రంజాన్ – ఖురాన్ అవతరించిన మాసం మరియు దాని అసలు మహిమ.

రంజాన్ – ఖురాన్ అవతరించిన మాసం మరియు దాని అసలు మహిమ.

ఇస్లాం ధర్మంలో రంజాన్ అత్యంత పవిత్రమైన మరియు  ఒక విధంగా వరాల మాసం. రంజాన్ మాసం అనగానే మనకు ముందుగా ఉపవాసం గుర్తుకు వస్తుంది. నిజంగా ఉపవాసం ఈ మాసపు ప్రధాన ఆరాధన కూడానూ. అయితే రంజాన్ యొక్క అసలు మహిమ,  ఉపవాసానికి మాత్రమే  పరిమితం కాకుండా; అది ఖుర్ఆన్ అవతరించిన మాసం అవడంలో కూడా ఉంది. ఓవైపు నుండి ఉపవాసం మన శరీరాన్ని చెడు కార్యాల నుండి నియంత్రిస్తుంది. ఇంకా ఖుర్ఆన్ మన హృదయాన్ని  శుద్ధపరుస్తుంది. ఒకవైపు ‌ఉపవాసం మనలో తక్వాను పెంచుతూనే, మరోవైపు ఖురాన్ ద్వారా మన జీవితాలకి స్పష్టమైన దిశను  పొందే మద్దతు దక్కుతుంది.

రంజాన్ , ఖురాన్ ల మధ్య విడదీయలేని బంధం.

ప్రవక్త ముహమ్మద్ గురించి ఇబ్ను అబ్బాస్ (రదియల్లాహు అన్హుమా) ఇలా పేర్కొన్నారు: 

ప్రవక్త గారు అత్యంత ఉదారులు. రంజాన్‌ లో జిబ్రీల్ (అలైహిస్సలాం) ఆయనను కలిసే సమయంలో, ఆయన మరింత ఉదారులు అయ్యేవారు. రంజాన్ ప్రతి రాత్రి జిబ్రీల్ వచ్చి ఆయనతో ఖుర్ఆన్ పునర్విమర్శ చేసేవారు. (సహీహ్ బుఖారీ)

 ఈ హదీస్ మనకు రంజాన్ మరియు ఖుర్ఆన్ మధ్య ఉన్న గాఢమైన సంబంధాన్ని తెలియజేస్తుంది. ప్రవక్త స్వయంగా రంజాన్‌లో ఖుర్ఆన్‌ను పునర్విమర్శ చేసేవారు. ఇది మనకు స్పష్టమైన సందేశం . ఇక రంజాన్ అనేది ఖురాన్‌తో, మన బంధాన్ని మనం బలపరచుకునే సమయం.

ఖురాన్ అవతరించిన మాసం.

అల్లాహ్ తఆలా ఖుర్ఆన్‌లో ఇలా ప్రకటిస్తున్నారు: 

"شَهْرُ رَمَضَانَ الَّذِي أُنزِلَ فِيهِ الْقُرْآنُ هُدًى لِّلنَّاسِ وَبَيِّنَاتٍ مِّنَ الْهُدَىٰ وَالْفُرْقَانِ ۚ فَمَن شَهِدَ مِنكُمُ الشَّهْرَ فَلْيَصُمْهُ ۖ وَمَن كَانَ مَرِيضًا أَوْ عَلَىٰ سَفَرٍ فَعِدَّةٌ مِّنْ أَيَّامٍ أُخَرَ ۗ يُرِيدُ اللَّـهُ بِكُمُ الْيُسْرَ وَلَا يُرِيدُ بِكُمُ الْعُسْرَ وَلِتُكْمِلُوا الْعِدَّةَ وَلِتُكَبِّرُوا اللَّـهَ عَلَىٰ مَا هَدَاكُمْ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ"(سورة البقرة:185)

“రంజాన్‌ నెల! అందులో దివ్య ఖురాన్‌ మానవులకు మార్గదర్శకత్వంగా, అవతరింప జేయబడింది! 132 మరియు అందులో సన్మార్గం చూపే మరియు సత్యా-సత్యాలను వేర్పరచే, స్పష్టమైన ఉపదేశాలున్నాయి. కావున మీలో ఆ నెలను పొందిన వ్యక్తి ఆ నెలంతా (విధిగా) ఉపవాస ముండాలి. కాని వ్యాధిగ్రస్తుడైనవాడు, లేక ప్రయా ణంలో ఉన్నవాడు, (ఆ ఉపవాసాలను) వేరే దినా లలో పూర్తిచేయాలి. అల్లాహ్‌ మీకు సౌలభ్యం చేయగోరుతున్నాడే కానీ, మిమ్మల్ని కష్టపెట్ట దలచుకోలేదు. ఇది మీరు ఉపవాసదినాల సంఖ్యను పూర్తిచేయగలగటానికి మరియు మీకు సన్మార్గం చూపినందుకు, మీరు అల్లాహ్‌ మహ నీయతను (ఘనతను) కొనియాడటానికి మరియు మీరు కృతజ్ఞతలు తెలుపుకోవటానికి”!

(సూరహ్ అల్-బఖరా :185)

 ఈ ఆయత్ రంజాన్ యొక్క గొప్పతనాన్ని, మూల  ఉద్దేశాన్ని తెలియజేస్తుంది. ఖురాన్ అవతరణ వల్లే ఈ మాసం ఇంతటి మహోన్నత విశిష్టతను పొందింది. ఖురాన్ కేవలం ఒక గ్రంథం కాదు; అది అల్లాహ్ నుండి వచ్చిన మార్గదర్శకత్వం. మానవ జీవితంలోని ప్రతి అంశానికి దారి చూపే సంపూర్ణ పుస్తకం.

అందువల్ల రంజాన్‌లో ఖురాన్‌ను ఎక్కువగా చదవడం, వినడం, దాని ఆదేశం మేరకు  ఆలోచించడం అత్యంత అవసరం. ఇది కేవలం ఆచారం కాదు , అది మన పెద్ద కర్తవ్యం.

ఖురాన్ ఒక మార్గదర్శకత్వం, కాంతి, మరియు చికిత్స కూడా‌.

అల్లాహ్ తఆలా దివ్య గ్రంథమైన ఖురాన్ లో ఇలా తెలిపారు: “ఓ మానవులారా! వాస్తవంగా మీ ప్రభువు తరఫునుండి మీవద్దకు హితోపదేశం (ఈ ఖుర్ఆన్‌) వచ్చింది మరియు ఇది మీ హృదయాల (రోగాల)కు స్వస్థతనిస్తుంది. మరియు విశ్వసించిన వారికి మార్గదర్శకత్వం మరియు కారుణ్యం (ప్రసాదిస్తుంది)”.

 (సూరహ్ యూనుస్ 10:57)

ఈ ఖురాన్ శ్లోకం దాని గురించిన మూడు ముఖ్య లక్షణాలను తెలియజేస్తుంది:

  1. ఉపదేశంసత్యం మరియు అసత్యం మధ్య తేడా తెలియజేస్తుంది.
  2. చికిత్ససందేహం, భయం, నిరాశ, అహంకారం వంటి హృదయ వ్యాధులకు నివారణ.
  3. మార్గదర్శకత్వంజీవనంలోని ప్రతి దశలో సరైన దారిని చూపిస్తుంది.

మరొక చోట అల్లాహ్ తఆలా ఇలా పేర్కొన్నారు:
إِنَّ هَـٰذَا الْقُرْآنَ يَهْدِي لِلَّتِي هِيَ أَقْوَمُ وَيُبَشِّرُ الْمُؤْمِنِينَ الَّذِين يَعْمَلُونَ الصَّالِحَاتِ أَنَّ لَهُمْ أَجْرًا كَبِيرًا.)٩

“నిశ్చయంగా, ఈ ఖుర్‌ఆన్‌ పూర్తిగా, సరి అయిన (సవ్యమైన) మార్గంవైపునకు మార్గ దర్శకత్వం చేస్తుంది. మరియు సత్కార్యాలు చేస్తూ ఉండే విశ్వాసులకు తప్పక గొప్ప ప్రతిఫల ముందని శుభ వార్తనూ అందజేస్తుంది”!. (సూరహ్ అల్-ఇస్రా 17:9) 

ప్రపంచంలో ఎన్నో సిద్ధాంతాలు, అభిప్రాయాలు ఉన్నప్పటికీ — ఖుర్ఆన్ చూపించిన దారి మాత్రమే శాశ్వతమైనది మరియు సురక్షితమైనది.

కేవలం పారాయణం కాదు, ఆచరణ చాలా అవసరం.

రంజాన్‌లో చాలామంది ఖురాన్‌ను ఎక్కువగా చదువుతారు. ఇది మహత్తరమైన కార్యం. ప్రవక్త   గారు ఇలా  ఉపదేశించారు:ఎవరైనా అల్లాహ్ గ్రంథం నుండి ఒక అక్షరాన్ని చదివితే, అతనికి ఒక సత్కార్యపు ఫలం లభిస్తుంది; ఇంకా ప్రతి సత్కార్యం పది రెట్లు పెరుగుతుంది”. (తిర్మిజీ) 

ఇది ఖురాన్ పారాయణం యొక్క గొప్ప ప్రతిఫలాన్ని తెలియజేస్తుంది. అయితే ఖురాన్‌ను కేవలం చదవడం సరిపోదు. అల్లాహ్ ప్రశ్నిస్తున్నాడు:

                  ( أَفَلَا يَتَدَبَّرُونَ الْقُرْآنَ أَمْ عَلَىٰ قُلُوبٍ أَقْفَالُهَا ٢٤)

“వారు ఈ ఖుర్‌ఆన్‌ను గురించి యోచించరా? లేదా వారి హృదయాల మీద తాళాలు పడివున్నాయా?” (సూరహ్ ముహమ్మద్ 47:24)

 మన జీవితంలో ఖురాన్  తప్పక ప్రభావం చూపి తీరాలి. మన మాటల్లో, ప్రవర్తనలో, కుటుంబ జీవితంలో, వ్యాపార వ్యవహారాల్లో ఖుర్ఆన్ బోధనలు కనిపించాలి. అప్పుడే అందరూ, అసలైన ముస్లిం గా పరిగణించబడతారు.

ఆయిషా (రదియల్లాహు అన్హా) ప్రవక్త గారి గురించి ఇలా  తెలిపారు :”ఆయన పూర్తి స్వభావం ఖురాన్ తో నిండి ఉంది. అంటే ప్రవక్త గారి పవిత్ర జీవితం ఖురాన్ ఆచరణకు ఉత్తమ ఉదాహరణ. మనం కూడా అదే దిశగా ప్రయత్నించాలి.

రంజాన్ – ఖురాన్‌తో పునఃసంబంధం ఏర్పరచుకునే సమయం

రంజాన్‌ మాసంలో మానవుల హృదయాలు మృదువుగా  మారిపోతాయి. తద్వారా పాపాలకు దూరమవ్వడం సులభమవుతుంది. ఈ పవిత్ర వాతావరణంలో మనం ఖుర్ఆన్‌తో మన సంబంధాన్ని పునరుద్ధరించారు కోవడం చాలా ఉత్తమం.

ఈ నెలలో మనం కొన్ని స్పష్టమైన లక్ష్యాలు పెట్టుకొని తీరాలి. ఉదాహరణకు:

  • ప్రతిరోజూ ఖుర్ఆన్ చదవడానికి నిర్దిష్ట సమయం కేటాయించడం
  • అనువాదం మరియు తఫ్సీర్ చదవడం
  • కొన్ని ఆయాత్‌లను కంఠస్థం చేసుకోవడం
  • కుటుంబ సభ్యులతో కలిసి ఖురాన్ అధ్యయనం చేయడం
  • ఖురాన్ బోధనలను ఆచరణలో పెట్టడం

ఇలా చేసినప్పుడు ఖుర్ఆన్ మన జీవితంలో సజీవమైన మార్గదర్శకంగా మారుతుంది.

ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఖురాన్ కోసం  ఒక అద్భుతమైన మరియు శ్రేష్ఠమైన దుఆ ఒకటి సెలవిచ్చారు:

اللَّهُمَّ اجْعَلِ الْقُرْآنَ رَبِيعَ قَلْبِي، وَنُورَ صَدْرِي، وَجَلَاءَ حُزْنِي، وَذَهَابَ هَمِّي

దీని అర్థం:
ఓ అల్లాహ్! ఖురాన్‌ను నా హృదయానికి వసంతకాలంలా చేయి; నా ఛాతీకి వెలుగుగా చేయి; నా దుఃఖాన్ని తొలగించు; నా ఆందోళనను దూరం చేయి”.(ముస్నద్ అహ్మద్)

ఈ దుఆ మన హృదయాల్లో ఖురాన్ స్థానం ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. దీనితో దివ్య ఖురాన్ మన జీవితాల్లో ఆనందాన్ని, శాంతిని, స్పష్టతను  నింపుతుంది.

ఇక ఆఖరిగా, రంజాన్ ఉపవాస మాసమే  కాదు,ఖురాన్ మాసం కూడానూ. ఈ మాసంలో  ఉపవాసం మన శరీరాన్ని చెడు కార్యాల నుండి నియంత్రిస్తూనే, ఇంకా ఖురాన్ మరోవైపు నుండి మన హృదయాన్ని  శుద్ధపరుస్తుంది. రంజాన్‌ మాసంలో,  ఖురాన్‌తో మన బంధాన్ని బలపరచకపోతే, మనం ఈ మాసపు గొప్ప వరాన్ని కోల్పోయినట్లే.ఈ రంజాన్ మన జీవితంలో ఒక పెద్ద మలుపు కావాలి. ఖురాన్‌ను కేవలం చదివే గ్రంథంగా కాకుండా, జీవించే మార్గదర్శకంగా స్వీకరించాలి. మన ఇళ్లలో ఖుర్ఆన్ ధ్వని వినిపించాలి. మన హృదయాల్లో దాని వెలుగు ప్రకాశించాలి.అల్లాహ్ తఆలా దివ్య ఖురాన్‌ను మన హృదయాల వెలుగుగా చేసి, మన జీవితాలకు మార్గదర్శకంగా చేయుగాక! ఆమీన్!

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter