలో కప్పులు చేజిక్కించుకునే అదృష్టం 8 దేశాలకు మాత్రమే దక్కింది. ఇందులో అత్యధికంగా ఐదుసార్లు బ్రెజిల్ ఛాంపియన్గా నిలిచింది. జర్మనీ, ఇటలీ నాలుగేసి సార్లు..అర్జెంటీనా మూడుసార్లు.. ఫ్రాన్స్, ఉరుగ్వే రెండేసి సార్లు విశ్వవిజేతులుగా నిలిచాయి. ఇంకా ఇంగ్లాండ్ మరియు స్పెయిన్ ఒక్కోసారి ట్రోఫీని ముద్దాడాయి. ఇంకా ఈ టోర్నీలో వాడే అధికారిక బంతి పేరు “ట్రియాండా”[TRIONDA] స్పానిష్ లో ట్రియాండా అంటే ‘మూడు అలలు’ అని అర్థం. ఈ బంతి ఆతిథ్య దేశాల గుర్తింపును సూచించేలా రూపుదిద్దుకుంది. ఎరుపు రంగు మేపుల్ లీఫ్ (కెనడా), ఆకుపచ్చ రంగు డే (మెక్సికో), నీలిరంగు నక్షత్రం (అమెరికా). బంతిలో 4 ప్యానెల్లు ఉంటాయి. దీనివల్ల బంతి స్థిరంగా, వేగంగా గాలిలో ఎగురుతుంది. ఇంకా ఇందులో 500 హెచ్ జెడ్ మోషన్ సెన్సార్ చిప్పులు అమర్చారు. ఇక ఈ బంతిని తన్ని, కప్పును కొట్టే యోధుల్ని చూడాలనే తపనతో ఫుట్బాల్ ప్రేమికులు రాత్రుల సైతం జాగారణ చేయనున్నారు. ఇంకా ప్రతి టోర్నీలో 3 గోల్డెన్ అవార్డులు కలవు. ఆట మొత్తంలో మెరుగైన ప్రదర్శన చేసిన ఆటగాళ్లను ఎంపిక చేసి పురస్కారాలు అందజేయడం ఫిఫా కప్ లోని ఆనవాయితీ. అందులో 1)గోల్డెన్ బాల్: టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఖిలాడీకి బెస్ట్ ప్లేయర్ విభాగం కింద దీన్ని ఇస్తారు. 

2) గోల్డెన్ బూట్: టోర్నీలో అత్యధిక గోల్స్ కొట్టిన ఖిలాడీకి దీన్ని అందజేస్తారు. 

3) గోల్డెన్ గ్లోవ్: టోర్నీలో ఉత్తమ గోల్డ్ కీపర్ కు దక్కి అవార్డు ఇది.

మరడోనా వారసుడిగా పేరుందిన 38 ఏళ్ల లియోనెల్ మెస్సీ తన చిరకాల స్వప్నాన్ని గత టోర్నీతో నెరవేర్చుకున్నాడు. ఆ టోర్నీలో ప్రతి మ్యాచ్లో గోల్ కొట్టి అందరినీ మెప్పించాడు. ఒక అరుదైన రికార్డును సృష్టించాడు. అది కాగా ఈసారి ప్రపంచకప్కు ముందు గాయపడడం మెస్సీ ఫిట్నెస్ పై అనుమానాలను రేకెత్తిస్తోంది. అనుమానాలు మొదలైనా, చివరికి ఎంపిక చేశారు. అయితే మెస్సీ మళ్ళీ మెప్పిస్తాడా?

గత టోర్నీలోని ఫైనల్లో అర్జెంటీనాకు, ఫ్రాన్స్ ఒక గట్టి పోటీని తలపెట్టింది. అభిమానులు మెస్సీ ఆట కోసం ఎంత ఎదురు చూస్తారో, ఎంబాపె మెరుపుల కోసం కూడా అంతే ఎగబడతారు. ఇక కతార్ టోర్నీ ఫైనల్లో ఫ్రాన్స్ ఓడినా, ఎంబాపె హ్యాట్రిక్ గోల్స్తో చెలరేగి మెస్సీకి దీటుగా నిలిచాడు. ఆ టోర్నీలో 8 గోల్స్ తో గోల్డెన్ బూట్ కూడా అందుకున్నాడు. ఇతడు మైదానంలో చిరుత వేగంతో, బంతిపై గొప్ప నియంత్రణతో, బంతిని గోల్డ్ పోస్ట్ వరకు చేర్చడంలో చాలా దిట్ట. మరి ఎంబాపె అందరికీ ‘బాప్’ అయి నిలుస్తాడా?

ఇంకా ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా ఆదాయాన్ని ఆర్జిస్తున్న ఫుట్బాల్ ఆటగాళ్లలో 41 ఏళ్ల క్రిష్టియానో రోనాల్డోదే అగ్రస్థానం. మైదానంలో తన మెరుపు చూపిస్తూ, ప్రత్యర్థులను చిత్తు చేసే నైపుణ్యం ఇతని సొంతం. అయితే జాతీయ జట్టుతో పాటు, తాను ప్రాతినిధ్యం వహించే క్లబ్బులకు ఎన్నో విజయాలను అందించాడు. కానీ, ఇప్పటిదాకా ప్రపంచకప్ను ముద్దాడకపోవడం తీరని లోటుగా మారింది. అయితే ఈసారి తన నాయకత్వంలో పోర్చుగల్ను ముందుకు నడిపించనున్నాడు. ఇతడికి ఇదే ఆఖరి ప్రపంచకప్ కావడంతో ఎలాగైనా జట్టును విజేతగా నిలపాలన్న పట్టుదలతో ఉన్నాడు. మరి పోర్చుగల్ వీరుడు సాధిస్తాడా?

ప్రతి ప్రపంచకప్లోను అందరి దృష్టిని ఆకర్షించే దేశం, బ్రెజిల్. ఎప్పటిలాగే దీని జట్టులో స్టార్ ఆటగాడు 34 ఏళ్ల నెయిమర్ జూనియర్ను ఎంపిక చేశారు. తాను ప్రాతినిధ్యం వహించిన క్లబ్బులకు ఘనమైన విజయాలను ఇతను కట్టిబెట్టాడు. ఇంకా కాన్ఫెడరేషన్ కప్పులో బ్రెజిల్ను గెలిపించి గోల్డెన్ బూట్ అవార్డును అందుకున్నాడు. మరి నెయిమర్ తన నాణ్యతను నిరూపిస్తాడా?

ఈ ప్రపంచ బంతాటలో ఆట ముగిసే వరకు ఉత్సాహం తగ్గే మాటన్నదే లేదు. ఇంత అంగరంగ వైభవంగా జరిగే సందడిలో మన భారతీయుల మదిలో మాత్రం ఒక ప్రశ్న దశాబ్దాలుగా గుచ్చుతూనే ఉంది. ఫిఫా ప్రపంచ కప్లో ఇండియా ఎక్కడ?  వాస్తవానికి, 140 కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి తప్పక చోటు దక్కుతుంది. కానీ ప్రతి దానికీ సమయం అన్నది రావాలి. ప్రతి నాలుగేళ్లకు కనీసం రెండు నుండి మూడు కొత్త చెట్లు టోర్నీలో ప్రవేశిస్తుంటాయి. భారత జట్టు మాత్రం అందులో అర్హతకు చాలా ప్రయత్నాలు చేసింది. కానీ  దురదృష్టవశాత్తు ఈసారి కూడా అందుకోలేకపోయింది. ఫిఫా ర్యాంకింగ్స్లో 136వ స్థానంలో దిగువన భారత్ ఎప్పటిలాగే ఈసారి కూడా ప్రపంచ దక్కించుకోవడంలో విఫలమైంది. ఆటగాళ్లకు మాత్రం ఎటువంటి కొరత లేకపోయింది. బైచుంగ్ భూటియా,  సునీల్ ఛెత్రిలాంటి స్టార్ ఆటగాళ్లున్నా సమష్టిగా రాణించలేక భారత్ ప్రతిసారి వెనుక పడుతూనే ఉంది. ఇక వాస్తవానికి, ఈ బంతాటలో రాణించేందుకు ఐకమత్యం తప్పనిసరి. అది లేకపోతే విపక్ష ప్రత్యర్థులకి ఎదుట ఆటగాళ్లు ఉన్నా లేనట్టే, గోల్ పోస్టులోకి బంతి వెళ్లినట్లే లెక్క.

ఇంకా ఫిఫా ప్రపంచకప్‌లో భారత్ కనిపించకపోవడంతో, ఫిఫాలో భారత్ లేదని భావించకూడదు. భారత్ ఫిఫా సభ్య దేశమే. అయితే ఇప్పటివరకు భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టు ఫిఫా ప్రపంచకప్ ప్రధాన టోర్నమెంట్‌కు అర్హత పొందలేదు అంతే.

ప్రపంచకప్‌లో పాల్గొనాలంటే వివిధ క్వాలిఫయింగ్ మ్యాచ్‌లలో విజయాలు సాధించి, అర్హత పొందాలి. భారత జట్టు ఇంకా ఆ స్థాయిలో స్థిరమైన ప్రదర్శన చేయలేకపోతోంది. అలాగే మన దేశంలో క్రికెట్‌కు ఉన్నంత ఆదరణ ఫుట్‌బాల్‌కు లేకపోవడం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు.

ఇంకా భారత ఫుట్‌బాల్ క్రమంగా అభివృద్ధి చెందుతోంది. యువ క్రీడాకారులు ముందుకు వస్తున్నారు మరియు అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన ప్రదర్శనలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. 1950లో భారత్ ఫిఫా ప్రపంచకప్‌కు అర్హత సాధించినప్పటికీ కొన్ని పరిపాలనా మరియు ఆర్థిక కారణాల వల్ల టోర్నమెంట్‌లో పాల్గొనలేదు.

ఇక ప్రస్తుతం ఫిఫా ప్రపంచకప్ 2026 రౌండ్ - ఆఫ్ 16 పోటీలు ఉత్కంఠభరితంగా ముగిశాయి. అర్జెంటీనా 2–0 వెనుకబడిన స్థితి నుంచి అద్భుతంగా పుంజుకుని ఈజిప్ట్‌పై 3–2తో విజయం సాధించింది. స్పెయిన్ చిరకాల ప్రత్యర్థి పోర్చుగల్‌ను 1–0తో ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోగా, బెల్జియం అమెరికాపై 4–1తో ఘన విజయభేరి మోగించింది. ఫ్రాన్స్ పరాగ్వేపై 1–0తో గెలిచింది. నార్వే స్టార్ స్ట్రైకర్ ఎర్లింగ్ హాలాండ్ అద్భుత ప్రదర్శనతో బ్రెజిల్‌ను 2–1తో ఓడించి సంచలనం సృష్టించాడు. ఇంగ్లాండ్ 10 మంది ఆటగాళ్లతోనే మెక్సికోను 3–2తో ఓడించింది. మరో ఉత్కంఠభరిత మ్యాచ్‌లో స్విట్జర్లాండ్, కొలంబియాను పెనాల్టీ షూటౌట్‌లో ఓడించి, చివరి ఎనిమిది జట్లలో స్థానం దక్కించుకుంది. దీంతో కెనడా, పరాగ్వే, బ్రెజిల్, మెక్సికో, పోర్చుగల్, అమెరికా, ఈజిప్ట్, కొలంబియా జట్లు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించగా, మొరాకో, ఫ్రాన్స్, నార్వే, ఇంగ్లాండ్, స్పెయిన్, బెల్జియం, అర్జెంటీనా, స్విట్జర్లాండ్ జట్లు క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించాయి. క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్–మొరాకో, స్పెయిన్–బెల్జియం, నార్వే–ఇంగ్లాండ్, అర్జెంటీనా–స్విట్జర్లాండ్ జట్లు తలపడనున్నాయి.

ఇంకా ఈ ప్రపంచకప్ తో పర్యావరణానికి తీవ్ర ముప్పు పొంచి ఉంది. మ్యాచ్ల కోసం ఆటగాళ్లు, కోచులు, అధికారులు, లక్షలాదిమంది ప్రేక్షకులు, అభిమానులు మూడు దేశాల మధ్య సుదీర్ఘ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కనుక, దీనితోనే ప్రకృతి తప్పక దెబ్బతింటుంది అనడంలో సంశయం లేదు. దాదాపు టోర్నీ పూర్తయ్యే లోపు ఏకంగా తొమ్మిది మిలియన్ల టన్నులకు పైగా కార్బన్ ఉద్గారాలు విడుదల అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు, నిపుణులు హెచ్చిస్తున్నారు. ఇంకా ఇది ఫుట్బాల్ చరిత్రలోనే అత్యంత కాలుష్యకరమైన ప్రపంచకప్ గా మిగిలిపోయే ప్రమాదం లేకపోలేదని పర్యావరణవేత్తలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకా దీంతో తీవ్రమైన ఎండ, ఉక్కపోతలవల్ల ఆటగాళ్ల ఆరోగ్యం మ్యాచ్ల వీక్షణకు వచ్చే అభిమానుల భద్రతకు ఆందోళనకరంగా మారొచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇక ఆఖరిగా, ఈ తాత్కాలిక ప్రపంచంలో ఐపిఎల్, ఫిఫా, డబ్ల్యూ డబ్ల్యూ.. ఇలా కోకొల్లలు ఉంటాయి. కానీ, “ఒక విద్యాంసుడు మరియు దాసుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తన కర్తవ్యాలని ఎన్నటికీ మరవడు”! ఈ సైగా అందరికీ అర్థమైందని అనుకుంటాను.

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter