బాయిలింగ్ ఫ్రాగ్ సిండ్రోమ్
సైకాలజీని పాఠ్యాంశంగా చదివే వారికి "బాయిలింగ్ ఫ్రాగ్ సిండ్రోమ్" - గురించి తెలిసే ఉంటుంది.
ఓ గిన్నె లో నీటిని బాగా వేడిచేసి, ఆ నీటిలో ఓ కప్పను, వేస్తే అది వెంటనే బయటికి దూకేసి తన ప్రాణాలను కాపాడుకుంటుంది.
అదే కప్పను ఓ చల్లటి నీరున్న గిన్నెలో వేసి, ఆ గిన్నె కింద చిన్నగా మంటపెట్టి, నీటి ఉష్ణోగ్రత మెల్ల,మెల్లగా పెంచుకుంటూపోతే.. మొదట్లో కలిగిన వెచ్చదనాన్ని ఆ కప్ప ఎంజాయ్ చేస్తుంది. తనకు అచ్చేదిన్ వచ్చాయనుకుంటుంది.వేడి ఇంకొంచెం పెరిగాక, ప్రమాద సూచికల్ని ఆ కప్ప పసిగడుతుంది గానీ, గిన్నెలోనుండీ బయటికి దూకే ప్రయత్నం మాత్రం చేయదు. ఆ నీరు బాగా వేడెక్కి, తన ప్రాణాలకు ప్రమాదం ముంచుకొస్తుందని కప్పకు అర్థమయ్యేటప్పటికే, ఆ వేడినీరు కప్ప కండరాల్లోని శక్తిని పూర్తిగా హరించేసి వుంటుంది. ముందుగా బయటికి దూకనందుకు తనను తాను తిట్టుకుంటూ చనిపోవడం తప్ప, ఆ కప్పకు వేరే ఆప్షన్ ఉండదు.
ఒకేసారి కాకుండా, కొంచె కొంచెం పెంచుకుంటూ పోతే, ఎలాంటి అపాయకర పరిస్థితుల్నైనా జనంతో అంగీకరింపచేయొచ్చనే -"బాయిలింగ్ ఫ్రాగ్ సిండ్రోమ్ సిద్దాంతాన్ని" అనేక సంఘాలు, పార్టీలు, ప్రభుత్వాలూ జనంపై విజయవంతంగా ప్రయోగించిన దృష్టాంతాలు మానవ చరిత్రలో చాలానే ఉన్నాయి.
**
ఎక్కడైనా గ్యాంగ్ రేప్ జరగగానే, ఆ రేప్ చేసిన వారిని, వారు ఇంకా అనుమానితులేనా లేక కోర్టులు నిర్ధారించిన దోషులా అనేదాంతో సంబంధంలేకుండా, వారిని ఎన్‌కౌంటర్ చేసిపడేయాలని జనం వీధుల్లోకొచ్చి ర్యాలీలు, ధర్నాలూ చేయడం మన సమాజంలో రొటీన్ గా చూస్తున్నాం. "ఓ అభాగ్యురాలైన మహిళపట్ల పైశాచికంగా ప్రవర్తించడం తప్పు"- అనే మోరల్ స్టాండర్డ్ ని జనం అలా ప్రకటిస్తుంటారు.
అలాంటిది, ఓ కుటుంబాన్ని 13 మంది కిరాతకులు చుట్టుముట్టి, మూడేళ్ళ బాలిక తలను బండకేసి బాది కొట్టి చంపేసి, 8 మంది మహిళల్ని గ్యాంగ్ రేప్ చేసి చంపేస్తే, ఆ రేప్ చేసిన దోషులెవరో పక్కా ఆధారాలతో కోర్టుల్లో నిర్ధారణ అయిన తర్వాత కూడా, ఆ కౄరమృగాల్ని ప్రభుత్వం జైల్ నుండీ విడుదలచేస్తే..? బయటకొచ్చిన ఆ మృగాలకు దండలేసి, ధర్మ పరిరక్షకులుగా వారికి సన్మానాలు చేస్తే..?
ఆ ప్రభుత్వానికి, ఆ సన్మానాలు చేసినవారికి, ఇదేమీ పెద్దవిషయం కానట్టు దీనిని ఇగ్నోర్ చేసున్నవారికి అసలు మోరల్ స్టాండర్డ్స్ ఉన్నట్టా? లేక, మతాన్ని బట్టి మోరల్స్ మారొచ్చనేదే వీరి స్టాండర్డా..?
ఇక అసలు కొసమెరుపు ఏంటంటే, ఆ 13 మంది మృగాల్ని జైలు నుండీ విడుదల చేసిన ఆగస్టు 15 నాడే, అదే ప్రభుత్వాధినేత -'మహిళల హక్కుల గురించి, మహిళల రక్షణ గురించీ' ఎర్రకోట పై ప్రగల్బాలు పలికితే, అంబానీ-అదానీలపరమైపోయిన ఈ దేశ కార్పోరేట్ మీడియా, అమ్ముడుపోయిన జర్నలిస్టులు వాటిని తన్మయత్వంతో తలుచుకుంటూ రోజంతా ఆ ప్రసంగాల్ని ప్రసారం చేశారు. ఏ మంటకైనా ఇంధనం కావాలి కదా.
బిల్కిస్ బానో - గ్యాంగ్ రేప్ తర్వాత మిగతా 7 మంది లాగే ఈమె కూడా చనిపోయిందనుకుని వదిలేస్తే, ఈమె ఒక్కటే ప్రాణాలతో బయటపడింది. మానవరూపంలోని మృగాల్ని గుర్తించింది. ఆమెకు 50 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వమని గుజరాత్ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశిస్తే, ఆ 50 లక్షలు తనకు అక్కర్లేదని ఆమె నిరాకరించింది. కేసు వాపస్ చేసుకోమని ఆమెకు బయటినుండీ ఇంకెన్ని ఆఫర్లు, బెదిరింపులు వచ్చి ఉంటాయో ఎవరైనా ఊహించుకోవచ్చు. వీటన్నిటితో ఆమె ఎదురొడ్డి పోరాడింది. ఈ దేశ మోరల్ స్టాండర్డ్ ఏంటో మీరే తేల్చమని న్యాయస్థానం ముందు తలెత్తుకుని నిలబడింది. ఎవరెస్ట్ లా.
ఇంతకీ ఈ మొత్తం వ్యవహారంలో, బాయిలింగ్ వాటర్ లో ఉన్న కప్పలెవరు..? రాజ్యాంగం పై ప్రమాణం చేసి, అదే రాజ్యాంగ నియమాల్ని ప్రతిరోజూ నిర్వీర్యం చేస్తున్నదెవరో...నిత్యం "ధర్మం కోసం" అని చెప్తూనే, మోరల్ స్టాండర్డ్స్ ని అధోపాతాళానికి తొక్కేస్తూ ధర్మానికి కళంకం తెస్తున్నదెవరో, మీకీపాటికే అర్థమై ఉండాలి. లేదంటే..