"ఇస్లాంలో న్యాయం: ప్రవక్త రోజుల నుంచి నేటి ముస్లింల వరకు ఏం మారింది? ఎలా ఉంది?"
న్యాయం అనేది ప్రతి సమాజానికి చాలా ముఖ్యమైన విలువ. ఎందుకంటే ఒక దేశం లేదా సమాజం శాంతిగా, సురక్షితంగా మరియు ఏ గొడవలు లేకుండా ఉండాలంటే అక్కడ ప్రతి ఒక్కరికీ సమాన న్యాయం అందాలి. అంతేగాక ధనవంతుడయినా, పేదవాడయినా, పెద్దవాడయినా, చిన్నవాడయినా అందరినీ ఒకే విధంగా చూడటం నిజమైన న్యాయం. న్యాయం ఉన్న చోట ప్రజల మధ్య నమ్మకం పెరుగుతుంది, అన్యాయం ఉన్న చోట గొడవలు, అసమానతలు మరియు అసంతృప్తి పెరుగుతాయి. దాని ద్వారా ఒక మనిషి పై నమ్మకం అనే మాట వెళ్ళిపోతుంది .
ఇస్లాం కూడా న్యాయానికి చాలా ప్రాముఖ్యత ఇస్తుంది. ఖుర్‌ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ ﷺ గారి బోధనల్లో న్యాయం గురించి అనేక చాలా సూచనలు ఉన్నాయి. మనకు అనుకూలంగా ఉన్నప్పుడే కాకుండా, మనకు వ్యతిరేకంగా ఉన్నా కూడా నిజం చెప్పి న్యాయాన్ని నిలబెట్టాలని ఇస్లాం బోధిస్తుంది. అందుకే న్యాయం అనేది కేవలం కోర్టుల్లో తీర్పులివ్వడం మాత్రమే కాదు. ప్రతి వ్యక్తి హక్కులను కాపాడడం, బలహీనులకు సహాయం చేయడం, నిజాయితీగా వ్యవహరించడం మరియు సమాజంలో శాంతిని నిలబెట్టడం కూడా న్యాయంలో భాగమే.
ఇస్లాం మతం యొక్క అరబీ భాషలో న్యాయాని (అదల్) అని అంటారు. (అదల్) చాలా ముఖ్యమైన విలువ. ఖుర్‌ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ ﷺ గారి బోధనలు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయానికి తావు ఇవ్వలేదు. అంతేగాక అది మనకు వ్యతిరేకంగా ఉన్నా కూడా నిజం చెప్పి న్యాయాన్ని కాపాడాలని ఖుర్‌ఆన్ ఆదేశిస్తుంది అది ఎవరైనాగాని ఒకవేళ మన ఎదురుగా ఉన్న ప్రత్యర్థి వేరే మతస్తుడైనా న్యాయాన్నే నిలబెట్టాలి.
అల్లాహ్ న్యాయం గురించి ఇలా తెలిపాడు:
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُونُوا قَوَّامِينَ بِالْقِسْطِ شُهَدَاءَ لِلَّهِ وَلَوْ عَلَىٰ أَنْفُسِكُمْ أَوِ الْوَالِدَيْنِ وَالْأَقْرَبِينَ ۚ إِنْ يَكُنْ غَنِيًّا أَوْ فَقِيرًا فَاللَّهُ أَوْلَىٰ بِهِمَا ۖ فَلَا تَتَّبِعُوا الْهَوَىٰ أَنْ تَعْدِلُوا ۚ وَإِنْ تَلْوَوْا أَوْ تُعْرِضُوا فَإِنَّ اللَّهَ كَانَ بِمَا تَعْمَلُونَ خَبِيرًا
అర్థం :"ఓ విశ్వాసులారా! అల్లాహ్ కోసం న్యాయంగా నిలబడండి. అది మీకు లేదా మీ బంధువులకు వ్యతిరేకంగా ఉన్నా కూడా న్యాయం చేయండి." (సూరహ్ అన్-నిసా 4:135)
అంతేగాకుండా అల్లాహ్ సూరహ్ అన్-నిసా 4:58 ఆయతులో ఇలా అన్నాడు, ఇతరుల హక్కులను వారికి ఇవ్వాలని మరియు ప్రజల మధ్య తీర్పు చెప్పేటప్పుడు న్యాయంగా తీర్పు ఇవ్వాలని ఆదేశించాడు.
ప్రవక్త ముహమ్మద్ ﷺ తమ జీవితంలో ఈ బోధనలను ఆచరించారు. ముస్లింలతో మాత్రమే కాదు, ముస్లింలు కాని వారితో కూడా సమానంగా వ్యవహరించారు. ఎవరి పక్షం తీసుకోకుండా నిష్పక్షపాతంగా తీర్పులు ఇచ్చారు. ప్రవక్త ﷺ ఇలా అన్నారు:
"إِنَّ الْمُقْسِطِينَ عِنْدَ اللَّهِ عَلَى مَنَابِرَ مِنْ نُورٍ عَنْ يَمِينِ الرَّحْمَنِ عَزَّ وَجَلَّ وَكِلْتَا يَدَيْهِ يَمِينٌ الَّذِينَ يَعْدِلُونَ فِي حُكْمِهِمْ وَأَهْلِيهِمْ وَمَا وَلُوا"
అర్థం:"న్యాయం చేసే వారు అల్లాహ్ దగ్గర వెలుగుతో కూడిన సింహాసనాలపై ఉంటారు." (సహీహ్ ముస్లిం)
ఇస్లాంలో న్యాయం అంటే కోర్టులో సరైన తీర్పు ఇవ్వడం మాత్రమే కాదు. బలహీనులను రక్షించడం, అలాగే ప్రతి వ్యక్తి యొక్క గౌరవాన్ని కాపాడడం, సమాజం మొత్తం సంక్షేమాన్ని పెంచడం కూడా న్యాయంలో భాగమే. దీనినే (మఖాసిద్ అష్-షరీఅహ్) అంటారు. దీని ముఖ్య ఉద్దేశాలు ఏమనగా మతం, జీవితం, బుద్ధి, కుటుంబం మరియు ఆస్తిని రక్షించడం.
ప్రాచీన ఇస్లామీయ సమాజంలో న్యాయం
ముస్లిం పండితులు ఇస్లామీయ చట్టాల ద్వారా న్యాయం గురించి చాలా స్పష్టంగా వివరించారు. వారి అభిప్రాయం ప్రకారం, ఒక పాలకుడు ప్రజలకు న్యాయం చేసినప్పుడే అతని పాలనకు విలువ ఉంటుంది.
మరియు అల్-షాతిబీ (14వ శతాబ్దానికి చెందిన ప్రముఖ అండలూసియన్ ఇస్లామిక్ పండితుడు.ఆయన ప్రకారం, షరీఅహ్ లక్ష్యం కేవలం ప్రజల సంక్షేమాన్ని కాపాడటమే. అల్-మావర్దీ గారి అధ్యయనం ప్రకారం, ప్రజల హక్కులను రక్షించి న్యాయం చేసే ప్రభుత్వమే నిజమైన ప్రభుత్వం.
అంతేగాకుండా ఆ కాలంలో న్యాయం చేయడానికి కొన్ని ముఖ్యమైన పద్ధతులు ఉండేవి.
- ఖాజీ కోర్టులు: ప్రజల మధ్య వచ్చిన గొడవలను పరిష్కరించేవి.
- మజాలిమ్ కోర్టులు: ప్రభుత్వ అధికారులపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించేవి.
- వక్ఫ్ వ్యవస్థ: ద్వారా పాఠశాలలు, ఆసుపత్రులు, మసీదులు నడిపించేవారు. అలాగే పేదలకు కూడా సహాయం చేసేవారు.
- జకాత్: దీని ద్వారా ధనవంతులు తమ డబ్బులో కొంత భాగాన్ని పేదలకు ఇచ్చేవారు.
ఈ వ్యవస్థల వల్ల సమాజంలో అందరికీ సమానంగా న్యాయం చేయాలనే భావన పెరిగింది. నాటి ప్రజలు కూడా ఒకరికొకరు సహాయం చేసుకునేవారు. కాని, కొన్ని సందర్భాల్లో అధికారులు తమ అధికారాన్ని తప్పుగా ఉపయోగించడం. సమాజానికి ఒక తీరని నష్టాన్ని కలిగిస్తుంది.
ఇప్పటి కాలంలో న్యాయం
19వ శతాబ్దం నుంచి విదేశీ పాలన,మరియు కొత్త ప్రభుత్వ పద్ధతులు మరియు కొత్త ఆర్థిక విధానాల వల్ల ముస్లిం సమాజాల్లో చాలా మార్పులు వచ్చాయి. అయితే దీనివల్ల పాత ఇస్లామీయ న్యాయ పద్ధతులు మెల్ల మెల్లగా తగ్గిపోతున్నాయి.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా చాలా దేశాలు పాత మరియు కొత్త చట్టాలను కలిపి అమలు చేశాయి. అందువల్ల ఇస్లామీయ న్యాయ వ్యవస్థల ప్రభావం తగ్గిపోయింది.
అయితే, కొంతమంది ముస్లిం పండితులు పాత ఇస్లామీయ న్యాయ నియమాలను నేటి కాలానికి సరిపోయేలా అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు.ఉదాహరణకు: జకాత్ మరియు వక్ఫ్ ద్వారా పేదలకు సహాయం చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
నేటి సవాళ్లు
ప్రస్తుతం చాలా ముస్లిం సమాజాలు పేదరికం, ధనవంతులు మరియు పేదల మధ్య తేడా, లంచాలు, సరైన న్యాయం లేకపోవడం, అంతేగాక రాజకీయ సమస్యలు, వివక్ష, మత గొడవలు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి.
ఈ సమస్యలను పరిష్కరించడానికి ఇస్లాం మంచి మార్గాలను చూపిస్తుంది.
- చట్టం ముందు అందరికీ సమాన హక్కులు ఉండాలి.
- కోర్టులు ఎలాంటి ఒత్తిడి లేకుండా న్యాయం చేయాలి.
- ప్రభుత్వం చేసే పనులు ప్రజలకు స్పష్టంగా తెలియాలి.
- జకాత్, సదఖా మరియు వక్ఫ్ ద్వారా పేదలకు సహాయం చేయాలి.
- అందరికీ చదువు, వైద్యం మరియు పని చేసే అవకాశాలు సమానంగా ఉండాలి.
- లంచాలను ఆపి, ప్రజల నమ్మకాన్ని కాపాడాలి.
ఇప్పటి కాలంలో ఇస్లామీయ న్యాయాన్ని ఎలా అమలు చేయాలి?
ఇప్పటి కాలంలో ఇస్లామీయ న్యాయం సరిగ్గా అమలు కావాలంటే మంచి చట్టాలతో పాటు మంచి ఆలోచనలు మరియు మంచి విలువలు కూడా ఉండాలి. అంతేగాక న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయాలి మరియు కోర్టులు అందరికీ సమానంగా, నిజాయితీగా న్యాయ తీర్పులను వినిపించాలి. అంతేగాకుండా పేద మరియు ధనవంతుల మధ్య భేదాలు పుట్టించకుండా ప్రభుత్వ పనులు ప్రజలకు స్పష్టంగా తెలియాలి. జకాత్ మరియు వక్ఫ్ ద్వారా వచ్చే డబ్బును సరిగ్గా ఉపయోగించాలి. ఆ డబ్బును పేదలకు సహాయం చేయడానికి, పాఠశాలలు, ఆసుపత్రులు మరియు మంచి పనుల కోసం ఉపయోగించాలి. పేదరికాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలి. ప్రజల్లో న్యాయం, బాధ్యత మరియు ఒకరినొకరు గౌరవించే భావన పెరగాలి.
ఇక ఇస్లాంలో న్యాయం అంటే కేవలం చట్టాలను పాటించడం మాత్రమే కాదు. ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు ఇవ్వడం, బలహీనులకు సహాయం చేయడం మరియు సమాజంలో శాంతి, సమానత్వాన్ని కాపాడడం కూడా న్యాయంలో భాగమే. అంతేగాకుండా ప్రతి వ్యక్తిలో నిజాయితీ, దయ, బాధ్యత మరియు ఇతరులను గౌరవించే గుణాలు ఉండాలి. మంచి చట్టాలు, విలువలు కలగలసినప్పుడే నిజమైన ఇస్లామీయ న్యాయం సమాజంలో ఏర్పడుతుంది.
ఇక న్యాయం అనేది సమాజాన్ని సమానంగా మరియు శాంతిగా మార్చే ఒక మంచి మార్గం. దివ్య ఖుర్‌ఆన్ మరియు ప్రవక్త ముహమ్మద్ ﷺ గారి బోధనలు మరియు పాత ఇస్లామీయ పద్ధతులు న్యాయం ఎంత ముఖ్యమో సమాజంలో అన్యాయాలు తలెత్తినప్పుడే బోధపడుతాయి.
ఇప్పటి కాలంలో పేదరికం, ధనికులు-పేదల మధ్య తేడాలు, అవినీతి వంటి సమస్యలను తగ్గించడానికి ఈ మంచి ఆలోచనలు చాలా ఉపయోగపడతాయి. ఇలా అందరికీ న్యాయం చేసే కోర్టులు, నిజాయితీగా పనిచేసే ప్రభుత్వం, జకాత్ మరియు వక్ఫ్ ద్వారా పేదలకు సహాయం చేయడం, ప్రతి ఒక్కరినీ గౌరవించడం వల్ల ఒక గొప్ప శాంతియుతమైన సమాజాన్ని నిర్మించవచ్చు.


