భళా ఇంటర్నెట్
అంతర్జాలం పరిపాలిస్తున్న ఈ లోకంలో నీతికి నిజాయితీకి విలువలు లేకుండా రోజులు గడుస్తున్నాయి. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ఘటనలు చూస్తుంటే మనిషిపై నమ్మకం భరోసా అనేవి అదృశ్యం అవుతున్నాయి. ఎందుకంటే సామాజిక మాధ్యమాల్లో ఒకరు వేరే ప్రపంచం నుంచి ఇతర ప్రపంచంలో వేరే వాళ్లను సంభాషించడం, చాట్ చేయడం, కామెంట్ చేయడం మొదలగు చర్యలు జరుగుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో పురుషులు మగతనం అనే దుస్తులు తొడుగుతున్నారు. స్త్రీలు పతివ్రతల దుస్తులు తొడుగుతున్నారు. అందరూ తమని తాము గొప్ప ప్రతివ్రతలుగా, మహానుభావులుగా పేర్కొంటున్నారు. ప్రతి ఒక్క పురుషుడు ప్రతి ఒక్క స్త్రీ సామాజిక మాధ్యమాల్లో తమని తాము వర్ణించుకోలేని విధంగా వర్ణించుకుంటున్నారు. ఇక్కడ ఇదే చిక్కు వచ్చి పడుతుంది. ప్రతి ఒక్కరూ ఇక్కడ మంచోళ్లే, ప్రతి ఒక్కరూ సంప్రదాయంగానే నడుచుకుంటారు, ప్రతి ఒక్కరూ తెలివైన వారే, ప్రతి ఒక్కరూ అందమైన వారే, ప్రతి ఒక్కరూ బలవంతులే, ప్రతి ఒక్కరూ ధైర్యవంతులు. అందరూ ప్రజాస్వామ్యాన్ని ప్రకటించేవారే.
కానీ వాళ్లు తొడుగుకున్న దుస్తుల లోపల వారి అసలైన రూపం ఇలా ఉండదు. వారు పిరికివారై ఉంటారు. ఇందుకు అనుకూలంగా వేమన
మేడి పండు చూడ మేలిమై యుండు
పొట్ట విప్పి చూడ పురుగులుండు
పిఱికివాని మదిని బింకమీలాగురా
విశ్వదాభిరామ వినురవేమ.
అర్థము:
మేడి పండు పైకి చక్కగా కనిపించినప్పుడు దానిలో పురుగులుండే అవకాశం ఉంది.
అలాగే పిరికివాడు పైకి బింకం ప్రదర్శించాడు. అతని మనసులో భయం ఉంటుంది.
ఇదే అంతర్జాల విశ్వంలో ప్రతి ఒక్కరు ఐశ్వర్యాలతో జీవిస్తున్నట్టు చెప్పుకుంటారు. ప్రతి ఒక్కడు బంగారం ధరించినట్లు, ప్రతి ఒక్కడు ఒక రొమాంటిక్ వ్యక్తిలాగా ప్రవర్తిస్తాడు. ఎవరికి వయస్సు ఎక్కువ ఉండదు. ఎవరు చిన్నలు కారు ఎవరూ పెద్దలు కారు. తమకు తగ్గట్టుగా తాము చెప్పుకుంటూ ఉంటారు.
కానీ అసలైన విశ్వరూపం ఎవరు చూసినా చూడకపోయినా అల్లాహ్ అందరిని చూస్తూ ఉంటాడు. ప్రతి సమయంలో ప్రతి చోటలో ప్రతి దేశంలో ప్రతి మూలలో అందరిని గ్రహిస్తూ ఉంటాడు. చీకటి కమ్ముకున్న రాత్రిలో నల్లటి కొండపైన నడిచే నల్లటి చీమ యొక్క అడుగు శబ్దం కూడా వినగలిగే అల్లాహ్ సుబహానహు వతఆలా, అంతటి మహానుభావుడు మనం చేసే ఈ చిన్న చిన్న అశ్లీల పనులను కూడా చూస్తూ ఉంటాడు. దాని లెక్క తేలుస్తాడు. అందరిని అడుగుతాడు. మొత్తం విశ్వం చూస్తుండగా, మహ్షర్ రోజున సభలో అందరి ముందు ప్రతి ఒక్కరిని తను చేసిన అతి చిన్న చర్య ఆచరణల గురించి ఒక్కొక్క ప్రశ్న అడిగి తన విషయం అక్కడ నిర్ణయిస్తాడు.
పవిత్ర ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుభహానాహు వతఆలా సూర జల్'జాల్ లో ఈ విధంగా ప్రస్తావించాడు
زُلْزِلَتِ الْأَرْضُ زِلْزَالَهَا ١
భూమి తన అతి తీవ్రమైన (అంతిమ) భూకంపంతో కంపింపజేయబడినప్పుడు! 1
وَأَخْرَجَتِ الْأَرْضُ أَثْقَالَهَا ٢
మరియు భూమి తన భారాన్నంతా తీసి బయట పడవేసినప్పుడు! 2
وَقَالَ الْإِنسَانُ مَا لَهَا ٣
మరియు మానవుడు: "దీనికి ఏమైంది?" అని అన్నప్పుడు.
يَوْمَئِذٍ تُحَدِّثُ أَخْبَارَهَا ٤
ఆ రోజు అది తన సమాచారాలను వివరిస్తుంది. 3
بِأَنَّ رَبَّكَ أَوْحَىٰ لَهَا ٥
ఎందుకంటే, నీ ప్రభువు దానిని ఆదేశించి ఉంటాడు.
يَوْمَئِذٍ يَصْدُرُ النَّاسُ أَشْتَاتًا لِّيُرَوْا أَعْمَالَهُمْ ٦
ఆ రోజు ప్రజలు తమతమ కర్మలు చూపించ బడటానికి వేర్వేరు గుంపులలో వెళ్తారు.
فَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ خَيْرًا يَرَهُ ٧
అప్పుడు, ప్రతివాడు తాను, రవ్వంత (పరమాణువంత) మంచిని చేసిఉన్నా, దానిని చూసుకుంటాడు.
وَمَن يَعْمَلْ مِثْقَالَ ذَرَّةٍ شَرًّا يَرَهُ ٨
మరియు అలాగే, ప్రతివాడు తాను రవ్వంత (పరమాణువంత) చెడును చేసిఉన్నా, దానిని చూసుకుంటాడు.
అందుకని సామాజిక మాధ్యమాలలో వచ్చిన మంచి మరియు ఉపయోగకరమైన వాటిని సద్వినియోగం చేసుకుంటూ మనిషికి మానవత్వానికి మారుపేరులా నిలబడి నిజాయితీని ప్రదర్శించి ఇతరులకు సహకరించేలా సహాయపడేలా వినియోగించాలి.