పరమ సద్గుణీయులైన ముహమ్మద్ (ﷺ)

        సద్గుణాలు అనేవి ప్రతిమానవునిలో ఇమిడి ఉంటాయి. కానీ ఒక మనిషి జీవితాంతం సద్గుణాలలో ప్రయాణించడం అనేది జరగని పని.  అది ప్రకృతి సహజం. తప్పొప్పులను ఎంచుకోవడం అనేది, మానవుల స్వేచ్ఛకై వదిలేయబడినది. అలాగని, జీవితం మొత్తం తప్పుడు మార్గంలో నడిచి తమనుతాము మోసం చేసుకోవడం పెద్ద మూర్ఖత్వం. అటువంటి మూర్ఖత్వాన్ని తొలగించేందుకై, అల్లాహ్ తఆలా నింగి నేలను సృష్టించినప్పటి నుండే భువిలోకి, దాదాపుగా ఒక లక్ష 24 వేల మంది ప్రవక్తలను ప్రజల సన్మార్గం కొరకై పంపారు. ఆ ప్రవక్తలు చేసిన త్యాగాలు, వారు చేసిన వలస ప్రయాణాలు, సమాజం కొరకై వారు చేసిన కృషి ఇలా ఇవన్నీ రాస్తూ పోతే కోకొల్లలే.

ఆ గొప్ప ప్రవక్తలలోకల్లా మహనీయులు, మన ప్రియ ప్రవక్త మహమ్మద్  సల్లల్లాహు అలైహి వసల్లం గారు. హుజూర్ (స) గారు. ప్రజల కోసం ఏకంగా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పణంగా పెట్టారు.వీటి గురించి ఒకసారి పురాణాలు గనుక తిరిగేసి చూస్తే, హుజూర్ (స) గారు ప్రజల కోసం చేసిన త్యాగాలు, వారు పడ్డ కష్టం, బాధ, ఆవేదన, కృషి మొదలగువన్నీ ప్రతి ఒక్కరికి బాగా అర్థమవుతాయి.

వాటి నుండి కొన్ని  చక్కటి  ఉదాహరణలు:

ఇస్లాం మెల్లమెల్లగా విస్తరిస్తున్న కాలంలో అవిశ్వాసులు చాలా మండిపోతుండేవారు. ఇందుచేత ముస్లింలతో ఉన్నసంబంధాలన్నీతెగదెంపులుచేసుకున్నారు. అప్పటినుంచి మక్కాఅవిశ్వాసులు 'బనూహాషిమ్'  వంశపువారితో కలిసి ఉండడం, వారికి ఏవైనా అమ్మడం లేదా వారి నుండి ఏవైనా కొనడం అంటూ ఏమీ జరిగేవి కాదు. ఆఖరికి ఇది ఇలా ఉండగా, వారి వద్ద తినడానికి తిండిలేక, త్రాగడానికి నీరులేని పరిస్థితిని ఎదుర్కొనవలసివచ్చింది.  దేని కోసం ఇదంతా? కేవలం అల్లాహ్ ను రాజీపరచేందుకు మరియు లోకంలో ఇస్లాం విస్తరణ కొరకు మాత్రమే.

ఒకవేళ హుజూర్ (స) గారు ఆనాడు వెనకడుగువేసి ఖురైషీయులతో కలిసిపోయి ఉంటే, మనం ఈనాడు ఇలా ముస్లింలమై ఉండేవాళ్లం కాదు. కానీ హుజూర్ (స)గారు అలా ఎప్పటికీ చేయలేదు, ఎప్పటికీ చేయరుకూడా. ఎందుకంటే, హుజూర్ (స) గారికి అల్లాహ్ పై విశ్వాసం, భరోసా, నమ్మకం అంత బలంగా ఉండేది కనుక.

ఆ పట్టుదలతోనే ఎంతమంది తమకు విరుద్ధంగా ఉన్నా ఎట్టిపరిస్థితులలోనూ వెనక్కితగ్గేదే లేదంటూ, వారందరినీ వదిలి నేరుగా, 'షీబ్బిన్అబీతాలిబ్' అనే వాగులో దాదాపు మూడు సంవత్సరాల వరకు ఆకులు అలమలు తింటూ,  ఎంతో సహనంగా  జీవించారు. ఆ కాలంలో వారిని అల్లార ముద్దుగా పెంచిన వారి బాబాయి, 'హజరత్ అబూతాలిబ్' (ర) గారి మరణం కూడా సంభవించింది.

హుజూర్ (స) గారి కష్టాలు అంతటి తో ఆగిపోలేదు, ఒక వైపు మక్కావాసులు హింసిస్తున్నా, మరోవైపు తమ పని తాము చేస్తూ వెళ్లారు. ప్రజలను హక్కు వైపునకు పిలుస్తూ గడిపారు. అక్కడి పరిస్థితి ఇలా ఉండగా, కొద్దిగా మనశ్శాంతి కూడా లేకపోయింది.

     కనుక, వారి మామ గారు నివాసం ఉంటున్న 'తాయుఫ్' నగరానికి బయలుదేరారు.

                 "నిస్సందేహంగా ఓర్పుగా ఉండే వారికి మేము, వారికి ప్రతిఫలంగా స్వర్గాన్ని ఎటువంటి పరీక్ష లేకుండా ప్రసాదిస్తాము!"

         ఈ శ్లోకాన్ని బట్టి మనం అర్థం చేసుకోవలసినది, కేవలం మన హుజూర్  (స) గారు పాటించిన సహనాన్ని మనమూ పాటించాలని. కానీ, ఆ సహనం అనే మాటే మరిచిపోతుంది నేటి సమాజం! అటువంటి సమాజాన్నిమెరుగుపరచేందుకై హుజూర్ (స) గారు కృషి చేశారు! ఆయన గారి పవిత్ర కష్టాన్ని మనం తీసిపారేయకుండా నిత్యం హుజూర్ (స) గారి సాంప్రదాయాన్ని, ఓర్పును  పాటిస్తూ గడపాల్సిన బాధ్యత మనది!

ఇంకా దీని గురించి ఒక హదీసు కూడా ఇలా ఉంది:
హజరత్ అబీ యహ్యా సుహైబ్ బిన్ సినాన (ర) గారి కథనం మేరకు హుజూర్ (స) గారు ఇలా సెలవిచ్చారు:

                 "ఒక విశ్వాసి యొక్క ప్రతి విషయం అతని కొరకు మంచిది అని అనడంలో విడ్డూరం ఏమీ లేదు. ఇది కేవలం విశ్వాసులు  (ముస్లింల)కు తప్ప, వేరే ఎవరికీ సొంతం అవ్వదు! ఎందుకంటే, ఒక విశ్వాసికి సంతోషం కలిగితే, అతను వెంటనే దానికి కృతజ్ఞతుడవుతాడు. అది అతని కొరకు చాలా మంచి విషయం. ఒకవేళ అతనికి కష్టం వచ్చినా దాని పట్ల సహనం వహిస్తాడు మరియు అదే అతని కొరకు చాలా మంచిది."

      కనుక,ఆఖరిలో ఒక చిన్న మాట, హుజూర్ (స) గారి విశ్వాసం, వారి బాధ్యత పట్ల గట్టి పట్టుదల, ఎవరికి కీడుతలపెట్టని ఆయన మనస్తత్వం, ఆఖరికి వారి ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా, వారి ప్రాణ  త్యాగానికి సైతం వెనుకాడకుండా చేసే ప్రయత్నం, ఇలా ఇవన్నీ, ఈ ఒక్క సంఘటన ద్వారా మనం గమనించ దగ్గ విషయం. ఏ మనిషికైనా విషయంపై ఏకాగ్రత,పట్టుదల, ఓర్పు అనేవి తప్పనిసరిగా ఉండవలసిన అంశాలు.

          ఆ అల్లాహ్ తఆలా, మనకు వారి ఆదేశాలను మరియు వారి ప్రవక్త ఆదేశాలను తూ.చా. చెప్పకుండా అమలుపరిచే భాగ్యాన్ని ప్రసాదించుగాక! ఆమీన్!

 

 

 

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter