షాబాన్ మాసం యొక్క విశిష్టత
ఇస్లామిక నెలల ప్రకారం ఇప్పుడు నడుస్తున్న మాసం పవిత్ర షాబాన్ మాసం. ఈ మాసానికి ముందు రజబ్ అని ఇంకొక పవిత్ర మాసం ముగిసిపోయింది. రజబ్ మాసం మొదలవగానే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రార్థన చేసేవారు
اللهم بارك لنا في رجب وشعبان وبلغنا شهر رمضان
అనగా ఓ అల్లాహ్ మమ్మల్ని ఈ నెల రజబ్ మాసంలో మరియు షాబాన్ మాసంలో బర్కత్ ప్రసాదించు మరియు మమ్మల్ని రంజాన్ మాసానికి చేరుకునేలా అనుగ్రహించు.
షాబాన్ మాసంలోని ఏడు రోజులు ఇప్పటికే ముగిసిపోయాయి. ఈనెల మొదలవగానే అల్లాహ్ యొక్క ఆశీర్వాదాలు అల్లాహ్ యొక్క రహమత్ ఈ లోకం పైన కురుస్తుంది. అయితే ఈ నెల మొదలవగానే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉపవాసాలు ఉండేవారు. ఎందుకంటే ఈనెల తర్వాత పవిత్ర మాసం రంజాన్ మొదలవుతుంది. అందులో 30 రోజులు కూడా ఉపవాసం ఉండాలి. అందుకొరకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శారీరకంగానూ, మానసికంగానూ రంజాన్ కోసం సిద్ధమయ్యేవారు.
عن عائشة رضي الله عنها قالت: كان رسولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَصُومُ حَتَّى نَقُولَ لاَ يُفْطِرُ وَيُفْطِرُ حَتَّى نَقُولَ لاَ يَصُومُ فَمَا رَأَيْتُ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ اسْتَكْمَلَ صِيَامَ شَهْرٍ إِلاَ رَمَضَانَ وَمَا رَأَيْتُهُ أَكْثَرَ صِيَامًا مِنْهُ فِي شَعْبَانَ
ఆయిషా రజియల్లాహ్ అన్హా కథనం ప్రకారం: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం షాబాన్ మాసంలో ఉపవాసం ఉండేవారు. వారు ఉపవాసం ఉంటే తిననట్టుగా, భుజిస్తే ఉపవాసం లేనట్టుగా అనుకునేవాళ్లం. రంజాన్ మాసం తప్పితే షాబాన్లో పూర్తి ఉపవాసాలు ఉన్నట్టు వేరే ఏ మాసంలో కూడా ఉండేవారు కాదు. షాబాన్ లో ఎన్ని ఉపవాసాలు ఉండేవారో అంతకన్నా ఎక్కువగా వేరే మాసంలో నేనెప్పుడూ కనుచూడలేదు.
عن أُسَامَةَ بنِ زَيْدٍ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قُلْتُ: يَا رَسُولَ اللَّهِ لَمْ أَرَكَ تَصُومُ شَهْرًا مِنَ الشُّهُورِ مَا تَصُومُ مِنْ شَعْبَانَ، قَالَ: « ذَلِكَ شَهْرٌ يَغْفُلُ النَّاسُ عَنْهُ بَيْنَ رَجَبٍ وَرَمَضَانَ وَهُوَ شَهْرٌ تُرْفَعُ فِيهِ الأعْمَالُ إِلَى رَبِّ الْعَالَمِينَ فَأُحِبُّ أَنْ يُرْفَعَ عَمَلِي وَأَنَا صَائِمٌ
ఉసామా రదియల్లాహు అన్హు కథనం ప్రకారం: వారు ప్రవక్తను ఇలా అడిగారు: ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం! నేను మిమ్మల్ని ఎప్పుడూ షాబాన్ మాసంలో ఉపవాసం ఉన్నట్టుగా వేరే మాసంలో చూడలేదు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా బదులిచ్చారు: ఆ నెలలో ఎక్కువమంది అశ్రద్ధ చూపుతారు. కానీ ఆ నెలలో మనిషి యొక్క ఆచరణలు అల్లాహ్ వద్దకి చేరుకుంటాయి. అందుకని నేను కూడా నా ఆచరణలు అల్లాహ్ వద్దకు నేను ఉపవాసం ఉంటుండగా చేరుకోవడాన్ని కోరుకుంటున్నాను.