ఇస్లాం ప్రకారం నిజమైన విజయం అంటే ఏమిటి

విజయం సాధించాలనే కోరిక ప్రతి మనిషిలో ఉంటుంది. కానీ విజయం అంటే ఏమిటి? అనే ప్రశ్నకు ప్రతి సమాజం, ప్రతి సంస్కృతి,అలాగే ప్రతి సిద్ధాంతం వేరే వేరే సమాధానాలు ఇస్తాయి. కానీ నేటి ప్రపంచంలో ఎక్కువగా డబ్బు, మంచి ఉద్యోగం, మరియు మంచి ఉన్నత విద్య, పేరు, అలాగే ప్రజల మధ్య గౌరవం, ఆస్తులు, ప్రజాదరణ వంటివాటినే విజయానికి గుర్తులుగా భావిస్తున్నారు. మనకు వచ్చే విజయాలు మనకు సౌకర్యం, అలాగే గౌరవం కూడా ఇవ్వవచ్చు. కానీ ఇస్లాంలో విజయం అంటే ఇవి మాత్రమే కాదు. ఇస్లాం విజయం గురించి మరింత గొప్పగా చెబుతుంది. మనం జీవితాన్ని కేవలం ఈ లోకం వరకే చూడకూడదు. ఈ లోకంతో పాటు ఆఖిరత్ (పరలోకం) గురించి కూడా ఆలోచించాలి.

ఇస్లాం ఈ లోకాన్ని పూర్తిగా వదిలేయమని ఎన్నడూ చెప్పలేదు. కానీ మన లక్ష్యం కేవలం ఈ లోకంలో విజయం సాధించడమే కాకూడదు. అల్లాహ్ కోసం సంతోషాన్ని పొందడం, మంచి జీవితాన్ని గడపడం, మరియు ఆఖిరత్‌లో విజయం సాధించడం కూడా మన ఖచ్చిత లక్ష్యాలై ఉండాలి.

ఖుర్ఆన్ ప్రకారం నిజమైన విజయం 

ఖుర్ఆన్‌లో నిజమైన విజయాన్ని చెప్పడానికి అల్లాహ్ తఆలా “అల్-ఫలాహ్ (الفلاح)” అనే పదాన్ని ఉపయోగించారు. దీని అర్థం కేవలం డబ్బు సంపాదించడం లేదా మంచి పేరు తెచ్చుకోవడం కాదు. నిజమైన విజయం అంటే అల్లాహ్ యొక్క సంతోషాన్ని పొందడం, ఆఖిరత్‌లో విజయం సాధించడం మరియు దున్యా, ఆఖిరత్ రెండింటిలోనూ మేలు పొందడం.

قَدْ أَفْلَحَ ٱلْمُؤْمِنُونَ 

"నిశ్చయంగా విశ్వాసులు విజయాన్ని పొందారు"

(సూరహ్ అల్-ముఅ్మినూన్, 23:1) 

ఈ ఆయత్ తర్వాత, నిజమైన విజయం పొందే విశ్వాసుల గురించి అల్లాహ్ చెప్పారు. ఏమనగా, వారు నమాజును శ్రద్ధగా చేస్తారు, పనికిరాని మాటలకు దూరంగా ఉంటారు, తమ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తిస్తారు మరియు తమ పవిత్రతను కాపాడుకుంటారు, అలాగే దానాలూ చేస్తారు. దీని ద్వారా ఒక విషయం స్పష్టమవుతుంది. ఇస్లాంలో విజయం అంటే డబ్బు, ఆస్తి ఎక్కువగా ఉండటం కాదు. కానీ మంచి ఇమాన్, అల్లాహ్ పట్ల విశ్వాసం కలిగి ఉండటం, అలాగే మంచి ప్రవర్తనతో జీవించడం, అల్లాహ్ చెప్పిన మాటలను పాటించడం..అదే నిజమైన విజయం.

ఇస్లాంలో ఈ లోకం జీవితానికి కూడా విలువ ఉంది. కాకపోతే ఇస్లాం ఆఖిరత్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. కానీ దున్యా జీవితాన్ని పూర్తిగా వదిలేయమని చెప్పదు. దున్యా జీవితం కూడా ఆఖిరత్‌కు వెళ్లే మార్గంలో ఒక ముఖ్యమైనా భాగం.

అందుకే ఇస్లాం, తమ కాయ కష్టం చేసి, హలాల్‌గా సంపాదించాలని మరియు తమ తమ కుటుంబాల్ని చూసుకోవాలని అలాగే సమాజానికి మంచి చేయాలని చెబుతుంది. అయితే చేసే కార్యాల్లో దున్యా కోసం ప్రయత్నిస్తూ, అల్లాహ్‌ను మరచిపోకూడదు. డబ్బు, ఆస్తి కోసం పాపాలు చేయకూడదు, ఎవరికీ అన్యాయం తలపెట్టకూడదు.

وَابْتَغِ فِيمَا آتَاكَ ٱللَّهُ ٱلدَّارَ ٱلْآخِرَةَ وَلَا تَنسَ نَصِيبَكَ مِنَ ٱلدُّنْيَا

“అల్లాహ్ నీకు ఇచ్చిన దానితో ఆఖిరత్ ఇంటిని కోరుకో. అయితే దున్యాలో నీ వాటాను మరచిపోకు.”

(సూరహ్ అల్-ఖసస్, 28:77)

ఈ ఆయత్ మన జీవితంలోని సమతుల్యత, చాలా ముఖ్యమని చెబుతుంది.

ఇస్లాం పని చేయడం మరియు కుటుంబాన్ని చూసుకోవడం అలాగే సమాజంలో జీవించడం మానేయమని చెప్పదు. ఒక ముస్లిం ఈ లోకంలో తన బాధ్యతలను చేస్తూనే ఆఖిరత్‌ను కూడా గుర్తుంచుకోవాలి. ఉద్యోగం చేయడం, డబ్బు సంపాదించడం, కుటుంబాన్ని చూసుకోవడం, సమాజానికి సేవ చేయడం ఇవన్నీ మంచి పనులే. మంచి సంకల్పంతో చేస్తే ఇవి ఆఖిరత్‌లో కూడా మనకు ఉపయోగపడతాయి.

అందుకే దున్యాను వదిలేయాల్సిన అవసరం లేదు. కానీ దున్యానే మన జీవితానికి చివరి లక్ష్యంగా చేసుకోకూడదు. దున్యాను ఆఖిరత్‌లో విజయం పొందడానికి ఒక మార్గంగా ఉపయోగించాలి.

అసలైన విజయం ఎక్కడ ఉంది? 

డబ్బు, మంచి హోదా, పేరు, అధికారం సంపాదించడం వల్ల మాత్రమే నిజమైన విజయం రాదు. ఖుర్ఆన్ మనకు పదేపదే చెబుతుంది, నిజమైన విజయం అంటే ఆఖిరత్‌లో అల్లాహ్ శిక్ష నుండి తప్పించుకుని, జన్నత్‌లో ప్రవేశించడం.

فَمَن زُحْزِحَ عَنِ ٱلنَّارِ وَأُدْخِلَ ٱلْجَنَّةَ فَقَدْ فَازَ 

“ఎవరైతే నరకాగ్ని నుండి దూరం చేయబడి, జన్నత్‌లో ప్రవేశింపబడతారో, వారు నిజంగా విజయం సాధించినవారే.”

(సూరహ్ ఆల్ ఇమ్రాన్, 3:185) 

ఇస్లాంలో విజయం అంటే ఇదే అని, చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఒక వ్యక్తి దున్యాలో ఎంత ధనవంతుడైనా, ఎంత శక్తివంతుడైనా, ఎంత ప్రసిద్ధుడైనా, ఆఖిరత్‌లో అల్లాహ్ రక్షణ పొందకపోతే, అతను విజయం పొందలేడు.

అదే విధంగా, ఒక వ్యక్తి దున్యాలో పేదరికం, అనారోగ్యం లేదా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా, ఇమాన్‌పై నిలబడి, కష్టాలను సహిస్తూ, అల్లాహ్ ఆదేశాలను పాటిస్తే, అతను నిజమైన విజయాన్ని పొందినవాడవుతాడు.

ప్రవక్త ముహమ్మద్ ﷺ యొక్క జీవితం మనకు నేర్పే పాఠం

ప్రవక్త ముహమ్మద్ ﷺ యొక్క జీవితంలో చాలా మంచి ఉదాహరణలు ఉన్నాయి. ఆయన పేదరికం, వ్యతిరేకత, ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. అయినా అల్లాహ్ ఇచ్చిన బాధ్యతను ఎప్పుడూ వదిలిపెట్టలేదు.

ఆయన జీవితం మనకు దున్యా జీవితాన్ని సరిగ్గా గడపడం, మన బాధ్యతలను నెరవేర్చడం, ఆఖిరత్‌ను లక్ష్యంగా పెట్టుకోవడం నేర్పిస్తుంది.

సహీహ్ అల్-బుఖారీలో వచ్చిన ఒక హదీసులో ప్రవక్త ﷺ ఇలా బోధించారు:

إِنَّ لِرَبِّكَ عَلَيْكَ حَقًّا، وَلِنَفْسِكَ عَلَيْكَ حَقًّا، وَلِأَهْلِكَ عَلَيْكَ حَقًّا، فَأَعْطِ كُلَّ ذِي حَقٍّ حَقَّهُ 

“నీ ప్రభువుకు నీపై హక్కు ఉంది. నీ శరీరానికి నీపై హక్కు ఉంది. నీ కుటుంబానికి కూడా నీపై హక్కు ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరి హక్కును నెరవేర్చు.”

(సహీహ్ అల్-బుఖారీ) 

ఈ హదీస్ ఇస్లాం చెప్పే సమతుల్యమైన జీవితాన్ని మనకు చూపిస్తుంది.

మనం అల్లాహ్ హక్కులను నెరవేర్చాలి. అలాగే మన శరీరం, ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ తీసుకోవాలి మరియు మన కుటుంబాన్ని చూసుకోవాలి, ఇతరుల హక్కులను గౌరవించాలి.

ధార్మిక జీవితం అంటే కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉండడం కాదు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం కాదు. దున్యాలో ఉన్న మంచి విషయాలన్నింటినీ వదిలేయడం కూడా కాదు.

దున్యాలో మన స్థానం ఎలా ఉండాలి? 

మరో హదీసులో ప్రవక్త ﷺ ఇలా చెప్పారు: 

كُنْ فِي الدُّنْيَا كَأَنَّكَ غَرِيبٌ أَوْ عَابِرُ سَبِيلٍ 

“నీవు ఈ దున్యాలో ఒక పరదేశివాడిలా లేదా ప్రయాణికుడిలా ఉండు.”

(సహీహ్ అల్-బుఖారీ) 

ఈ హదీస్ దున్యాను పూర్తిగా వదిలేయమని చెప్పదు. కానీ దున్యాలోని తాత్కాలిక విషయాలపై ఎక్కువగా మోజు పెంచుకోకూడదని చెబుతుంది.

ఒక ప్రయాణికుడు కొంతసేపు ఒక చోట ఆగుతాడు. కానీ ఆ చోటే శాశ్వతంగా ఉండాలని అనుకోడు. అలాగే ఒక ముస్లిం కూడా ఈ దున్యానే తన చివరి గమ్యం అని భావించకూడదు. మనకు దొరికే ప్రతి అవకాశం, ప్రతి పని, ప్రతి అనుగ్రహం ఆఖిరత్‌లో విజయాన్ని పొందడానికి ఉపయోగపడాలి.

నిజమైన ఓటమి ఎవరిది? 

అల్లాహ్ దృష్టిలో నిజంగా నష్టపోయినవారు ఎవరో, ఖుర్ఆన్ స్పష్టంగా చెబుతుంది: 

قُلْ إِنَّ ٱلْخَـٰسِرِينَ ٱلَّذِينَ خَسِرُوٓا۟ أَنفُسَهُمْ وَأَهْلِيهِمْ يَوْمَ ٱلْقِيَـٰمَةِ ۗ 

“చెప్పండి: నిజంగా నష్టపోయినవారు కియామత్ రోజున తమను మరియు తమ కుటుంబాలను నష్టపోయినవారే.”

(సూరహ్ అజ్-జుమర్, 39:15) 

ఈ ఆయత్ మనకు ఒక ముఖ్యమైన విషయం చెబుతుంది అదేమనగా : దున్యాలో పేదరికంలో ఉండటం నిజమైన ఓటమి కాదు. ఉద్యోగం లేకపోవడం లేదా డబ్బు పోవడం కూడా అసలైన నష్టం కాదు. అయితే నిజమైన నష్టం అంటే ఆఖిరత్‌లో మనకు ఉపయోగపడే మంచి పనులు లేకుండా అల్లాహ్ ముందు నిలబడటం.

ఒక వ్యక్తి దున్యాలో చాలా డబ్బు సంపాదించి ఉండవచ్చు, మంచి పేరు తెచ్చుకుని ఉండవచ్చు. కానీ అల్లాహ్ ఇచ్చిన జీవిత లక్ష్యాన్ని మర్చిపోతే, అతను నిజమైన విజయం పొందినవాడు కాడు.

ఇస్లాం ప్రకారం నిజమైన విజయం డబ్బు, ఆస్తి లేదా హోదాతో నిర్ణయించబడదు. నిజమైన విజయం అంటే మంచి ఇమాన్ కలిగి ఉండటం, మంచి పనులు చేయడం మరియు మంచి మార్గంలో జీవించడం అలాగే అల్లాహ్ సంతోషాన్ని పొందడం. మన దున్యా జీవితం చాలా చిన్నది. ఈ జీవితంలో మనం ఎంత సంపాదించినా, ఎంత కోల్పోయినా, చివరికి ఇవన్నీ ఇక్కడే మిగిలిపోతాయి.

మనతో ఆఖిరత్‌కు వెళ్లేది, మన మంచి పనులు మాత్రమే, మన నియ్యత్ మరియు అల్లాహ్ కరుణ మాత్రమే.

అందుకే ఖుర్ఆన్ సందేశం కూడా చాలా స్పష్టంగా ఉంది:

విజయం అంటే ప్రజల ముందు మనం ఎంత గొప్పగా ఉన్నామనేది కాదు. అల్లాహ్‌కు మనం ఎంత దగ్గరగా ఉన్నామనేదే నిజమైన విజయం. అల్లాహ్ మనందరినీ నిజమైన ఫలాహ్ పొందిన వారిలో చేర్చు. మనకు దున్యాలోనూ, ఆఖిరత్‌లోనూ నిజమైన విజయాన్ని ప్రసాదించుగాక.

ఆమీన్

          

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter