ఆషూరా దిన ప్రత్యేకతలు
ఆషురా, ముహర్రం 10వ తేదీ. ఈ పవిత్ర దినం దేవుని కృప మరియు కరుణలను కలిగియున్నది. ఈ రోజు ఉపవాసానికి కూడా గొప్ప స్థానం ఉంది మరియు హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఈ దినాన ఉపవాసం ఉండడం సున్నత్ మరియు ముస్తహబ్ అని తెలిపారు. ఒక హదీసులో ఇలా కూడా సెలవిచ్చారు:
"నాకు అల్లాహ్ తఆలపై, ఎవరైనా ఆషురా దినాన ఉపవాసం ఉంటే అతడి మునుపటి సంవత్సర పాపాలకు బదులుగా చెల్లు చేస్తాడన్న నమ్మకం ఉంది".
అంతేకాక, ఈ పదవ తారీఖుని అల్లాహ్ తఆలా ప్రవక్త హజరత్ మూసా (అ)గారిని మరియు వారి సమూహాన్ని మొత్తం ఫిరౌన్ బారీ నుండి జయింపజేయడం జరిగింది. దీనివలనే, వారందరూ కలసి కృతజ్ఞతా రూపంలో ఉపవాసం పెట్టారు. ఇందుచేతనే ఈ దినాన యూదులు కూడా అదే కృతజ్ఞతను కొనసాగిస్తూ ఉపవాసాలు పెడుతూ వచ్చారు. ఈ విషయం మహనీయులు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తెలిసాక ఇలా ప్రబోధించారు:
"మేము మూసా (అ) గారి పట్ల మీకన్నా మాకు ఎక్కువ హక్కు ఉంది"! దీంతో హుజూర్ (స) గారు 10వ తారీఖున కూడా ఉపవాసం పెట్టారు మరియు తమ సహచరులకు కూడా ఉపవాసపు ఆదేశాన్ని ఇచ్చారు. (సహీ బుఖారీ)
ఇంకా హజరత్ ఆయిషా సిద్దీఖా (ర) గారి కథనం మేరకు ఇలా ఉంది: ఆషురా దినాన, ఈ లోకం మొత్తం విద్య నుండి అంధకారంలో మునిగి తేలుతున్నప్పుడు 'ఖురైషీలు' ఈ దినాన ఉపవాసం పెడుతుండేవారు మరియు హుజూర్ (స)గారు కూడా పెట్టేవారు. వారు హిజ్రాత్ చేసి మదీనా చేరుకున్న తర్వాత కూడా ఉపవాసం పాటించి తమ తోటి అనుచరులకు కూడా దీని ఆదేశాన్ని ఇచ్చారు. కానీ రంజాన్ మాసపు ఉపవాసాలు విధిగా ఖరారు చేయబడిన తర్వాత, హుజూర్ (స) గారు ఆషురా దినాన ఉపవాసం ఉండాలనుకునేవారు ఉండొచ్చు లేకుంటే వారి ఇష్టం అని తెలిపారు. (బుఖారి & ముస్లిం)
దీంతోనే తెలుస్తుంది, ఆషురా ఉపవాసాలకి గొప్ప విశిష్టత ఉందని. ఎందుకంటే హుజూర్ (స) గారు స్వయంగా ఉపవాసం ఉండేవారు మరియు వారి అనుచరులకు కూడా దాని గురించి సెలవిచ్చేవారు. ఇక్కడే ఉంది, ఒక అసలైన విషయం. యూదుల వలె మనం కూడా ఒకరోజు ఉపవాసం ఉంటామా? ఈ మాట ఇతరులలో చాలా సందేహాలను పుట్టిస్తుంది అయితే దీని సమాధానం కొరకై ఒక చక్కటి హదీస్ ఉంది:
రఈసుల్ ముఫస్సిరీన్ హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ గారి కథనం ఇలా ఉంది: హుజూర్ (స) గారు ఆషురా ఉపవాసం ఉండి, వారి అనుచరులకూ దీని గురించి సెలవిచ్చారు. ఆ సమయాన వారు ప్రవక్త గారితో ఇలా ప్రశ్నించారు:
"ఓ దైవ ప్రవక్తా! యూదులు మరియు నసారాలు ఈ రోజున ఉపవాసం ఉంటున్నారే" (అంటే దాని అర్థం దీనివలన మనం వాళ్ళని అనుసరిస్తున్నట్లు లేదా?అని). దీనితో హుజూర్ (స) గారు ఇలా సెలవిచ్చారు: ఇన్షా అల్లాహ్ ! దేవుడు కరుణిస్తే, మనం వచ్చే ఏడాది తొమ్మిదవ తారీఖున కూడా ఉపవాసం ఉందాం!
ఇక హజరత్ అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ (ర) గారు ఇలా కూడా తెలిపారు: ఆ తరువాయి సంవత్సరం రాకముందే మా మధ్య నుండి ప్రియ ప్రవక్త గారు దయచేశారు.(ముస్లిం)
పై హదీసు ద్వారా ఆషురా దినం మరియు దాని ఉపవాసాల విశిష్టతను బాగా అంచనా వేయొచ్చు. అంతేకాక, ఇందులోని ఇంత గొప్ప పవిత్రతకు చాలా కారణాలు ఉన్నాయి.
పురాణంలో ఈ దినాన అన్నిటికంటే ప్రసిద్ధి, ప్రఖ్యాతలుగాంచిన విషయం హిజ్రీ యొక్క 61వ సంవత్సరంలో కర్బలా మైదానంలో 'అహ్లుబైత్' లో సంభవించిన దుర్ఘటన. అందులో ఆఖరికి ప్రియ ప్రవక్త గారి మనమలైన హజరత్ ఇమామ్ హుసైన్ (ర)గారు అమరులైయ్యారు!వీరమరణం చెందారు!
ఆషురా ఉపవాసపు విశిష్టతలు
ఆషురా ఉపవాసపు విశిష్టత ముహర్రం మాసంలోని మిగిలిన రోజుల కన్నా ఎక్కువే మరియు దీని విశిష్టత గూర్చి హదీసులో ఇలా వచ్చింది:
హజరత్ ఆయిషా (ర) గారు ఇలా తెలిపారు: హుజూర్ (స) గారు ఆషురా దినాన ఉపవాసం పెట్టాలని ఆదేశించారు. తర్వాత రంజాన్ ఉపవాసాలు విధిగా ఖరారు చేయబడ్డాక, దీన్ని ప్రజల ఇష్టం మేరకు వదిలేశారు.
మరో హదీసులో ఈ దినాన్ని అల్లాహ్ యొక్క దినాలలో సమకూర్చడం జరిగింది. అది హజరత్ అబ్దుల్లాహ్ బిన్ ఉమర్ (ర)గారి వాక్కు మేరకు హుజూర్ గారు ఇలా ప్రబోధించారు:
" هذا يوم من ايام الله فمن شاء لأنه و من شاء تركه" (2443-అబూదావూద్)
ఇంకా దీని పుణ్య ఫలితాల విషయానికొస్తే, దీని ద్వారా ఉపవాసి యొక్క గత సంవత్సర పాపాలు శుద్ధమై తొలగిపోతాయి. ఇది హజరత్ అబూ ఖతాదా (ర) గారి ఒక పొడవాటి హదీసు ప్రకారం హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సెలవిచ్చారు:
"وسئل عن صوم يوم عاشوراء فقال يكفر السنه الماضيه"
ఇందులో గమనించిదగ్గ విషయం ఏమనగా, కేవలం చిన్న చిన్న తప్పులు, పాపాలు మాత్రమే మన్నింపబడతాయి. కానీ కబాయిర్ (చాలా పెద్ద పాపాలు) అయినచో వాటి కొరకు పశ్చాతాపన అనగా తౌబా చేయడం తప్పనిసరి మరియు అది షరత్తు కూడానూ.
ఆషురా ఉపవాసం మరియు యూదుల వ్యతిరేకత
యూదులు, ఇస్లాంకు మొదటి నుండే చాలా బద్ధ శత్రువులు. వీరిని వ్యతిరేకించడం అనేది ప్రవక్త గారి సాంప్రదాయం (సున్నత్). ఇందుమూలంగానే పురాతన ఇస్లామీయ ఆదేశాల్లో కూడా మాటలు మరియు చేతల ప్రకారం గాను వారు వ్యతిరేకించబడ్డారు. విశ్వాసులు మొదట్లో కేవలం ఒక ఉపవాసం మాత్రమే ఉంటుండేవారు. హుజూర్ (స) గారు మదీనా మునవ్వరా కు వచ్చినప్పుడు, ఈ సంగతి తెలిసాక వారికి విరుద్ధంగా వారితో పోటీపడేందుకై మరొక దినాన్ని పొడిగించారు. అలా కుదరకపోతే తొమ్మిదో తారీఖున కూడా ఉపవాసం ఉండవచ్చు దీని గురించి హజ్రత్ ఇబ్న అబ్బాస్ (ర) గారి కథనం మేరకు ఇలా ఉంది:
"صوموا التاسع والعاشر وخالفوا اليهود". (755- తిర్మిజీ)
9వ తారీఖున కుదరకపోతే,11 వ తారీఖున పెట్టవచ్చు దీనికి సాక్ష్యంగా హజ్రత్ ఇబ్న్ అబ్బాస్ (ర)గారి రెండవ కథనం ప్రకారం ఇలా ఉంది:
"صوموا يوم عاشوراء وخالفوا اليهود وصوموا قبله يوما او بعده يوما". (ముస్నద్ అహ్మద్)
ఇస్లామీయ పండితులు ఈ ఆదేశాల మేరకు కేవలం 10వ తారీఖున మాత్రమే ఉపవాసం ఉండేవారు ప్రవక్త గారి ఆదేశాన్ని వ్యతిరేకించిన వారవుతారని మరియు ఎవరైనా కేవలం ఆషురా దినాన ఉపవాసం పెడితే చాలనుకుంటే ఇది ముమ్మాటికీ తప్పేనని హెచ్చరించారు.
ఆషురా దినానికి సంబంధించిన పురాణం
హజరత్ 'ఆదం' (అ) గారి జననం అదే రోజున జరిగింది. అదే రోజున హజ్రత్ 'నూహ్' (అ) గారి నౌక (ఓడ) "జూదీ" అనే పర్వతంపై నిలుపబడింది. హజ్రత్ 'యూనుస్' (అ) గారు అదే రోజున తిమింగళం కడుపునుండి బయటకి వచ్చారు. హజ్రత్ 'ఇబ్రహీం' (అ) గారు, ఇదే రోజున అగ్ని ఆహుతి నుండి బయటపడ్డారు మరియు హజ్రత్ 'యాకుబ్' (అ)గారు తమ సొంత కొడుకైన 'యూసుఫ్' (అ) గారితో కలవడం జరిగిందీ ఈ రోజునే. ఇంతే కాదు హజ్రత్ 'యూసుఫ్' గారు తమ అధికారాన్ని చేజిక్కించుకోవడం, హజ్రత్ 'మూసా' (అ) గారు తమ అనుచరులతోపాటు ఫిరౌన్ పై జయించడం, హజ్రత్ 'ఈసా' (అ) గారి జననం, హజరత్ 'సులైమాన్' (అ)గారు తమ రాజరికాన్ని పొందడం, ఇలా రాస్తూ పోతే ఎన్నో గొప్ప గొప్ప సందర్భాలున్నాయి! అవన్నీ ఈ దినానే వెలుగులోకి వచ్చాయి.
అంతేకాక ఇదే రోజునే హజరత్ 'ఇద్రీస్' మరియు హజరత్ 'ఈసా' (అ) గారిద్దరూ గగనతలంపై కి లేపబడ్డారు మరియు ఇదే రోజున హుజూర్ (స) గారి ప్రియ మనుమడైన హజ్రత్ ఇమామ్ 'హుసైన్'(ర) గారు దుష్టులైన అవిశ్వాసులతో పోరాడుతూ అమరులయ్యారు. (మఆరిఫుల్ ఖురాన్)
అయితే ఇంతటి మహోన్నత విశిష్టతను కలిగి ఉన్న ఈ ఆషురా దినాన్ని చేజారకుండా చూసుకునే బాధ్యత మనది! ఈ బాధ్యతను వీలైనంతవరకు ఎక్కువగా ఖురాన్ పఠనం మరియు సురఫ్ ఫాతిహా వగైరా ఎక్కువగా చేస్తూ, వాటి పుణ్యం కర్బలాలో అమరులైన వారికి అంకితం చేసి, పుణ్యం కట్టుకోవాలి!
ఆ అల్లాహ్ తఆల మనందరికీ ఈ భాగ్యాన్ని ప్రసాదించుగాక! ఆమీన్!