ఖురాన్ పారాయణం మాధుర్యత
ప్రపంచంలో ప్రతి మనిషికి తన మతం దేవుడిని వేడుకోవడానికి ప్రత్యేక మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకి తమ మతం యొక్క గ్రంథం, వారి మత సంస్కారాలు, పండుగ వేడుకలు మరియు పూజలు మొదలైనవి. అలాగే ఇస్లాం మతంలో ఉన్న వారి కోసం అనగా విశ్వాసుల కోసం అల్లాహ్ ని వేడుకోవడానికి మంచి మార్గదర్శి ఖురాన్. దీనిలో విశ్వాసులు తమ జీవితంలో చేయవలసినవి, చేయకూడనివి, ఇస్లాం సంస్కారాలు, ప్రత్యేకతలు మరియు ప్రాముఖ్యతలు అన్నీ ఉన్నాయి.
ఖురాన్ మన ప్రవక్తకు అల్లాహ్ నుంచి దొరికిన బహుమతి. ఖురాన్ తో సంబంధం అల్లాతో అనుబంధమని మనం నమ్మాలి. ఎందుకంటే మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ఇలా బోధించారు, నా సమాజానికి (ఉమ్మత్ కు) ఖురాన్ పారాయణం అత్యుత్తమమైన ఆరాధన.
మనం మన జీవితంలో ఎక్కువ సమయం ఖురాన్ పారాయణంలో కేటాయించాలి. ఖురాన్తో మనం ఎప్పుడు కూడా విసిగించుకోకూడదు. మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ఖురాన్ ను ప్రోత్సహిస్తూ ఇలా కూడా అన్నారు, ఖురాన్ ను ప్రతిరోజు పారాయాణం చేసే వ్యక్తి నాలుగు దిశల సువాసనలు వెదజల్లే వాడు అయి ఉంటాడు, మరియు ఖురాన్ నేర్చుకొని కూడా దాన్ని పారాయణం చేయని వ్యక్తి బిరడ బిగించిన సీసా లాంటివాడు.
ఖురాన్ పారాయణం కేవలం అల్లాహ్ కోసం మాత్రమే సంకల్పించాలి. దురుద్దేశాలు ఉండకూడదు ఉదాహరణకి ప్రజలు తమను గౌరవిస్తారని, తమకు ఇతరుల పట్ల మంచి పేరు ఉంటుందని, తమ జీవితాన్ని ఊరి వారికి తెలియజేయాలని ఇటువంటి ఉద్దేశాలు ఖురాన్ పారాయణం చేసే వారికి ఉండకూడదు.
ఖురాన్ పారాయణం చేసే ముందు పరిశుభ్రతను పవిత్రతను పూర్తిగా పాటించాలి. వజూ లేకుండా ఖురాన్ ను ముట్టరాదు. పరిశుభ్రమైన స్థలంలో కూర్చొని పవిత్ర గ్రంథాన్ని పారాయణం చేయాలి. పారాయణం చేసే సమయంలో కిబ్లా వైపు తిరిగి కూర్చోని, అత్యంత శ్రద్ధతో ఏకాగ్రతతో క్రమమైన పద్ధతిలో పారాయణం చేయడం అత్యత్తమం. మీ వద్దకు పంపించబడిన గ్రంథం శుభ ప్రధమయునది ప్రజలు దాని గురించి పరిశీలన చేయాలని మరియు దానిని పాటించి మంచి మార్గంలో రావాలని అల్లాహ్ ఆదేశించారు.
పారాయణ శాస్త్రం (తజ్విద్) క్రమ పద్ధతిని (తర్తీల్) కూడా సాధ్యమైనంత వరకు పాటించాలి. పదాలను చక్కగా పలకాలి నెమ్మదిగా ఆగుతూ చదవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం ప్రతి ఒక్క అక్షరాన్ని స్పష్టంగా పలుకుతూ, ఒక్కొక్క ఆయత్ను విడదీసి చదివేవారు. ప్రవక్త సల్లల్లాహు ఇలా అన్నారు, ఖురాన్ పారాయణం చేసే వారికి ప్రళయ దినం రోజు ఇలా ఆదేశించడం జరుగుతుంది. ఇహ లోకంలో నీవు ఎంత పద్ధతిగా ఎంత శుభ్రతగా ఎంత ఏకగ్రతగా ఖురాన్ చదివే వాడివో ఖురాన్ అలాగే చదువుతూ ఒక్కొక్క ఆయత్ పారాయణం లో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్ళు. నీవు పారాయణించిన తుది ఆయత్ వద్ద నీకు స్థానం ఉంది.
అవకాశం లభించినప్పుడు పారాయణం చేయాలి తహజ్జుద్ నమాజ్ లో ఎక్కువగా ఖురాన్ యొక్క పారాయణం చేయాలి ఇలా రాత్రులు ఖురాన్ పారాయణం చేయడం ఉత్తమమైన మార్గం. మూడు రోజులు కంటే తక్కువ సమయంలో ఖురాన్ మొత్తం పారాయణం చేయరాదు. ఎందుకంటే మన ప్రవక్త సల్లలాహు అలైహిస్సలు ఇలా అన్నారు, మూడు రోజులు కంటే తక్కువ సమయంలో ఖురాన్ పారాయణం చేసిన వారు అసలు ఖురాన్ అర్థం చేసుకోలేదన్నమాట.
గడగడా చదివేయకుండా భావర్థాన్ని తెలుసుకుంటూ చదవడం అలవాటు చేసుకోవాలి. అందులో ఆలోచన పరిశీలన చేయడానికి ప్రయత్నించాలి. మనం ఖురాన్ ఆదేశాల ప్రకారంగా మన జీవితాన్ని మార్చుకోవాలి. దీనికి కాంతితో జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. అందులో లభించే ఆజ్ఞనానుగుణంగా మన జీవితాన్ని మంచుకోవడానికి, నాటుపాట్లు దూరం చేసుకోవడానికి జీవితాన్ని మార్చుకోవడానికి నిరంతరం ప్రయత్నించాలి. ఖురాన్ పారాయణం చేయడం వల్ల మన జీవిత చెడు అలవాట్లను మానుకోవచ్చు. ఖురాన్ పారాయణం చేసిన తర్వాత దువా చేసుకోవాలి. అల్లాహ్ అందరికీ ఖురాన్ అర్ధాన్ని భావాన్ని తెలుసుకునే శక్తి ప్రసాదించుగాక. దాని అద్భుతాలను అందుకునే దృష్టిని సంప్రదించుగాక, నేను నా జీవితాన్ని ఎల్లప్పుడూ దీని ప్రకారం దీని మార్గంలో నడిపేటట్టు నాకు శక్తిని అనుగ్రహించుగాక. ఆమీన్.