ఫతహే మక్కా: ప్రవక్త (స) ప్రసంగం, సందేశం

 దైవప్రవక్త[స] మక్కా విజయం నాడు మక్కా యొక్క అవిశ్వాసుల ఎదుట వచ్చి నిలబడి ఇలా ప్రసంగించారు:

ప్రజల్లారా! అంధకార కాలము లో గర్వకారణాలైన సమస్తవిషయాలు పూర్వకాలపుహత్యలు హత్య ప్రతీకారాలన్ని ఇప్పుడు నా కాళ్ళ కింద నలిగి పోయాయి. అంధకార కాలపు అహంభావాలు కులగోత్రాలపట్ల గర్వ పడటాన్ని దేవుడు రూపుమాపాడు.ఇస్లాములో జాతి వంశ భేదాలనేవి లేవు. అధికుడు అధముడనే తేడా కూడా లేదు. అల్లాహ్ దృష్టి లో అందరూసమానమే మానవులందరు ఆది పురుషుడైన హజరత్ ఆదం[అ] గారి సంతతి లోని వారే"అని వివరించారు. ఆదం[అ] మట్టితో సృష్టించబడ్డారు. ప్రసంగ మైన తరువాత దైవప్రవక్త[స] దివ్యఖురాన్ లోని ఈసూక్తి పఠించారు:

يَا أَيُّهَا النَّاسُ إِنَّا خَلَقْنَاكُم مِّن ذَكَرٍ وَأُنثَىٰ وَجَعَلْنَاكُمْ شُعُوبًا وَقَبَائِلَ لِتَعَارَفُوا ۚ إِنَّ أَكْرَمَكُمْ عِندَ اللَّهِ أَتْقَاكُمْ ۚ إِنَّ اللَّهَ عَلِيمٌ خَبِيرٌ 

 ఓ జనులారా! "మేము మిమ్ములను ఒకే స్త్రీ పురుష జంట నుండి పుట్టించాము. తరువాత మీపరస్పర పరిచయం కోసం మిమ్ములను విభిన్న తెగలుగా, వంశములుగా విభజించాము. కాని మీలో అందరికంటే ఎక్కువ భక్తిని గలవారే దేవుని దృష్టిలోఎక్కువ గౌరవనీయులు. నిస్సందేహంగా దేవుడు సర్వజ్ఞాని సమస్త విషయాలు తెలిసినవాడు [49.13].

తరువాత ఖురేషీయుల వైపు తిరిగి ఓ ఖురేష్!నేను మిమ్ములను ఏంచేస్తానో తెలుసా? అని అడిగితే వారి లో ఒకరు అది తెలియదు కాని మీరు మంచి సోదరులని మంచి సోదరుని కుమారులని తెలుసు" అని జవాబిచ్చారు. అవును మంచి సోదరునిగా యూసుఫ్[అ] ఏం చేశారో అదేచేస్తాను. యూసుఫ్[అ] తమ సోదరులకు ఏం చేశారో అదే నేను కూడా చేస్తాను. అంటే మీ అందరిని క్షమిస్తాను. వెళ్ళి హాయిగా స్వేచ్చగా జీవించండి. అల్లాహుతాలా మిమ్ములను క్షమించు గాక. అని చిరునవ్వుతో ఆ శత్రువులను దీవించారు. అంతలో నమాజుకు వేళ అయింది. మహా ప్రవక్త[స] గారు హజ్రత్ బిలాల్[ర] ను అజాన్ ఇవ్వవలసినదిగా ఆదేశించారు. హజ్రత్ బిలాల్[ర] కాబెతుల్లా పైకెక్కి గట్టిగా అజాన్ ఇచ్చారు. హజ్రత్ బిలాల్[ర] తమ మధురమైన కంఠము స్వరము తో అజాన్ ఇస్తుంటే మక్కా నగరమంతా ఉర్రూతలూగినది. వాస్తవానికి అది అజాన్ మాత్రమే కావచ్చు, కాని అది ఏకేశ్వరోపాసనకై చాటింపే కాకుండా ఇస్లామీ విప్లవ విజయం యొక్క ప్రకటన కూడాను. నమాజు ముగిసిన తరువాత మహాప్రవక్త[స] బీబీ ఉమ్మెహాని[ర] ఇంటికొచ్చి స్నానము చేసి మక్కా జయించిన దానివలన దేవునికి కృతజ్ఞతలర్పిస్తూ 8 రకాతుల నఫీల్ నమాజు ఆచరించారు.

అది మానవచరిత్ర యొక్క స్థితిగతులు నిర్ణయించిన మహాసంభవమై ఉండెను. "ఫతహె మక్కా". పవిత్ర భూమిలో రక్తము చిందించకుండానే విగ్రహపూజ నుంచి తౌహీద్ వరకు మనస్సులు మళ్ళించడానికి రసూల్[స] గారికే సాధ్యమైనది. అక్కడినుంచి తరిమిగొట్టి, పరుగులు తీయించబడిన, అదే మాతృభూమిలోనికి విజయశ్రీ అయ్యి తిరిగివచ్చినప్పుడు మహాప్రవక్త[స] గారికిఎటువంటి అహంకారము లేదు. తమను మరియు తమకు విశ్వసించిన ముస్లిములకు చాల అధికంగామోసం చేసిన వారిని మహాప్రవక్త[స] ఊరికేవదిలేశారు. ఆ తరువాత వారందరు ఇస్లాం స్వీకరించి రసూల్[స] గారి చేతిలో చేయి పెట్టి [బైఅత్] చేశారు. ఆ విధంగా ఇస్లాం స్వీకరించిన వారిలో పురుషులే కాకుండ స్త్రీలు కూడా ఉన్నారు. ఆఖరికి ముహమ్మద్[స] గారికి బద్దశత్రువు, మరియు హజ్రత్ హంజ[ర] గారినిచంపిన వహిషి మరియు వారి రొమ్మును చీల్చి గుండెను నమిలి ఊంచిన పరమకిరాతకురాలైన "హింద" కూడా వారిలో ఉండిరి. అబూజహల్ యొక్క కుమారుడైన ఇక్రమ కూడా వారిలో ఉండెను. ఇస్లాం పాపనేరాలను ఏమిగాని మిగల్చదు. ముస్లిములైన దానివలన క్షమించరాని పాపములు అనేవి ఉండవు. తరువాత కాలములో వీరందరూ ఇస్లాం కోసమే జీవించి ప్రాణత్యాగాలు చేయడం జరిగినది. మొదటి నుంచి చివరివరకు ప్రవక్త[స] గారు ఆశించినది మానవుడు తన సన్మార్గము చేత స్వర్గప్రాప్తి పొందడం మాత్రమే. మక్కా జయించిన తరువాత దాని పరిసరాలలో ఉండిన పెద్ద విగ్రహాలు పడగొట్టుటకు తమ అనుచరులను పంపారు. లాత్, ఉజ్జ, మనాత్, హుబ్ల కుల దేవతలన్ని పడగొట్టబడ్డాయి.

మక్కాలోని హరం షరీఫ్ ను అంతిమ రోజు వరకు పవిత్ర భూమిగా రసూల్[స] గారు ప్రకటించారు. అక్కడ ఒక లేత మొక్కైన సరే కోయుట గాని ఏదైన జంతువును వేటాడుట గాని చేయకూడదని రసూల్[స] గారు ఆదేశాలు జారి చేశారు. మక్కా జయించిన దానివలన అరేబియన్ ఉపద్వీపములో అనేక గోత్ర సముదాయములు గుంపులు గుంపులుగా ఇస్లాం స్వీకరించారు.

మక్కావిజయ సమయములో ఒక సంఘటన జరిగినది. మఖ్సూమ్ తెగ కు చెందిన ఒక స్త్రీ దొంగతనము చేసినది. ఇస్లాం ధర్మశాస్త్రం ప్రకారం ఆమెకు హస్తఖండన శిక్ష విధించవలసిఉంది. కాని ఆ మహిళ యొక్క బందువులు దైవ ప్రవక్త[స] గారికి ప్రియమైన అనుచరుడైన ఉసామబిన్ జైద్[ర] ను సమీపించి శిక్షను తగ్గించమని సిఫారసు చేయాలని కోరారు. అప్పుడు హజ్రత్ ఉసామా[ర] ఈ విషయం వివరించి హస్తఖండన శిక్ష నుంచి తప్పించమని దైవప్రవక్త[స] గారికి మనవి చేశారు.ఈ మాటలు వినగానే దైవప్రవక్త[స] గారి ముఖము కోపము తో జేవురించినది [ఎర్రగా మారినది]. ఆరోజు సాయంత్రము ప్రజలను సమావేశపరిచి ప్రసంగిస్తూ: "మీకు పూర్వం ఉండిన జాతులు పేరు పలుకుబడిగల ఉన్నత వంశస్థుడు దొంగతనము చేస్తే శిక్ష విధించకుండా వదిలిపెట్టేవారు. అదే బలహీన వర్గము లేదా పేరు పలుకుబడులు లేనివారెవరైన దొంగతనము చేస్తే మాత్రం వారికి కఠినశిక్ష విధించేవారు. ఈకారణంగానే ఆనాటి జాతులు నాశనమయ్యాయి. నా ప్రాణం ఎవరి ఆధీనములో ఉందో ఆశక్తి స్వరూపుని సాక్షి గా చెబుతున్నాను ముహమ్మద్(స) కూతురు ఫాతిమా[ర] దొంగతనము చేసినా సరే నేను ఆమె చేతిని కూడ నరికేస్తాను:అని అన్నారు."

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter