హజ్జ్ విధిత్వము మరియు ప్రాధాన్యత  మొదటి భాగం

హజ్ – ఇస్లాం మౌలికాంశాలలో ఒకటి. 

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా సెలవిచ్చారు: 

“ఇస్లాం ధర్మం ఐదు మౌలికాంశాలపై ఆధారపడి వుంది. అల్లాహ్ తప్ప మరో నిజమైన ఆరాధ్యడు ఎవ్వరూ లేరు మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఆయన దాసులు మరియు ప్రవక్త అని సాక్ష్యమివ్వడం, నమాజు నెలకొల్పడం, జకాత్ చెల్లించడం, బైతుల్లాహ్ హజ్ చేయడం మరియు రమజాన్ మాసపు ఉపవాసాలు పాటించడం”. (బుఖారీ, ముస్లిం) 

పూర్తి జీవితంలో, స్థోమత కల పురుషులకు, స్త్రీలకు కనీసం ఒక్క సారి హజ్ చేయడం విధిగా వుంది. 

అబూ హురైరా (రదియల్లాహు అన్హు) కథనం ప్రకారం దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మాకు సంబోధిస్తూ ఇలా సెలవిచ్చారు: 

“ప్రజలారా! మీ కోసం హజ్ విధిగా చేయబడింది. కనుక మీరు హజ్ చేయండి”. ఇది విని, ఒక వ్యక్తి- ఓ దైవ ప్రవక్తా! ప్రతి సంవత్సరం ఇది విధిగా వుందా? అని అడిగాడు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మౌనంగా వుండి పోయారు. అతను మూడుసార్లు ఇలానే ప్రశ్నించాడు. దీనిపై దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) జవాబిస్తూ – ఒకవేళ నేను అవునని అని వుంటే, అప్పుడు మీకు ప్రతి యేడూ తప్పనిసరి అయిపోయేది. ఒకవేళ ఇలా జరిగితే మీరు దానిని నెరవేర్చే శక్తి కలిగి వుండేవారు కాదు”. (ముస్లిం: 1337) 

హజ్ విధిత్వానికి గల షరతులు 

హజ్ ఫర్జ్ కావడానికి ఐదు షరతులున్నాయి. 

1) ఇస్లాం: అంటే, హజ్ కేవలం ముస్లిములపై విధిగా వుంది. కాఫిర్ల పై విధిగా లేదు. ఒకవేళ కాఫిర్ (తిరస్కారి) ఎవరైనా హజ్ చేసినా సరిపోదు (అంటే స్వీకరించబడుదు). ఎందుకంటే, అతను హజ్ కు ముందు (ఇస్లాం స్వీకరించి) ముస్లిం కావడం తప్పనిసరి. కనుక ఇస్లాం స్వీకరించాక అతను ఆర్థిక స్థోమత కలిగి వుంటే అప్పుడు అతనిపై హజ్ ఫర్జ్ అవుతుంది. 

దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ముఆజ్ (రదియల్లాహు అన్హు) కు యమన్ వైపునకు పంపిస్తూ ఇలా హితబోధ చేసారు: “నువ్వు గ్రంథ ప్రజలు గల ప్రాంతానికి వెళుతున్నావు. అందుకే (అన్నిటికన్నా ముందుగా) వారికి లా ఇలాహ ఇల్లల్లాహ్, ముహమ్మదుర్రసూలుల్లాహ్ సాక్ష్యం వైపునకు ఆహ్వానించు. ఒకవేళ వారు నీ మాటను ఒప్పుకుంటే, వారికి అల్లాహ్ రేయింబవళ్ళలో ఐదు నమాజులు ఫర్జ్ చేసాడని చెప్పు…..” (బుఖారీ: 1496, ముస్లిం: 19) 

ఈ హదీసు ద్వారా తెలిసిందేమిటంటే, అన్నిటి కన్నా ముందుగా ఇస్లాం స్వీకరణ తప్పనిసరి. దాని తర్వాతే ఇతర ఆదేశాలు వర్తిస్తాయి. 

2) బుద్ధి: అంటే హజ్, బుద్ధి వివేకాలు కలవారిపైనే ఫర్జ్ వుంది. బుద్ధి మందగించిన పిచ్చి వాళ్ళపై లేదు. పిచ్చివాళ్ళ గురించి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) (కర్మలు వ్రాసే) కలాలు లేపేయబడ్డాయి (వారి కర్మలు వ్రాయబడవు) అని వివరించారు. 

3) యుక్త వయస్సు: హజ్ విధిగా కావటానికి యౌవనం కూడా ఒక షరతే. ఎందుకంటే, చిన్న పిల్లలు దానికి బాధ్యులు కారు. కానీ చిన్న పిల్లలు హజ్ చేయవచ్చు. 

దీని గురించి, ఇబ్న్ అబ్బాస్ (రదియల్లాహు అన్హు) ఇలా సెలవిచ్చారు: ఒక స్త్రీ తన పిల్లవాణ్ణి ఎత్తి చూపిస్తూ, ఓ దైవ ప్రవక్తా! ఇతను హజ్ చేయవచ్చా? అని అడిగింది. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) జవాబిస్తూ – చేయవచ్చు. (అతనితో పాటు) నీక్కూడా పుణ్యం దొరుకుతుంది అని అన్నారు”. (ముస్లిం: 1336) 

కానీ ఈ హజ్, ఫర్జ్ హజ్ కు సరిపోదు, ఆ పిల్లవాడు యౌవన దశకు చేరుకున్న తర్వాత, ఒకవేళ ఆర్థిక స్థోమత గనక కలిగి వుంటే విధిగా వున్న హజ్ ను మరలా చేయాలి.

(4) స్వేచ్ఛత: అంటే హజ్ కేవలం స్వతంత్య్ర ముస్లిములపై విధిగా వుంది. బానిస ముస్లిములపై కాదు. బానిస ముస్లిం హజ్ చేయవచ్చు. కానీ ఆ హజ్, ఫర్జ్ హజ్ కు సరిపోదు. అతను స్వతంత్రుడయ్యాక, ఒకవేళ ఆర్థిక స్థోమత గనక కలిగివుంటే విధిగా వున్న హజ్ ను మరలా చేయాలి. 

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter