ఇమామ్ రబ్బానీ ముజద్దిద్ అల్ఫ్ సానీ (రహ్మతుల్లాహి అలైహి)

(జీవితం, విశిష్టమైన జ్ఞానం, ఆధ్యాత్మిక ఉన్నతి, ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి పట్ల ప్రేమ, భక్తి, తఖ్వా మరియు వారి ఆరాధనా జీవితం)

 

జననం, వంశపరంపర, విద్యాభ్యాసం

ఆధ్యాత్మిక మహోన్నతిని పొందినవారు, సంపూర్ణులైన సూఫీ మహనీయులకు మార్గదర్శకులు, ఆధ్యాత్మిక జ్ఞానవంతులకు సహాయకులు, ఇమామ్ రబ్బానీ, ముజద్దిద్ అల్ఫ్ సానీ (రెండవ సహస్రాబ్దపు ధార్మిక సంస్కర్త) షైఖ్ అహ్మద్ సర్‌హిందీ (ఖద్దసల్లాహు సిర్రహుల్ అజీజ్) హిజ్రీ 971వ సంవత్సరంలో, షవ్వాల్ నెల 14వ తేదీన, సర్‌హింద్ షరీఫ్‌లో జన్మించారు. (జుబ్దతుల్ మఖామాత్, పుట190)

ఇంకా షైఖ్ వారి వంశావళి 31 తరాల ద్వారా రెండవ ఖలీఫా; హజ్రత్ ఉమర్ బిన్ ఖత్తాబ్ (రదియల్లాహు అన్హు) వరకు చేరుతుంది. (మఖామాత్ ఖైర్, పుట 33). తమరి  గౌరవనీయ తండ్రి, ఔలియాల మార్గదర్శకుడైన హజ్రత్ షైఖ్ ‘అబ్దుల్ అహద్’ గొప్ప ఇస్లామీయ పండితుడు, ఉన్నత స్థాయి సూఫీ మహనీయుడు. ఆయన షైఖ్ రుక్నుద్దీన్ (రహ్మతుల్లాహి అలైహి), (మరణం హిజ్రీ 983) వద్ద ఖాదిరియ్యా, చిష్తియ్యా సూఫీ పరంపరల్లో ఖిలాఫత్‌ను పొందారు. (జుబ్దతుల్ మఖామాత్, పుట 143)

హజ్రత్ ముజద్దిద్ అల్ఫ్ సానీ (ఖద్దసల్లాహు సిర్రహుల్ అజీజ్) అనేక ఇస్లామీయ శాస్త్రాలను తన తండ్రి వద్దనే అభ్యసించారు. అంతేకాకుండా మౌలానా కమాల్ కాశ్మీరీ, మౌలానా యాఖూబ్ కాశ్మీరీ, ఖాజీ బహ్లూల్ బదఖ్షీ (రహిమహుముల్లాహ్) వంటి పండితుల వద్ద కూడా విద్యను అభ్యసించారు. (జవాహిర్ ముజద్దిదియ్యా, పుట 23)

హిజ్రీ 998వ సంవత్సరంలో ఆయన ఆగ్రాకు ప్రయాణించారు. అక్కడ మొఘల్ ఆస్థానానికి చెందిన పండితులు షైఖ్ అబుల్ ఫజల్, షైఖ్ అబుల్ ఫైజ్ ఫైజీలతో పరిచయం ఏర్పడింది. వారు హజ్రత్ ముజద్దిద్ పట్ల ఎంతో గౌరవాన్ని చూపేవారు.

హజ్రత్ ఖ్వాజా బాఖీ బిల్లాహ్‌తో పరిచయం

హిజ్రీ 1008వ సంవత్సరంలో హజ్రత్ ముజద్దిద్ (రహ్మతుల్లాహి అలైహి) గారు పవిత్ర మక్కా, మదీనాలను దర్శించుకోవాలనే సంకల్పంతో ప్రయాణం ప్రారంభించారు. ఆ ప్రయాణంలో భాగంగా ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ ఆయనకు గొప్ప సూఫీ మహనీయులు, ఆధ్యాత్మిక గురువులైన హజ్రత్ ఖ్వాజా ఖ్వాజగాన్ బాఖీ బిల్లాహ్ (రహ్మతుల్లాహి అలైహి)ను కలుసుకునే భాగ్యం లభించింది.

హజ్రత్ ముజద్దిద్‌లోని ఆధ్యాత్మిక ప్రతిభను గుర్తించిన హజ్రత్ ఖ్వాజా బాఖీ బిల్లాహ్ గారు, ఆయనను తన సన్నిధిలోనే ఉండమని ఆప్యాయంగా కోరారు. గురువుగారి ఆహ్వానాన్ని స్వీకరించి, హజ్రత్ ముజద్దిద్ మూడు నెలలపాటు వారి సన్నిధిలో గడిపారు. అయితే, ఆ మూడు నెలలు సాధారణమైనవి కావు. ఆ కొద్ది కాలంలోనే ఆయన అపారమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఉన్నతమైన శిక్షణను పొందారు. ఎన్నో సంవత్సరాల పాటు సాధన చేసినా, ఇతరులు పొందలేని ఆ ఆధ్యాత్మిక ఉన్నతిని ఆయన అతి తక్కువ కాలంలోనే సాధించారు.

ఇంకా ఖ్వాజా బాఖీ బిల్లాహ్ కూడా హజ్రత్ ముజద్దిద్ పట్ల ఎంతో ప్రత్యేకమైన ప్రేమాభిమానాలను కలిగి ఉండేవారు. ఆయనను తన ఆధ్యాత్మిక ఆకాంక్షల నెరవేర్పుగా, తన సాధనకు లభించిన గొప్ప ఫలితంగా భావించేవారు. ఈ విధంగా, గురుశిష్యుల మధ్య ఏర్పడిన ఈ పవిత్రమైన అనుబంధం హజ్రత్ ముజద్దిద్ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపుగా నిలిచింది.

 

ఈ విషయాన్ని హజ్రత్ ముజద్దిద్ స్వయంగా ఇలా వివరించారు:

“నా గురువు గారు హజ్రత్ ఖ్వాజా ఉమ్కంగీ (రహ్మతుల్లాహి అలైహి), నన్ను భారతదేశానికి వెళ్లమని ఆదేశించినప్పుడు, ఆ ప్రయాణానికి నేను తగినవాడిని కాదని భావించి కొంత సంకోచించాను.

అప్పుడు ఖ్వాజా ఉమ్కంగీ ఇస్తిఖారా ప్రార్థన చేశారు. అదే రాత్రి నిద్రలో ఒక కలను చూశారు. ఆ కలలో ఒక కొమ్మపై చిలుక కూర్చొని ఉంది. ఆ చిలుక కొమ్మపై నుంచి ఎగిరి తన చేతిపై వచ్చి కూర్చుంటే, ఈ ప్రయాణం కొంత సులభమవుతుందని ఆయన మనసులో అనుకున్నారు. దీంతో వెంటనే ఆ చిలుక ఎగిరి వచ్చి ఆయన చేతిపై కూర్చుంది. ఆయన తన నోటిలోని లాలాజలాన్ని ఆ చిలుక నోటిలో వేశారు. ప్రతిగా ఆ చిలుక ఆయన నోటిలో చక్కెరను వేసింది.

ఈ కలకు ఖ్వాజా ఉమ్కంగీ ఇలా అర్థం చెప్పారు: ‘చిలుక భారతదేశానికి చెందిన పక్షి. భారతదేశంలో నీ ద్వారా ఒక గొప్ప వ్యక్తి నీ ఆధ్యాత్మిక సంబంధంలోకి వస్తాడు. అతని ద్వారా ప్రపంచం వెలుగొందుతుంది. నీవు కూడా అతని ద్వారా ప్రయోజనం పొందుతావు.’”

(జుబ్దతుల్ మఖామాత్, పుట 190)

హజ్రత్ ఖ్వాజా బాఖీ బిల్లాహ్ గారు అందించిన విద్య, ఆధ్యాత్మిక శిక్షణ ప్రభావంతో హజ్రత్ ముజద్దిద్ ఇస్లామీయ సమాజానికి గొప్ప రక్షకుడిగా, మార్గదర్శకుడిగా ఎదిగారు.

తన ధైర్యం, స్థిరత్వం, దృఢసంకల్పంతో అక్బర్, జహంగీర్ చక్రవర్తుల కాలంలో ఎదురైన తీవ్రమైన ధార్మిక సవాళ్లను ఎదుర్కొన్నారు. భారతదేశంలో ఇస్లామీయ విశ్వాసాలు, ఆచారాలను కాపాడటంలో ముఖ్యమైన పాత్ర పోషించారు.

చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, హజ్రత్ ముజద్దిద్ ఈ సమయంలో భారతదేశంలో ఆవిర్భవించకపోయి ఉంటే, అక్బర్ కాలంలో ప్రోత్సహించబడిన దీన్-ఎ-ఇలాహీ ప్రభావం ఇస్లామీయ బోధనలను మరింతగా దెబ్బతీసే ప్రమాదం ఉండేది.

హజ్రత్ షా వలీయుల్లాహ్ దహ్లవీ (రహ్మతుల్లాహి అలైహి) ఈ విషయాన్ని ఎంతో చక్కగా వివరించారు:

“నేడు మసీదుల్లో,మదర్సాల్లో వినిపిస్తున్న అజాన్లు వీటి పుణ్యం మొత్తం ఒకరకంగా వారికి కూడా దక్కుతుంది. ఖుర్ఆన్, హదీసుల పాఠాలు, ఖాన్కాహ్‌లలో జరిగే జిక్ర్, ఆధ్యాత్మిక చింతన, హృదయాంతరాళాల నుంచి అల్లాహ్‌ను స్మరించడం, ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ అనే పవిత్ర కలిమాను జపించడం—ఇవన్నీ హజ్రత్ ముజద్దిద్ చేసిన గొప్ప సేవకు సాక్ష్యాలు.

అక్బర్ కాలంలో వ్యాపించిన భ్రష్టత్వం, ధార్మిక విచలనాలకు వ్యతిరేకంగా హజ్రత్ ముజద్దిద్ పోరాడకుండా, ఆ మహత్తర సంస్కరణ కార్యాన్ని నిర్వహించకపోయి ఉంటే, నేడు మసీదుల్లో అజాన్లు వినిపించేవి కావు; మదర్సాల్లో ఖుర్ఆన్, హదీసు, ఫిఖ్ తదితర ఇస్లామీయ శాస్త్రాల బోధన ఈ స్థాయిలో కొనసాగేది కాదు. ఖాన్కాహ్‌లలో ఆధ్యాత్మిక సాధకులు అల్లాహ్ స్మరణతో తమ హృదయాలను పరవశింపజేసే పరిస్థితి కూడా తీవ్రంగా దెబ్బతినేది. (సీరత్-ఏ- ముజద్దిద్ అల్ఫ్ సానీ, ముందుమాట, పుట 10)

హజ్రత్ ముజద్దిద్ ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థానాన్ని పొందారు. ఆయన ఖుత్బుల్ ఇర్షాద్, ముజద్దిద్ అల్ఫ్ సానీ వంటి గౌరవప్రదమైన బిరుదులకు అర్హులయ్యారు. భారతదేశంతో పాటు ఇతర ఇస్లామీయ దేశాల్లోనూ ఆయన ఆధ్యాత్మిక ప్రభావం వర్షించే కరుణామేఘంలా విస్తరించింది.

అల్లాహ్ తఆలా ఆయనకు అనేక బాహ్య, అంతర్గత సద్గుణాలను ప్రసాదించాడు.

ليس على الله بمستنكر   

       ان يجمع العالم في واحد

ఈ అరబీ కవితా భావం:

“సర్వలోకంలోని గొప్పతనాన్ని ఒకే వ్యక్తిలో సమకూర్చడం అల్లాహ్‌కు అసాధ్యమైన విషయం కాదు.”

ఇకపై ఆయనలోని వివిధ గుణగణాలను పరిశీలిద్దాం. వాటిని చదివినప్పుడు హృదయాంతరాళాల నుంచి ఈ భావం వెలువడుతుంది:

اور بے مثال کی ہے مثال وہ حسن    

  خوبیٔ  یار کا جواب کہاں

నిజమైన మహోన్నతికి సాటిగా నిలిచే మరొక ఉదాహరణ ఎక్కడ దొరుకుతుంది?

 

జ్ఞాన సంపద, పాండిత్యం

హజ్రత్ ముజద్దిద్ అల్ఫ్ సానీ (ఖద్దసల్లాహు సిర్రహుల్ అజీజ్) జ్ఞానంలో, పాండిత్యంలో తనకు తానే సాటి. ఆయన పవిత్ర ఖురాన్‌ను పూర్తిగా కంఠస్థం చేసిన హాఫిజ్. ఖురాన్‌లోని అంతర్గత రహస్యాలపై గొప్ప అవగాహన కలిగి ఉండేవారు. హురూఫె ముఖత్తఆత్ (ఖుర్ఆన్‌లోని కొన్ని సూరాల ప్రారంభంలో వచ్చే ప్రత్యేక అక్షరాలు), ముతషాబిహాత్ (భావాన్ని అర్థం చేసుకోవడానికి లోతైన వివరణ అవసరమయ్యే ఆయతులు) వంటి విషయాల్లోనూ ఆయనకు విశేషమైన పాండిత్యం ఉండేది. (హజరాతుల్ ఖుద్స్, సంపుటి 2, పుట 68)

హదీసు శాస్త్రంలో ఆయన అత్యున్నత స్థానాన్ని పొందారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రస్తావిస్తూ, “నేను ముహద్దిసీన్‌ (హదీసు పండితుల) వర్గంలో చేర్చబడినట్లుగా నాకు అనిపిస్తోంది” అని పేర్కొన్నారు. (జుబ్దతుల్ మఖామాత్, పుట 130)

ఇస్లామీయ న్యాయశాస్త్రమైన ఫిఖ్‌లోని వివిధ సమస్యలపై ఆయనకు సంపూర్ణ అవగాహన ఉండేది. ఫిఖ్‌కు సంబంధించిన ప్రాథమిక నియమాల శాస్త్రమైన ‘ఉసూలె ఫిఖ్’లోనూ ఆయన గొప్ప నైపుణ్యాన్ని కలిగి ఉండేవారు.

అలాగే ఇస్లామీయ విశ్వాస సిద్ధాంతాలను పరిశీలించే ‘ఇల్ముల్ కలామ్’లో ఆయన స్వతంత్ర పరిశోధనా సామర్థ్యం కలిగిన ముజ్తహిద్‌గా ప్రసిద్ధి చెందారు.

ఇంకా ఇదే విషయాన్ని వివరిస్తూ ఆయన ఇలా అన్నారు:

“ఒక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వసల్లం) నాకు కలలో ఇలా తెలియజేశారు: ‘నీవు ఇల్ముల్ కలామ్‌లో ముజ్తహిద్‌వి.’ అప్పటి నుంచి కలామ్‌కు సంబంధించిన సమస్యల్లో నా అభిప్రాయానికి, నా జ్ఞానానికి ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది.” (మబ్దా వ మఆద్ షరీఫ్)

ఆయన తన లోతైన పరిశోధన, వివేకం ద్వారా షాహిఖుల్ జబల్ వంటి క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలు చూపించారు. ఆయన రచించిన ‘మక్తూబాత్ షరీఫా’లో ఇల్ముల్ కలామ్‌కు సంబంధించిన అనేక స్వతంత్ర పరిశోధనలు కనిపిస్తాయి.

ఆయన ఖలీఫా హజ్రత్ అల్లామా హాషిమ్ కాశ్మీరీ (రహ్మతుల్లాహి అలైహి) ఈ పరిశోధనలన్నింటినీ ఒకచోట చేర్చాలని కూడా సంకల్పించారు. (జుబ్దతుల్ మఖామాత్, పుట 355)

గ్రంథకర్తల వర్ణన ప్రకారం, హజ్రత్ అలీ ముర్తజా (రదియల్లాహు అన్హు) ద్వారా ఆయనకు ఆకాశాలకు సంబంధించిన జ్ఞానం ప్రసాదించబడింది. హజ్రత్ ఖిజ్ర్ (అలైహిస్సలాం) ఆయనకు ఇల్మ్-ఏ-లదున్నీ; అల్లాహ్ అనుగ్రహించే ప్రత్యేక ఆధ్యాత్మిక జ్ఞానం. ప్రసాదించారు. (జుబ్దతుల్ మఖామాత్, పుట 355)

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter