సామాజిక సమస్యలు సమాజం పై వాటి ప్రభావం.
సమాజం అనగా మానవుల సమూహం. మనమందరం ఒకరిపై ఒకరు ఆధారపడి కలిసి జీవిస్తుంటాం. కానీ కాలం మారుతున్న కొద్దీ సమాజంలో చాలా సమస్యలు పెరుగుతున్నాయి. వాటినే సామాజిక సమస్యలని అంటారు. ఇవి ఒకరి జీవితం పైనే కాకుండా, మొత్తం దేశంపై కూడా ప్రభావం చూపుతాయి. ఇక పేదరికం, నిరుద్యోగం, విద్య లోపం, మహిళలపై వివక్ష, బాల కార్మిక వ్యవస్థ, అవినీతి, కుల వివక్ష, మత అసహనం, పర్యావరణ కాలుష్యం, మత్తు పదార్థాల దుర్వినియోగం వంటి సమస్యలు ఒక దిక్కు విస్తరిస్తూనే, నేటి సమాజాన్ని బాగా ఇబ్బంది పెడుతున్నాయి.
పేదరికం అనేది మన దేశంలో చాలా పెద్ద సమస్య. చాలామందికి రోజూ తినడానికి సరైన భోజనం కూడా దొరకటం లేదు. చదువు, వైద్యం వంటి మౌలిక అవసరాలు వారికి అందడం లేదు. పేదరికం వల్ల పిల్లలు చదువు మానేసి, చిన్న వయస్సులోనే పనులకు వెళ్ళాల్సి వస్తోంది. దీని వల్ల వారి భవిష్యత్తు చెడిపోతుంది. పేదరికాన్ని తగ్గించాలంటే ప్రభుత్వం సహాయం చేయడమే కాదు, వారికి ప్రజల్లో కూడా అవగాహన ఉండితీరాలి.
నేటి సమాజంలో నిరుద్యోగం మరో ముఖ్యమైన సమస్య. చదువుకున్న యువతకు కూడా సరైన ఉద్యోగాలు దొరకడం లేదు. దీనివల్ల వారు నిరాశకు గురవుతున్నారు. కొంతమంది తప్పుడు మార్గాలు ఎంచుకుంటున్నారు. నిరుద్యోగం పెరిగితే నేరాలు వాటంతటవే పెరుగడం సహజం. ఇక ప్రభుత్వం యువతకు నైపుణ్యాలు నేర్పడం, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా ఈ సమస్యను కొంతవరకు తగ్గించవచ్చు.
ఇక విద్య లేకపోవడం అనేది, అనేక సమస్యలకు మూలకారణం. చదువు లేని సమాజం ఎప్పటికీ అభివృద్ధి చెందదు. ఇప్పటికీ చాలా గ్రామాల్లో పిల్లలు పాఠశాలలకు వెళ్లడం మానేస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిల చదువుపై నిర్లక్ష్యం ఎక్కువగా కనిపిస్తోంది. అమ్మాయిలు చదువుకుంటే కుటుంబం మారుతుంది, సమాజం మారుతుంది.ఇంకా విద్య అనేది ప్రతి ఒక్కరి హక్కు. మన సమాజంలో బాల కార్మిక వ్యవస్థ మన సమాజానికి ఒక చెడు గుర్తులాంటిది. చదువుకోవాల్సిన వయస్సులో పిల్లలు కఠినమైన పనులు చేయడం చాలా బాధాకరం. ఇది వారి ఆరోగ్యానికి, మానసిక ఎదుగుదలకు చాలా హానికరం. ప్రతి పిల్లవాడికి ఆనందంగా జీవించే బాల్యం ఉండాలి. దీనిని ఆపాలంటే చట్టాలను కఠినంగా అమలు చేయాలి.
నేటి సమాజంలో మహిళలపై వివక్ష ఇంకా పూర్తిగా తగ్గలేదు. స్త్రీలను బలహీనులుగా చూడటం ముమ్మాటికి తప్పు. ఇంట్లోనూ, బయట పనివేళల్లోనూ వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారికి సమాన హక్కులు,కనీస భద్రత, గౌరవం ఇవ్వాలి. మహిళలు ముందుకు వస్తే దేశం కూడా ముందుకు సాగుతుంది.
నేటి రోజుల్లో కుల వివక్ష మన దేశంలో చాలా పెద్ద సమస్య. కులం ఆధారంగా మనుషులు ఒకరినొకరు చిన్న చూపుతో చూడడం అనేది మానవత్వానికి విరుద్ధం. రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు ఇచ్చినా, వాస్తవ జీవితంలోని సమాజంలో ఇంకా వివక్షలు కనిపిస్తున్నాయి. కులం కంటే మానవత్వమే గొప్పదని ప్రతి ఒక్కరూ తప్పక అర్థం చేసుకోవాలి.
ఇక దేశ అభివృద్ధికి అవినీతి ఒక పెద్ద అడ్డంకి. ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రైవేట్ రంగాల్లో అవినీతి వల్ల సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఒక్కరిలో నిజాయితీ, బాధ్యత భావన పెరిగితేనే అవినీతి తగ్గుతుంది. ముఖ్యంగా యువత నిజాయితీని తమ జీవిత విలువగా తీసుకోవాలి.
ఇలాగే మత అసహనం కూడా సమాజానికి హాని కల్పిస్తుంది. మతం మనుషులను కలపాలి కానీ విడదీయకూడదు. అన్ని మతాల మధ్య సహనం, గౌరవం ఉండాలి. ప్రతి మతం తమ తమ నైతిక విలువల్ని బోధిస్తున్నా,సమాజం ఎందుకింత విక్రుతంగా ప్రవర్తిస్తుందో ఒక అర్ధం కాని విషయం. తర్వాత శాంతియుతంగా కలిసి జీవించినప్పుడే సమాజం అనేది అభివృద్ధి చెందుతుంది.
దాని తర్వాత పర్యావరణ కాలుష్యం మన ఆరోగ్యానికి పెద్ద ప్రమాదం. గాలి, నీరు, నేల కలుషితం కావడం వల్ల అనేక రకాల రోగాలు వస్తాయి. అడవులు నరకడం, ప్లాస్టిక్ ఎక్కువగా వాడటం వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుంది. మన దేశంలో పర్యావరణాన్ని కాపాడటం, ప్రతి పౌరుడి బాధ్యత. అలాగే ముఖ్యంగా, మత్తు పదార్థాల దుర్వినియోగం యువత జీవితాలను నాశనం చేస్తోంది. మద్యం, డ్రగ్స్ వల్ల కుటుంబాలు చెల్లా చెదురైపోతున్నాయి. ఆరోగ్యం, భవిష్యత్తు రెండూ ప్రమాదంలో పడుతున్నాయి. యువతకు ప్రభుత్వం వీటిపై సరైన మార్గదర్శకత్వం, అవగాహన ఇచ్చి తీరాలి.
ఇంకా ఇటువంటి సామాజిక సమస్యలకు పరిష్కారం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు. ప్రతి వ్యక్తి కూడా తన వంతు బాధ్యత తీసుకోవాలి. మనలో చిన్న మార్పు మొదలైతే సమాజంలో పెద్ద మార్పు వస్తుంది. ఇతరులను నిందించకుండా ముందుగా మన ప్రవర్తనను మార్చుకోవడం ఉత్తమం.
కనుక,ఈ సమస్యలు మన అందరి జీవితాలపై ప్రభావం చూపుతున్నాయి. వీటిని పట్టించుకోకపోతే రేపటి భవిష్యత్తు మరింత కష్టంగా మారుతుంది. ఐక్యత, అవగాహన, మానవత్వం, విద్యతోనే ఈ సమస్యలను ఎదుర్కోవచ్చు. మంచి సమాజం కావాలంటే ప్రతి ఒక్కరూ మంచి పౌరుడిగా మారాలి. అప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యం అవుతుంది.


