ప్రవక్త (స) గారి యుద్దాలు: యుద్దం ఓ తుది ప్రయత్నము

ప్రవక్త () గారి యుద్దాలు: యుద్దం ఒక ఉపోద్ఘాతము

 

ప్రవక్త(స) గారి ప్రచార మంతయు చాలా సౌమ్యంగాను, సహోదరభావంగాను ఉండేది. అర్ధములేని విగ్రహారాధనకు, ఆర్ధిక, మానవ, బలవంతపు వసూళ్ళకు వ్యతిరేకంగా, శాంతి పూర్వకంగా వారు సమాజన్ని మేలు కొల్పారు. కాని సమాజము మాత్రం నబి(స) గారితో పరిహాస పూర్వకంగా వ్యవహరించినది. తరువాత దురారోపణాలు వేధింపులుండేవి. చివరకు నబి(స) గారిని చంపటానికి కుట్రకూడ పన్నినారు. అప్పుడు అల్లాహుతాలా ప్రశాంతంగా మత ప్రచారము చేయటానికి అవసరమైన సౌకర్యములు సమకూర్చాడు.

ఐతే అక్కడ కూడ రెండు వైపుల నుంచి శత్రువులను రసూల్(స) గారు ఎదుర్కొన్నారు. ఖురేషీయులు మదీనా లో కూడా ప్రశాంతంగా జీవించటానికి అనుమతించలేదు. అప్పుడప్పుడు ఇరుగు పొరుగు దేశాల నుంచి వచ్చిన ముస్లిం లను వేధించే వారు.

              మదీన లో యూదులలోని కొన్ని తెగలే రెండవ శత్రువులు. నబి(స) గారు మదీన చేరిన వెంటనే వారితో శాంతి ఒప్పందం పై సంతకం చేసి ఉండిరి. కాని జూదులు దగా, మోసం, పారంపర్యంగా లభించినవారు. మదీన లో ప్రవక్త(స) గారికి లభించిన ఆదరణ జూద నాయకులలో కోపము మరియు అసూయ పెరగటానికి కారణమైనది. ఓర్పు యొక్క చివరి హద్దు వరకు చూసి రసూల్(స) మరియు సహాబీలు రక్షణ మరియు పోరాట బాటపట్టారు.

ఇస్లాం ప్రాయోగిక మతము. దీని నియమాలు ప్రకృతిని అనుసరించి ఉంటాయి. వేధింపులు మరియు దౌర్జన్యాలు అత్యున్నత దశ వరకు చేరినప్పుడు ఓర్పు వహించిన కూడా శత్రువు మారక పోతే రక్షణ కోసం ఏమి చేయలేకపోవడం అనేది ప్రకృతి వ్యతిరేకమవుతుంది. ఒక చెంప మీద కొట్టిన వానికి తన రెండవ చెంప చూపమని ఇస్లాం లో ఎక్కడా కాని ప్రస్తావించలేదు.

మూల్యములు, ప్రమాణాలు మరియు పుణ్యములు అంగీకరించనివారికి అహింస మరియు ఓర్పు అనే దానికి ఒక హద్దు అనేది ఉంది. అన్నిటి కంటే ఎక్కువ సత్యదీన్(ధర్మము)ప్రచారం కోసం ఆటంకాలు సృష్ఠించువారిని అడ్డుకోవాలనేది దైవ తీర్మానము. ప్రపంచ సమాజమును నరకాగ్ని(అగ్నిగుండం)నుంచి తప్పించి స్వర్గీయ సుఖములకు తీసుకెళ్ళే దానికి మరియు మానవ నిర్మితమైన బానిస సంకెళ్ళ నుంచి దైవికమైన స్వతంత్ర ప్రపంచము లోనికి  విమోచనం చేయటానికి దారి తప్పిన మతాల పీడనాల నుంచి సత్యమతము యొక్క నీతి లోనికి చేయి పట్టుకొని వెళ్ళటానికి అవసరమైన భౌతిక సదుపాయాలు సమకూర్చుట అనేది తప్పని సరి. దీని కోసం అవసరమైన సమయంలో మాత్రం నిశ్చయించిన నిబంధనాలు పాటించి యుధ్ధం చేయవచ్చు అని అల్లాహుతాలా అనుమతినిచ్చాడు.

యుద్ధానుమతి ఇస్తూ అవతరించబడిన మొట్టమొదటి ఖురాన్ వచనాలు ఇవి:

“ముహమ్మద్(స) గారు మక్కా పురములో ఇస్లాం మత ప్రచారంచేయునప్పుడు కాఫిర్లు పెట్టిన కష్టములను ముస్లింలు సహించుకుంటూ శాంతిగా ఉండవలెనని దేవునిశెలవు. కావున వారుఅట్లు పదమూడు యేండ్లు సహించలేని కష్టములు సహించి ఉండిరి. ఆ పిదప మదీనా పురములో ఇస్లాం ప్రబలెను. అచ్చటికి ముహమ్మద్(స) గారు మరియు ముస్లింలు పోయి చేరిరి. అప్పుడు అవిశ్వాసుల దౌర్జన్న్యములను, అన్న్యాయములను సహించుచున్న ముస్లింలు తమ మత, ధర్మములను, ప్రాణములను కాపాడుకొనుటకై తమవారి సంఖ్య కొద్దిగా ఉన్ననూ దేవునిపై ఆధారపడి ధర్మయుధ్ధము చేయవలెను. దేవుడు సర్వశక్తుడు, ముసల్మానులకు తోడ్పడును అని దేవుని శెలవాయెను”.(కాండము: హజ్, వాక్యము: 39)

“మక్కాలోని అవిశ్వాసులు, ముస్లింలపై అనేక అన్న్యాయములు, దౌర్జన్న్యములు గావించి వారికి చాలా కష్టములు కలిగించిరి. తుదకు ముస్లింలు తమ ఇండ్లను విడిచిపెట్టి మదీనా పురము చేరిరి. వారు చేసిన తప్పు ఏమియులేదు. విగ్రహారాధనను విడిచిదేవుడు ఒక్కడే మా ప్రభువు అని పలికి నందున మక్కాలోని అవిశ్వాసులు విరోధులైరి. ప్రతి కాలములోను దుష్టులు ప్రబలినప్పుడు దేవుడు తన భక్తుల మూలమున వారిని శిక్షించుచున్నాడు. లేనిచో దుర్మార్గులు ప్రబలి లోక వినాశమును కలిగింతురు. ధర్మము అడుగంటును.

గుళ్ళు, మఠములు, మస్జిదులు మొదలగునవి దుష్టులచే నాశనమై యుండును. కావున దేవుడు ధర్మ యుద్దమునకై సెలవు వసంగెను. దుష్టులతో యుద్దము చేసి అణిచివేయవలెను. మత ధర్మములను కాపాడుటకు ఎవరైతే సంసిద్దులై దానికొరకు పాటు పడుదురో వారు దేవునికి తోడు పడినవారగుదురు. అట్టి వారికి తప్పక దేవుని సహాయము లభించును. జయము చేకూరును. దేవుడు సర్వశక్తుడు, బలము గలవాడు కావున ముసల్మానులు అతని పై ఆధార పడి యుద్దము చేయవలెను”. (కాండము: హజ్; వాక్యము: 40).

రక్తము చిందించుట కాని హత్యలు చేయుట కాని దోపిడిచేయుట కాని ఇస్లాం యొక్క లక్ష్యము కాదు. మంచితనము, శాంతి, అభివృద్ది, మొదలైనవి సమాజములో సృష్టించుటయే జిహాద్ యొక్క లక్ష్యము.

ధర్మ రక్షణ కొరకు నీతిని కాపాడుటకు, దుర్మార్గుల దౌర్జన్యములను అంతమొందించుటకు ఖడ్గము చేత బట్టిన నబి(స) ఇరవైఆరు యుద్దములలో పాల్గొన్నారు. వీటినే ‘గజ్వత్’ అని అంటారు. పై చెప్పిన మహదాశయముల కొరకై నబి(స) గారి అనుయాయులు (సహాబీలు) మొత్తం ముప్ఫైఎనిమిది యుద్దములలో పాల్గొన్నారు. వీటిని ‘సరియ్యత్’ అని అంటారు. ఈ మొత్తం యుద్దములలో మరణించిన వారి సంఖ్య కేవలము ఒక వెయ్యి పద్దినిమిది మందిమాత్రమే.

మేము సంస్కారవంతులము నాగరికులము అని చాటుకొని మొదటి ప్రపంచ యుద్దము, రెండవ ప్రపంచ యుద్దములకు కారకులైన ప్రపంచ దేశనాయకులైన వారు తమ ఆధిపత్యము కొరకు కోట్లాది మంది ప్రాణాలను బలిగొన్నారు. ఈ యుద్దల వలన ఏర్పడిన ఆర్థిక మాంద్యముచే లక్షలాది మంది ఆకలి బాధతో మరణించారు. ఇట్టి వీరు రసూల్(స) గారిని యుద్ద పిపాసి అని భయంకరమైన క్రూరుడని ధనము కొరకు మనుషులను బానిసలుగా చేసుకున్నాడని చిత్రీకరించుట విడ్డూరంగా ఉన్నది. ప్రవక్త(స) గారు ఎట్లు ధర్మ పోరాటవాది అవుతారని ప్రశ్నించడము చాలా ఆశ్చర్యమును గొల్పుతుంది.

 ప్రవక్త(స) గారి కుడి చేతిలొ ఖడ్గము ఎడమ చేతిలొ ఖురాన్ పట్టుకొని ఇస్లాంమత ప్రచారం చేశారనే వాదం  అర్థంలేని మాటలు. తమ ఉద్దేశం మతాన్ని బలవంతంగ ఇతరులపై రుద్దడం అనేది కాదు. దీనికి ఇస్లాం ఏకీభవించదు కూడ. ఆ యుద్ధాలతో మనస్సులను మార్చగలుగుతామనేది కేవలం భ్రమ మాత్రమే అవుతుంది.

ఇస్లాం మతంలో తప్పనిసరి అనే పదమే లేదని "ఖురాన్" వ్యక్తపరుస్తున్నది. ప్రవక్త(స) గారు వఫాత్ అయ్యే టప్పుడు వారి ఇనుప కవచము వారి పొరిగింటి వాడైన యూదుని చేతిలో కుదువ ఉంచబడి ఉండెనని చరిత్ర చెబుతున్నది. ఆ తరువాత నబి[స] గారు తమ ఆయుధం తో ఏ శత్రువును హత మార్చారు?

                     శత్రువును అంగవిచ్చిన్నం చేయకూడదని, కాయలు కాస్తున్న చెట్లను నరక కూడదని, దగా, మోసం, దొంగతనం చేయకూడదని, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, మున్నగువారిని హత్య చేయకూడదని, ఆహారవసరములకు తప్ప జంతువులను కోయకూడదని మున్నగు సామాన్య మర్యాదలు యుద్ద భూమిలో పాటించవలెనని నబి[స] గారు తమ అనుచరులకు బాగా బోధించారు.

సన్న్యాసి మఠాలలోను చర్చీలలోను ఉన్న పురోహితులను సైతం వేధించ కూడదని బోధించేవారు. ప్రవక్త[స] గారు నేర్పిన యుద్ద మర్యాదలు క్లుప్తంగా చెప్పాలంటే ప్రవక్త[స] గారు శాంతి కోసం మాత్రమే యుధ్ధాలు చేసేవారు. ప్రవక్తలు మరియు ఖలీఫాలు, నాయకత్వం వహించిన యుధ్ధముల ద్వారా మానవ వినాశమునకు ముగింపు పలుకుటయే కాక ప్రపంచము వైజ్ఞానికంగాను, సాంస్కారికంగాను అభివృధ్ధి చెందినది.

దోపిడీలు, హత్యలు తమ దినచర్యలై ఉండిన అరబ్ దేశాల లో ఒక స్త్రీకి "సన్ఆ" నుంచి "హజర్మౌత్" వరకు [అరబ్ దేశంలోని రెండు దృవాలు] ఒంటరిగా భయంలేకుండా యాత్ర చేయటానికి మార్గము సుగమమైనది. శాంతి లభించినది. మానవ చరిత్ర లో ఎక్కడ లేనట్టి ఆదర్శమును ప్రవక్త[స] గారు సృష్ఠించారు. మంచి ఉద్దేశంతో చరిత్రను సమీక్షించు  వారు మాత్రమే నబి[స] గారి నేతృత్వము వహించిన యుధ్ధములను మంచి రీతిలో విమర్శించగలుగుతారు.

సదుద్దేశము తో ఆలోచన చేయగలుగు వారికి సద్భావన కలుగుట సహజమే కదా.

 

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter