ఆషూరా రోజు ఉపవాసం యొక్క విశిష్టత

ఆషూరా రోజు (ముహర్రం నెల 10 తేదీ) ఉపవాసం గురించి అడిగిన ప్రశ్నకు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా జవాబిచ్చారని అబూ ఖతాదహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖించినారు:

ఆయన ఆషూరా రోజు ఉపవాసానికి ప్రతిఫలంగా క్రిత సంవత్సరపు పాపాలు (చిన్న పాపాలు) మన్నిస్తాడని నేను అల్లాహ్ నుండి ఆశిస్తున్నాను.”

ఆషూరా దినమున ఉపవాసం పాటించే పద్ధతి:

ఆషూరాఅ రోజు ఉపవాసం యొక్క మూడు పద్ధతులను కొందరు ఇస్లామీయ పండితులు ఇలా తెలిపినారు.

(1) ఆషూరా రోజు (ముహర్రం 10 వ తేదీ) ఉపవాసంతో పాటు, దాని ముందు రోజున లేదా దాని తరువాత రోజున కూడా ఉపవాసం ఉండటం.

(2) కేవలం ఆషూరాఅ రోజున (ముహర్రం 10 వ తేదీన) మాత్రమే ఉపవాసం ఉండటం.

(3) ఆషూరా రోజు (ముహర్రం 10 వ తేదీ) ఉపవాసంతో పాటు, దాని ముందు రోజు (ముహర్రం 9 వ తేదీ) మరియు దాని తరువాత రోజులలో (ముహర్రం 11 వ తేదీలలో) కూడా ఉపవాసం ఉండటం, అంటే వరుసగా మూడు రోజులు (ముహర్రం నెల 9, 10 మరియు 11 వ తేదీలు) ఉపవాసం పాటించడం.

ఆషూరా దినమున ఉపవాసం ఎందుకు ఉండవలెను:

ఆషూరా దినమున అంటే ముహర్రం 10 వ తేదీన అల్లాహ్ తన ప్రవక్త మూసా అలైహిస్సలాంను మరియు ఆయన ప్రజలను, ఫిరౌను మరియు అతడి ప్రజల దౌర్జన్యం నుండి రక్షించినాడు. కాబట్టి దీనికి కృతజ్ఞతగా అల్లాహ్ కొరకు ఉపవాసం ఉండవలెను.

ఆషూరా రోజు ఉపవాసం – కొన్ని ప్రయోజనాలు :

  1. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంను అనుసరిస్తూ ఆషూరా దినము యొక్క ఉపవాసం పాటించడం ఉత్తమం.
  2. ఆషూరాఅ రోజు (ముహర్రం 10 వ తేదీ) కంటే ఒకరోజు ముందు లేదా ఒకరోజు తరువాత కూడా ఉపవాసం ఉండటం ఉత్తమం.
  3. ఈరోజు చాలా శుభమైనది. పూర్వం నుండే దీని పావనత్వం మరియు ఔన్నత్యం ప్రసిద్ది గాంచి యున్నది.

 

  1. పూర్వ సమాజములలో నెలల నిర్ణయం ఇంగ్లీషు క్యాలెండరును బట్టికాక, చంద్రుడ్ని గమనాన్ని బట్టి జరిగేదని స్పష్టమవుతున్నది. ఎందుకంటే రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపి ఉన్నారు. అల్లాహ్ ముహర్రం 10 వ తేదీన ఫిరౌను మరియు అతడి సహచరులను వినాశం చేసాడు. ప్రవక్త మూసా అలైహిస్సలాం మరియు అతని సహచరులకు ఆ రోజున విజయం ప్రసాదించినాడు.
  2. ఆషూరాఅ దినమున ఉపవాసం ఉండటమనేది రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నతు (విధానం) నుండి స్పష్టంగా ద్రువీకరించబడినది. ఉపవాసం కాకుండా ఈ దినమున చేసే ఇతర చేపలన్నీ నూతన కల్పితాలే (బిదాఅతులే) తప్ప ఇంకేమీ కావు. అంతేకాక – అవన్నీ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపదేశాలకు విరుద్ధమైనది కూడా.

ఒక దినపు ఉపవాసానికి బదులుగా మొత్తం ఒక సంవత్సరాల పాపాలు క్షమించివేయడమనేది అల్లాహ్ మనపై చూపుతున్న అనంతమైన కరుణకు మరియు అనుగ్రహానికి ఒక చిన్న మచ్చుతునక మాత్రమే. నిశ్చయంగా అల్లాహ్ సాటిలేని అనుగ్రహం కలవాడు.

ఈ అనుగ్రహాన్ని చేజిక్కించుకోవటానికి ప్రతి ఒక్కరూ సిద్దపడాలి. తమ నూతన సంవత్సరాన్ని అల్లాహ్ కు విధేయత చూపటంలో, దానధర్మాలు చేయటంలో మరియు పుణ్యాలు సంపాదించటంలో పోటీపడుతూ ప్రారంభించండి. పుణ్యాలు, మంచిపనులు తప్పకుండా పాపాలను, చెడుపనులను చేరిపివేస్తాయి.

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter