సృష్టి నిర్మాణం “యాక్సిడెంటల్”గా జరిగిందా?

సృష్టి నిర్మాణం “యాక్సిడెంటల్”గా జరిగిందా?


          ఈ సమస్త విశ్వం, భూమి, మానవులు “యాక్సిడెంటల్”గానే ఉనికిలోకొచ్చేశాయి తప్ప ఏ సృష్టికర్త యొక్క మేధాస్సూ వాటి వెనుక ఉండి సృష్టించలేదు అన్నది అభినవ నాస్తికుల వాదన. 
        “యాక్సిడెంటల్ గా” అంటే ఎవరూ సృష్టించకుండానే దానంతట అదే ఉనికిలోకి వచ్చేయటం అన్నమాట. అంటే నాస్తికుల ప్రకారం ప్రారంభంలో శూన్యంలో వివిధ రకాల గ్యాసెస్ (Gases) తో, అత్యంత దట్టమైన పొగ (Smoke) తో “ప్రైమరీ నెబ్యూల” దానంతటకదే ఏర్పడిపోయి ‘మహా విస్ఫోటనం (Big bang)’ జరిగి విశ్వం దానికదే ఉనికిలోకి వచ్చేసి..  అందులో వివిధ గ్రహాలు, నక్షత్రాలూ ఏర్పడిపోయి..      ఆ గ్రహాలన్నీ తమంతట తామే ఎంతో తెలివిగా ఎంతెంత పరిణామాల్లో ఉండాలో అవే రూపొందించేసుకుని.. ఏ గోళం సూర్యునిగా మారి మండుతుండాలి.. ఏ గ్రహం జీవజాలానికి అనువుగా ఉండాలన్నది డిసైడ్ చేసేసుకుని. ఏయే  గ్రహం ఎంత వేగంతో తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగాలో నిర్ణయించేసుకుని..  ఏయే గ్రహాలు ఏయే కక్ష్యల్లో ఉండాలో.. వాటి మధ్య ఎంతెంత దూరం ఉండాలో వాటికవే రూపకల్పన  చేసేసుకుని..  ఆయా కక్ష్యల నుండి తప్పిపోకుండా కావలసినంత గ్రావిటీ పవర్ కూడా ఆటోమేటిగ్గా ఏర్పడిపోయి..  విశ్వంలో ప్రతీ గ్రహం తనకుతానుగా క్రమబద్ధంగా అదుపు చేసేసుకుంటుందన్న మాట. ఇదే నేటి అభినవ నాస్తికత్వం చెప్పేది. 
        అలాగే ఏకకణ జీవుల నుండి వెన్నెముక లేని (అకశేరుకాలు) జీవులు ఏర్పడి ఆ తర్వాత కాలంలో సకశేరుకాలు (వెన్నెముక గల జీవులు) ఏర్పడిపోయి అలా అలా... పరిణామ క్రమంలో మానవుడు ఉద్భవించాడు అని... కోతి జాతికి చెందిన జంతువుల నుండి ప్రణామం చెందాడని ఇలా మొత్తానికి మానవ సృష్టి సైతం “యాక్సిడెంటల్”గా దానికదే ఉనికిలోకి రావటం జరిగింది తప్ప ఎవరూ సృష్టించలేదు అన్నది తమను తాము ఒకప్పటి కోతిజాతులుగా డిక్లేర్ చేసుకునే నాస్తికుల వాదన.  
      విశ్వం నుండి మానవుడు వరకు “యాక్సిడెంటల్” గా ఉనికిలోకి వచ్చినవే తప్ప వాటి వెనుక ఏ సృష్టికర్త మేధాస్సూ లేదు అని చెప్పేవారు గమనించాల్సింది-  ఆదిలో బిగ్ బ్యాంగ్ జరిగిన తరువాత చెల్లాచెదురైపోయిన క్రమరహితమైన  విశ్వవ్యవస్థ తయారైందా? అన్నది. 
     విశ్వం ఉనికిలోనికి వచ్చిన తరువాత గ్రహాలు ఏర్పడటం.. అవన్నీ పటిష్టమైన కొలతలతో.. నిర్దిష్ట దూరాలతో కక్ష్యల్లో నియమించబడటం.. వాటిలో కొన్ని మండే సూర్యగోళాలుగా మార్పుచెందటం.. అవన్నీ నిర్ధిష్ట కక్ష్యల్లో ఇసుమంతైనా తప్పిపోకుండా తిరగటం.. జీవుల ప్రశాంత మనుగడకు తగ్గట్టు భూమి, దానిపై జీవజాలం.. ఆ జీవజాలం బ్రతకటానికి కావలసిన పర్యావరణం, వాయువులు, ప్రకృతి అందులో సమతూల్యత..  ఆహారానికి కావలసినన్ని ఏర్పాట్లు కలిగిన ఇంత పెద్ద వ్యవస్థ “పటిష్టమైన క్రమ బద్ధత (Discipline) కలిగి ఎలా నడుపబడుతుంది?” అన్న ప్రశ్నకు సరైన సూటైన సమాధానాన్ని ఏ నాస్తికుడూ చెప్పలేడు. యాక్సిడెంటల్ గా అని చెప్పి తప్పించుకోవటం తప్ప.   
      అలాగే మానవుడు పరిణామ క్రమం చెందుతూ వచ్చాడే తప్ప ఎవరూ సృష్టించలేదు మనిషి కేవలం అనేక జంతువుల్లో కాస్త పరిణామం చెందిన జంతువు మాత్రమే అని చెప్పేవారు.. మనిషి భౌతికంగా ఎలా పరిణామం చెందుతూ వచ్చాడో చెబుతారు తప్ప ఒక్క మనిషికి  మాత్రమే “మానవత్వం” “నైతికత” “ఫలానా మంచీ- ఫలానా చెడు అని గుర్తించగలిగే లేక వాటి మధ్య విచక్షణ చేయగలిగే సామర్థ్యం” “వాటిలో మంచి చెయ్యాలనుకుంటే మంచీ, చెడు చెయ్యాలనుకుంటే చెడు చెయ్యగలిగే ఎంపిక స్వేచ్చా” వగైరా సామర్థ్యాలు ఎలా ఇవ్వబడ్డాయి? అన్న ప్రస్తావన గానీ చర్చ గానీ ఉండదు. 
***
సృష్టిలో కనపడే ఐదు ప్రధాన విషయాలు! 


     విశ్వంలో అణువు నుండి బ్రహ్మాండం వరకు.. ఐదు ప్రధాన విషయాలు కనపడతాయి 1). “గంభీరమైన క్రమబద్ధత (Discipline)” 2. “చలనం (Motion)” 3.  “సమతుల్యత (Balance)”. 4. అర్థవంతమైన ప్రక్రియ (Meaningful process) 5. పటిష్టమైన కొలతలు (Measures)..  ఇవన్నీ ఏదో ఒక “మేధాశక్తి (Intelligence)” ఉండి తయారుచేసి, నియంత్రించే వాటిలోనే ఉండే విషయాలు.  తప్పితే వాటికవే యాక్సిడెంటల్ గా ఏర్పడేవాటిలో ఇవేమీ ఉండవు. 
     ఉదాహరణకు: ఒక అందమైన పేయింటింగ్ వెయ్యాలనుకున్నప్పుడు కొన్ని రంగుల్ని తెల్ల కాగితంపై విసిరేస్తే యాక్సిడెంటల్ గా తయారైపోదు. మేధాశక్తిని, నైపుణ్యాన్ని ఉపయోగించాలి.. ఒక క్రమబద్ధత పాటించాలి.. రంగుల మధ్య సమతుల్యత పాటించాలి.. అర్థవంతమైన రూపు రేఖలనివ్వాలి.. పటిష్టమైన కొలతలు చూసుకోవాలి అప్పుడే ఒక అందమైన కళాఖండం ఏర్పడుతుంది. అచ్చం ఈ సమస్త సృష్టి కూడా ఎంతో క్రమబద్ధతతో, నైపుణ్యతతో పటిష్ట సమతుల్యత, కొలతలతో ఒక మహత్తర "మేధ" ద్వారా రూపుదిద్దబడి ఉనికిలోకొచ్చిందే.
       విశ్వం, మానవుడు యాక్సిడెంటల్ గా ఉనికిలోకి వచ్చేశాయి అన్నది ఎంత హాస్యాస్పదమంటే.. భూమిలో వివిధ లోహాలూ, ఖనిజాలు, రసాయనాలు, గ్యాసెస్ వాటంతట అవే పైకి పెల్లుబికి అవన్నీ కొన్ని ఆకారాలుగా మారిపోయి... అవన్నీ క్రమంగా ఒకదానికొకటి అమర్చబడి అలా కొన్నాళ్లకు పరిణామక్రమంలో.. ఇదిగో నా చేతిలో ఉన్న మొబైల్ ఫోనుగా మారిపోయింది! అని చెప్పటం లాంటిదన్న మాట. అలా చెబుతూ నేను గనుక ఒక పోస్టు పెడితే నన్నో అజ్ఞానిగా అభివర్ణించేవారు... అదే నేను-  
      “గొప్ప టెక్నాలజీతో తయారు చెయ్యబడ్డ మొబైల్ ఫోనుతో... ఈ విశ్వానికీ లేక మానవ దేహ నిర్మాణానికీ పోలికేంటండీ? మొబైల్ ఫోన్లూ,  మనం వాడే ఎలక్ట్రానిక్ వస్తువులూ, కార్లూ, వాహనాలూ, విమానాలూ  వగైరావంటే ఎంతో టెక్నాలజీతో కూడిన వస్తువులు కాబట్టి వాటి వెనుక ఓ గొప్ప మేధాశక్తీ, సైంటిస్టులూ ఉంటారనటంలో అర్థం ఉంది.. ఈ విశ్వం వాటిలో గ్రహాలూ, భూమీ, వాతావరణం, ప్రకృతి వాటిలో జీవులు, మనిషి దేహ నిర్మాణం వగైరా వాటి వెనుక వెధవది ఏం తొక్కలో టెక్నాలజీ ఉందని? అవన్నీ యాక్సిడెంటల్ గా అలా ఏర్పడిపోయాయంతే...  అలా ఏర్పడిపోయి ఎంతో అసమానమైన క్రమబద్ధతతో వాటికవే నియంత్రించబడుతున్నాయంతే.. వాటన్నిటినీ  వెనుక ఏదో గొప్ప మేధాశక్తి పని చేస్తుందని ఎందుకు అనుకోవాలి? అని మెదడును మోకాల్లో పెట్టుకుని పోస్టు రాస్తే మటుకు కొందరి దృష్టిలో నేనో పెద్ద మేధావిగా, అభ్యుదయవాదిగా గుర్తించబడతాను.
     ఓ అందమైన పేయింటింగ్ వెనుక ఓ కళాకారుడు లేనిదే ఉనికిలోకి రాదు అన్నది కామన్ లాజిక్ అయితే... సృష్టిలో ప్రతీ వస్తువునూ ఎంతో పొందికగా మరెంతో అందంగా తీర్చిదిద్దిన ఓ “రూపకర్త (Designer)” లేడని నమ్మటమే అభినవ నాస్తికుల లాజిక్ లో మ్యాజిక్! 
    ఒక టెక్నాలజీ వెనుక ఒక మేధాశక్తి ఉంటుంది అన్నప్పుడు.. సమస్త విశ్వంలో అణువు తాలూకు అసమానమైన గొప్ప టెక్నాలజీ నుండి గొప్ప ఆకృతితో కూడిన మానవ దేహా నిర్మాణం వాటి అవయవాల పనితీరు వరకూ సాటిలేని గొప్ప “టెక్నాలజీ” గురించి ఎన్ని సంవత్సరాలు వివరిస్తూ ఉన్నా మిగిలే ఉంటుంది. కానీ, అలాంటి బ్రహ్మాండమైన టెక్నాలజీ వెనుక ఏ మేధాశక్తీ లేదు అదంతా హుళుక్కే అన్నది నాస్తికుల ఆధునిక అభ్యుదయవాదం. తాను తీసుకునే శ్వాస నుండి... తన శరీర అవయవాల వ్యవస్థ సక్రమ పనితీరు వరకూ... విశ్వవ్యవస్థ నుండి  భూమీ,  దాని మీదున్న వాతావరణంలో వివిధ శాఖల పనితీరు వరకూ మనిషి కంట్రోల్ లో లేని విషయాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. వాటన్నిటి క్రమబద్ధమైన నిర్వహణ, వాటి సమతూల్యత కాపాడబడటం వరకూ మనిషి కంట్రోల్ లో లేని అంశాలే.  
        మనిషి తన మేధను ఉపయోగించి సృష్టిని పరిశీలించి ఆ పరిశీలకు సైన్స్ అని పేరు పెట్టి... ఆ సృష్టిలో లభించే ఖనిజాలు, రసాయనాలు, వివిధ లోహాలూ, మూలకాలూ, ద్రావకాలు, ముడి చమురు, ముడి పదార్థాలు వగైరా వాటిని కనిపెట్టి అతని ఆధునిక జీవనశైలి కోసం, సులభతరమైన మరియు వేగవంతమైన జీవనం కోసం సృష్టించుకుంటున్న వస్తువులూ, వసతుల వరకూ అతని స్వంత “మేధ (Intelligence)” పనిచేస్తే...  అతని పరిధి (Control) లో లేకుండా ఎంతో క్రమబద్ధంగా నిర్వహించబడుతున్న సమస్త విశ్వ వ్యవస్థ తాలూకు "టెక్నాలజీ" వెనుక ఒక “మానవాతీత మేధ (Supernatural Intelligence)” అనేది ఒకటి నిత్యం పనిచేస్తూ ఉంది. తనకున్న పరిమిత స్థాయి జ్ఞానంతో ఎవరైనా.. అబ్బే! ఏ మేధాశక్తీ లేదంటే దానిని మూర్ఖత్వం అన్న పదం వాడటం కూడా చిన్నదైపోతుంది. 
     పరిశీలనగా ఆలోచించగలిగే మనిషి తనపై రెండు “మేధ”లు పనిచేస్తున్నాయని ఇట్టే కనిపెట్టగలదు. ఒకటి అతని “స్వతః మేధ” అయితే... రెండవది తనకు అతీతమైన మరొక “మానవాతీత మేధ” ద్వారా నిత్యం తాను ఆపరేట్ చెయ్యబడుతున్న విషయాన్ని కనిపెట్టగలడు.  మనిషి తన పరిధిలో ఉన్న జ్ఞానంతో తన “స్వతః మేధ” తో జీవితంలో ఎన్నో విషయాలను నిర్వహిస్తూ ఉంటే... తనకు “అతీతంగా ఉన్న మేధ” సమస్త విశ్వాన్ని వెంట్రుకవాసి తేడా లేకుండా ఎంతో క్రమబద్ధంగా నిర్వహిస్తుంది నియంత్రిస్తుంది. 
    ఇలా హేతుబద్ధంగా మాట్లాడటాన్ని బ్రెయిన్ వాషింగో.. గుడ్డి నమ్మకమో.. సూడో సైన్స్ అనో అనుకునే అపర మేధావులు స్వతహాగా తాము వాడే వస్తువులు, పరికరాలు, వసతుల తాలూకు టెక్నాలజీ వెనుక సైంటిస్టుల తాలూకు “మేధ” ఉందంటే నమ్ముతారు తప్ప... అసమానమైన గొప్ప టెక్నాలజీతో పటిష్ట క్రమబద్ధతతో నడుపబడుతున్న విశ్వవ్యవస్థ వెనుక ఏ మేధాస్సూ లేదని నమ్మటమే వారి దృష్టిలో మహాజ్ఞానం అన్నమాట!  కానీ ఏ కాస్త ఆలోచన ఉన్నవారైనా విశ్వవ్యావస్థ “యాక్సిడెంటల్”గా ఉనికిలోకి రాలేదు... కానీ...  “ఇంటెన్షనల్” గా ఉనికిలోకి వచ్చిందన్న విషయాన్ని కనిపెట్టగలుగుతారు.    
     కానీ, దానికి బుద్ధీ, జ్ఞానాలు అవసరమవుతాయి. 

Md Nooruddin

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter