సమస్త కోటి జీవరాశులకు తగిన న్యాయం మరియు వాటిపై ప్రవక్త ﷺ గారి కనికరం
అల్హందులిల్లాహ్! ఎంత రమణీయంగా ఉంది ఈ వాతావరణం! ఆహా ఈ వాతావరణం లో నివసించే జీవులు, లెక్కలేనన్ని! అందులో ఒక జీవం మానవుడు. ఆలోచిస్తుంటేనే, మనసుకి ఏదో తెలియని సంతోషం, ఇంత మంచి జీవితాన్ని ప్రసాదించినందుకై ఆ దేవునికి కృతజ్ఞతలు. మానవుడు ఈ ప్రపంచంలో ఒక జీవి. సమస్త జీవకోటి కన్నా గొప్ప సృష్టి మానవుడు. అటువంటి మానవుని కొరకై ఈ లోకం మొత్తం. కానీ మానవుడు అల్లాహ్ యొక్క ఆరాధనకు మాత్రమే! దీని గురించి స్పష్టంగా దివ్య ఖురాన్ లో చాలా వరకు శ్లోకాలు కూడా ఉన్నాయి.
అలాంటప్పుడు, ఈ ప్రపంచం మొత్తం నా కోసమే అంటూ తిరిగేవారు కొందరున్నారు. అటువంటి మానవులు తప్పక ఆ అలవాటుని మాని తీరాలి. దానికి కారణమేమనగా, దైవ ప్రవక్త (స) గారు మానవులందరికి, సమస్త జీవరాశుల పట్ల ఎలా నడుచుకోవాలని బోధించారు కనుక! సెలవిచ్చారు కనుక! ఆ ఆదేశాల్ని పాటించి తీరాలి.మరో విషయం, ఈ లోకంలోని ప్రతి ప్రాణి మానవుని ప్రాణం వలె, వాటికి జీవాలు ఉండి, బతకాలనే ఆశలూ ఉంటాయి. కాబట్టి, ఈ అవనిపై బ్రతికే హక్కు మనకు ఎంతైతే ఉందో, వాటికీ అంతే ఉంది!
ఆ జీవరాసుల హక్కులను వాటికి ఇవ్వాలి. కనుకే దైవ ప్రవక్త (స) గారు ఇస్లాంలో కొన్ని విషయాలను పునాదియై నియమించారు. ఇక్కడ మీకు ఒక ప్రశ్న పుట్టవచ్చు! మనం అల్లాహ్ ఆదేశాలను మాత్రమే వింటే చాలు కదా! ప్రవక్తలను పాటించడం ఎందుకు? అని.
కానీ అది ముమ్మాటికి తప్పే! అలా నమ్మేవారు, ఒకసారి ఆలోచించాలి. ఒకవేళ ప్రవక్తలే లేకపోతే అల్లాహ్ సందేశాన్ని ప్రజల వద్దకు చేర్చేది ఎవరు?
కనుక, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి నియమాలను తప్పక అనుసరించి తీరాలి. ఇక ఈ విషయం పక్కన పెడితే, అసలు ప్రవక్తలు ఏ పని చేసినా, లేదా ఆదేశించినా, అది కూడా మతంలోని ఒక భాగంగా మారిపోతుంది. ఇది ముమ్మాటికి నిజం! కనుక, దైవ ప్రవక్త ప్రవక్త (స) గారు ఇస్లాంలో కొన్ని విషయాలను పునాదియై నియమించారు. వాటిని అనుసరించడం తప్పనిసరి. వాటిలో అన్నిటికన్నా ప్రముఖమైనది, అహింసలకు అడ్డుకట్ట వేయడం.
అంతేకాక, స్వేచ్ఛ అనేది కేవలం మానవుల హక్కు మాత్రమే కాదు. భూమ్మీద జీవించే ప్రతి జీవి, ప్రతి ప్రాణి హక్కు. ఆ జీవి ఏదైనా కావచ్చు జంతువు అయినా పక్షైనా లేదా పురుగైన, కీటకమైన ఏదైనా కావచ్చు! ఇవన్నీ తమ న్యాయానికి అర్హులు. ప్రియ ప్రవక్త (స) గారి కనికరానికి హద్దు, కేవలం మానవుల వరకే కాదు, పుడమిపై జీవించే ప్రతి జీవి కొరకు ఇది విస్తరించి ఉంది.
ఇంకా ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు న్యాయం అంటే ప్రతి ఒక్కరి హక్కును వారికి చేర్చడమ’ని వెల్లడిచేశారు. ప్రపంచంలో అటువంటి హక్కులను గుర్తించి, వాటిని తెరిచిద్దడంలో ప్రియ ప్రవక్త (స) గారు మొట్టమొదటి వ్యక్తి. ఒకవేళ జంతువుల మరియు పక్షుల హక్కులను గురించి వివరిస్తే పేజీలు చాలావు. మరి ఆఖరికి వాటికి ఎందుకు ఇంతటి ప్రాముఖ్యత?
నాకు తోచిన ఒక తార్కిక విషయాన్ని మీ ముందు ఉంచుతున్నాను. సమస్త కోటి జీవరాశులకు ఇంతటి గొప్ప స్థానాన్ని కల్పించడంలో మొట్టమొదటి కారణం అల్లాహ్ తఆలా ప్రియ ప్రవక్త (స) గారిపై అవతరింపజేసిన పవిత్ర గ్రంథమైన ఖురాన్లోని కొన్ని సురహ్ ల పేర్లు కొన్ని ఏకంగా జీవరాశుల పేర్లు ఉన్నాయి. ఇది ఒకటైనందున వాటి ప్రాముఖ్యత, వాటి విలువ మరియు వాటి గొప్పతనం ఇలా చాలావరకు ఉందని నిస్సంశయంగా చెప్పవచ్చు. ఉదాహరణకి (النمل)(చీమ) అని ఉంది. అది ఎంత చిన్నగా ఉంటుంది. అయినా అది రోజూ, పొద్దస్తమానం కష్టపడుతూనే ఉంటుంది. అది ఆహారాన్ని తన కడుపు నిండినా, సేకరించడం ఆపదు. సేకరిస్తూనే ఉంటుంది. ఎందుకు, రాబోయే కాలం కష్టంగా ఉండొచ్చు.అందుకని, దానికోసం తయారై ఇప్పుడే ఆహారాన్ని సమకూర్చుకుంటే, మనకు రాబోయే కాలంలో సులభం అవుతుంద’ని. అలా వాటి ద్వారా మానవుడు వీలైనంత వినయ గుణాన్ని, ఓపికను ఇంకా చాలా చాలా విషయాల్ని పొందాల్సి ఉంది కనుక. ఇలా! ఈ ప్రపంచంలోని జీవరాశులన్నిటి నుండి మానవుడు ఏదో కొంత పాఠాన్ని తప్పక పొందుతాడు. పొంది తీరాలి కూడా!
తర్వాత అల్లాహ్ యొక్క సృష్టిలోని చిన్న చిన్న జీవ జీవరాశులకి ఆఖరికి దివ్య ఖురాన్ అయిన గ్రంథంలో గొప్ప స్థానాన్ని వాటికి కల్పించాడు. కనుక, ఇందులో మనం అర్థం చేసుకోవలసిన రెండవ విషయం, ఆ ప్రాణులను గౌరవించడం తప్పనిసరి! అలా చేయలేకపోతే, కనీసం ఏ ప్రాణికీ ఎటువంటి హింసా తలపెట్టరాదు!.
ప్రవక్త (స)ఎల్లప్పుడూ జీవరాశుల పట్ల సదా దయాగుణం మరియు కనికరం కలిగి ఉండేవారు. దీని కొరకు ఒక చక్కటి ఉదాహరణ కూడా ఉన్నది. ఓసారి, ఒక పక్షి తన పిల్లలు కనబడకపోవడంతో చాలా బాధకు లోనవుతుంది. తన పిల్లల్ని అది పోగొట్టుకొని ఉంటుంది.ఎవరో దాని పిల్లల్ని ఎత్తుకొని పోయి ఉంటారు. దీనితో ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ పక్షి పరిస్థితిని చూసి, గమనించి, వెంటనే అక్కడున్న జనంతో ఇలా ఆదేశించారు:
عَنْ عَبْدِ اللَّهِ بْنِ عُمَرَ رَضِيَ اللَّهُ عَنْهُمَا، أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ:
((صحيح البخاري:٢٣٦٥)«عُذِّبَتِ امْرَأَةٌ فِي هِرَّةٍ حَبَسَتْهَا حَتَّى مَاتَتْ جُوعًا، فَدَخَلَتْ فِيهَا النَّارَ،
“ఎవరైనా ఈ పక్షి పిల్లల్ని ఎత్తుకొని ఉంటే, వెంటనే తిరిగి దాని వద్దకు చేర్చండి! “. (సునన్ అబూ దావూద్)
ఇదే విధంగా ఇంకో హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సెలవిచ్చారు:
“ఒక స్త్రీ కేవలం ఒక పిల్లిని ఆకలితో చంపడం వలన, ఆమె నరకంలో వేయబడింది! “ (సహీహ్ బుఖారీ:2365).
ప్రియమైన సహోదరులారా, ఇక దేనికి ఆలస్యం, మానవుడు అనగా, వాడితో జరిగే తప్పులు జరగడం సహజం. అలాగని ఎల్లప్పుడూ తప్పులు చేస్తూ ఉండడం బుద్ధిహీనం. కనుక చేసిన తప్పులను ‘తౌబా’ ద్వారా తొలగొట్టి ఒక కొత్త జీవితాన్ని నేటి నుండి సృష్టించుకుందాం. అల్లాహ్ తఆలా మనకు వారి ఆదేశాలను మరియు వారి ప్రవక్తయైన మహమ్మద్ (స) గారి ఆదేశాలను తూ.చ. చెప్పకుండా పాటించే భాగ్యాన్ని ప్రసాదించుగాక! ఆమీన్!


