శాంతి దూత జవహర్‌లాల్ నెహ్రూ
భారతదేశానికి ప్రప్రధమ ప్రధానిగా పని చేసిన, జవహర్‌లాల్ నెహ్రూ దేశాన్ని బ్రిటీష్ కబంధహస్తాల నుంచి విడిపించేలా కీలక పాత్ర పోషించారు. మహాత్మ గాంధీతో ఏర్పడిన పరిచయం ఆయనను దేశ స్వాతంత్య్ర ఉద్యమంలోకి దిగేలా చూసింది. తన తిరుగుబాటు చర్యలతో ఆయన జైలు పాలు కావాల్సి వచ్చింది. ఉద్యమకాలంలో బ్రిటీష్ వారు ఆయనను జైలు పాలు చేసినా, నిర్బంధాలకు గురి చేసినా నిరాశ చెందక, దేశ వ్యాప్తంగా ర్యాలీలు చేపట్టి 1947 లో తెల్లవారి పాలన అంతమయ్యేలా కృషి చేశారు.
అతను ఒక లౌకిక మానవతావాది, సామాజిక ప్రజాస్వామ్యవాది,ప్రజాస్వామ్య సోషలిస్ట్ రాజనీతిజ్ఞుడు మరియు రచయిత. 20వ శతాబ్దం మధ్యలో భారతదేశంలో ప్రధాన వ్యక్తి. ఈయన 1930లు మరియు 1940లలో భారత జాతీయవాద ఉద్యమానికి ప్రధాన నాయకుడు. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, అతను 16 సంవత్సరాలు దేశ ప్రధానమంత్రిగా పనిచేశాడు. నెహ్రూ 1950లలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, లౌకికవాదం మరియు సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రోత్సహించారు, ఆధునిక దేశంగా భారతదేశాన్ని శక్తివంతంగా ప్రభావితం చేశారు. అంతర్జాతీయ వ్యవహారాలలో, అతను ప్రచ్ఛన్న యుద్ధం యొక్క రెండు బ్లాక్‌ల నుండి భారతదేశాన్ని స్పష్టంగా నడిపించాడు. మంచి గుర్తింపు పొందిన రచయిత, జైలులో రాసిన లెటర్స్ ఫ్రమ్ ఎ ఫాదర్ టు హిస్ డాటర్ (1929), యాన్ ఆటోబయోగ్రఫీ (1936) మరియు ది డిస్కవరీ ఆఫ్ ఇండియా (1946) వంటి పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా చదవబడ్డాయి. గౌరవప్రదమైన పండిట్ అనేది సాధారణంగా అతని పేరుకు ముందు వర్తించబడుతుంది.
బాల్యం
సుసంపన్నమైన కుటుంబంలో తల్లిదండ్రుల తొలి సంతానం కావడంతో జవాహర్‌లాల్ బాల్యం ముద్దుమురిపాల నడుమ, అతిగారాబంగా సాగింది జవాహర్‌లాల్‌ను తండ్రి కొద్దినెలల పాటు స్థానిక కాన్వెంటుకు పంపి ఆ ప్రయత్నం విరమించి, ఇంట్లోనే ప్రైవేటుగా చదివించడం ఉత్తమమని నిర్ణయించుకున్నాడు. అతనికి మహాపండితుడైన గంగానాథ ఝా సంస్కృత విద్య, అనీ బిసెంట్ సూచించిన ఫెర్డినాండ్ టి. బ్రూక్స్ అనే దివ్యజ్ఞాన సమాజ యువకుడు ఆంగ్ల విద్య బోధించేవారు. తండ్రి ఆంగ్ల విద్యకే ప్రాధాన్యం ఇచ్చాడు, అందుకు అనుగుణంగానే జవాహర్‌కి సంస్కృత విద్య ఒంటబట్టలేదు. అతనికి విజ్ఞానశాస్త్రం పట్ల ప్రాథమిక అవగాహన, దివ్యజ్ఞాన సమాజ తాత్త్వికత పట్ల ఆసక్తి, ఆంగ్ల కవిత్వం, సాహిత్యం, ఉపనిషత్తులు, భగవద్గీత వంటి పలు అంశాలను పరిచయం చేశాడు దివ్యజ్ఞాన సమాజం పరిచయం నెహ్రూకు బౌద్ధ, హిందూ మతగ్రంథాల పట్ల ఆసక్తి కలిగించి అధ్యయనానికి పురిగొల్పింది. మూడు సంవత్సరాల పాటు బ్రూక్స్ నెహ్రూకు ట్యూటర్‌గా వ్యవహరించాడు.అతని గురించి తర్వాతికాలంలో నెహ్రూ మాట్లాడుతూ "దాదాపు మూడేళ్ళు అతను నాతో ఉన్నాడు. ఎన్నో విధాలుగా అతను నన్ను గొప్పగా ప్రభావితం చేశాడు" అన్నాడు.
పాఠశాల విద్యాభ్యాసం
మోతీలాల్ జవాహర్‌లాల్ ప్రైవేటు విద్యను ముగింపజేసి, 1905 మే నెలలో కుటుంబ సమేతంగా బ్రిటన్ వెళ్ళి ప్రతిష్ఠాత్మక హేరో పాఠశాలలో కుమారుడికి ప్రవేశం సంపాదించాడు. హేరోలో ప్రతిభా పాటవాలు చూపి పేరుతెచ్చుకున్నా, క్రమేపీ హేరో పాఠశాల జీవితం అతన్ని విసుగెత్తించింది. హేరో పాఠశాల విద్యాకాలం మొత్తం మీద అధికారుల శిక్షణ కోర్ మాత్రం అతన్ని ఆకట్టుకుని, ఉత్సాహభరితంగా పాల్గొనేలా చేసింది. మరోవైపు 1905లో భారతదేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు అతనికి ఆసక్తి కలిగించడం ప్రారంభించాయి. 1905లో జరిగిన బెంగాల్ విభజన, అది బెంగాల్‌లోని జాతీయోద్యమాన్ని బలహీనపరిచే చర్యగా ఆందోళనలు పెరుగుతూండడం, ఆ ఆందోళనలు కాంగ్రెస్ పార్టీలో అతివాదులు, మితవాదుల విభజన సృష్టించడం వంటి పరిణామాలను జవాహర్‌లాల్ ఆసక్తిగా పరిశీలించసాగాడు. తండ్రికి ఉత్తరాలు రాసి ఎప్పటికప్పుడు వార్తాపత్రికలు తెప్పించుకుంటూ ఉండేవాడు. ఆ దశలో అతనికి అతివాదుల మీద సానుభూతి ఏర్పడింది. మరోవైపు షుషిమా వద్ద నౌకాయుద్ధంలో రష్యాపై జపాన్ ఘనవిజయం సాధించిందన్న వార్త అతనిని చాలా సంతోషపరిచింది. ఆసియా దేశాలు ఐరోపా వలసపాలనలో మగ్గుతూ ఉన్న ఆ దశలో తోటి ఆసియా దేశమైన జపాన్ ప్రదర్శించిన సైనిక పాటవం, శక్తి సామర్థ్యాలు అతనికి ఉత్సాహం కలిగించాయి. హేరో పాఠశాలలో అతని విద్యావిషయమైన ప్రతిభకు బహుమతిగా బ్రిటీష్ చరిత్రకారుడు జి. ఎం. ట్రావెల్యాన్ ఇటలీ జాతీయవాది, సైన్యాధ్యక్షుడు అయిన గారిబాల్డ్ గురించిన పుస్తకాలు లభించాయి. ఇవి జవాహర్‌లాల్‌ను ప్రభావితం చేశాయి. తన మనసులో భారతదేశ స్వేచ్ఛ కోసం అద్భుతమైన పోరాటాలు చేసినట్టు కొన్ని దృశ్యాలు తళుక్కుమనేవని, ఆ పుస్తకాలు చదివేప్పుడు ఆలోచనల్లో అతను వర్ణించే ఇటలీ, తన మాతృభూమి భారతదేశం గొప్పగా కలగలిసిపోయేవని జవాహర్‌లాల్ పేర్కొన్నాడు.
కేంబ్రిడ్జి విద్యాభ్యాసం
జవాహర్‌లాల్ 1907లో కేంబ్రిడ్జి ప్రవేశపరీక్ష వ్రాసి ఉత్తీర్ణుడై, ఆ సంవత్సరం అక్టోబరు నెలలో ట్రినిటీ కళాశాలలో చేరాడు. ప్రవేశపరీక్షకు, ట్రినిటీ ప్రవేశానికి మధ్యలో వేసవి కాలంలో కొన్ని వారాల పాటు ఐర్లాండును సందర్శించాడు. స్వయంపాలన కోసం పోరాటం చేస్తున్న ఐర్లాండు అతని ఆసక్తిని చూరగొంది. క్రియాశీలంగా ఆందోళనలు చేస్తున్న ఐరిష్ అతివాద ఆందోళనలు అతనికి నచ్చాయి. ఈ దశలో అతను తండ్రికి రాసే ఉత్తరాల్లో జాతీయవాద ఉద్యమాలు, వాటిలో ప్రత్యేకించి అతివాదం పట్ల తనకు ఏర్పడుతున్న అభిమానాన్ని వెల్లడించేవాడు. కేంబ్రిడ్జిలో అతను రసాయనశాస్త్రం, భూవిజ్ఞాన శాస్త్రం, భౌతికశాస్త్రాలను అధ్యయనాంశాలుగా స్వీకరించి కొన్నాళ్ళకే భౌతికశాస్త్రాన్ని విడిచిపెట్టి వృక్షశాస్త్రం స్వీకరించాడు. కేంబ్రిడ్జిలో జవాహర్‌లాల్ అంతగా శ్రమించి చదవలేదు. యువకులకు ఉత్సాహభరితంగా ఉండే కేంబ్రిడ్జి వాతావరణం అతని నిరాసక్తతను మార్చలేకపోయింది. ఆ దశలో జవాహర్‌లాల్‌కి టెన్నిస్ ఆట, గుర్రపుస్వారీ, పందెపు పడవల జట్టులో ఆడడం వంటి వ్యాపకాలు ఉండేవి కానీ ఆ వ్యాపకాలు వేటిలోనూ పూర్తి అభినివేశం కానీ, మంచి ఉత్సాహం గానీ చూపించలేదు. ఫైనల్ ట్రైపోన్ పరీక్షలో ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు, ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణుడైనవారిలోనూ అతని పేరు కింది వరుసలోనే వచ్చింది. అలా 1910లో ఆనర్స్ డిగ్రీతో పట్టభద్రుడయ్యాడు. ఈ దశలో అతను రాజనీతిశాస్త్రం, ఆర్థికశాస్త్రం, చరిత్ర, సాహిత్యం చదువుకున్నాడు. జార్జి బెర్నార్డ్ షా, హెచ్.జి.వెల్స్, జె.ఎం.కీన్స్, బెర్ట్రాండ్ రస్సెల్, లూయీస్ డిక్సన్, మెరెడిత్ టౌన్సెండ్ వంటి వారి రచనలు అతని రాజకీయ, ఆర్థిక చింతనపై ప్రభావం చూపాయి.
న్యాయవిద్యాభ్యాసం
కేంబ్రిడ్జిలో ఫైనల్ ట్రైపోన్ పరీక్షకు ముందే ఇన్నర్ టెంపుల్‌లో చేరాడు. ఇన్నర్ టెంపుల్ అన్నది న్యాయవిద్య అభ్యసించి బారిస్టర్ కావడానికి అవసరమైన నాలుగు ఇన్‌లలో ఒకటి. కనీసం న్యాయవిద్య తన కుమారుడి ఆసక్తిని చూరగొందని, ఇకపై ఉత్సాహంగా చదువుతాడని మోతీలాల్ నమ్మాడు. కానీ తన ఇష్టంతో ప్రమేయం లేకుండా సాగుతున్న తన జీవితం పట్ల ఆనాసక్తితో ఉన్న జవాహర్‌లాల్ న్యాయవిద్యాభ్యాసంలోనూ పెద్ద చురుకుదనం, ఉత్సాహం ప్రదర్శించలేదు. ఇన్నర్ టెంపుల్‌లోని రెండేళ్ళ కాలంలో జవాహర్‌లాల్ ప్రాణానికి ప్రమాదమైన సాహసకార్యాలు చేశాడు, పాత మిత్రులను తిరిగి కలిశాడు, ఫాషన్లు అనుసరించాడు, అప్పులు చేశాడు. ఇలా లండన్ జీవితంలోని సందడి చవిచూశాడు. అంతేతప్ప విద్యాభ్యాసంలో మంచి పట్టుదల కనబరచలేదు. ఫలితంగా 1912లో స్కాలర్‌షిప్‌లు, బహుమానాలు వంటివి ఏమీ సాధించకుండా బార్ ఎట్ లా పరీక్షల్లో సాధారణంగా ఉత్తీర్ణుడయ్యాడు. అప్పటికి ఇంగ్లాండులో ఏడేళ్ళ విద్యాభ్యాసం పూర్తిచేసుకుని భారతదేశానికి తిరిగివచ్చాడు. భారతదేశం తిరిగివచ్చేనాటికి అతని మనస్సు, బుద్ధి ఒక వృత్తి కోసం కాక, భవిష్యత్తులో రాబోయే పిలుపును అందుకోవడానికి సంసిద్ధంగా తయారైంది.
న్యాయవాద వృత్తిలో
బారెట్లా ఉత్తీర్ణుడై ఇన్నర్ టెంపుల్‌లో బారిస్టరుగా నమోదుకాగానే న్యాయవాద వృత్తిని అవలంబించడానికి 1912 ఆగస్టులో భారతదేశానికి తిరిగి వచ్చాడు. జవాహర్‌లాల్ అలహాబాద్ ఉన్నత న్యాయస్థానంలో న్యాయవాదిగా పేరు నమోదుచేసుకుని, తండ్రి ప్రాక్టీసులో సహ న్యాయవాదిగా వృత్తి ప్రారంభించాడు. తండ్రి వలె కాక జవాహర్‌లాల్ న్యాయవాద వృత్తిలో పెద్ద ఆసక్తి కనబరచలేదు. తత్ఫలితంగా అతను న్యాయవాదిగా పెద్దగా రాణించిందీ లేదు, తోటి న్యాయవాదుల సాంగత్యంలో ఇమడగలిగినదీ లేదు. న్యాయవాదిగా ప్రాక్టీసుచేసిన రోజుల గురించి జవాహర్‌లాల్ మొత్తం మీద ఆ వాతావరణం మేధోపరంగా ఉత్తేజితంగా ఉండేది కాదని, తనకు జీవితం పట్ల విపరీతమైన నిరాసక్తత పెరిగిపోయిందని పేర్కొన్నాడు. తండ్రి జవాహర్‌లాల్‌కు కక్షిదారులను తీసుకువచ్చేవాడు. జవాహర్ క్రమశిక్షణతోనే కేసులను నడిపేవాడు. కానీ జీవితోత్సాహం లోపించేది. బ్రిటన్‌లో ఉన్నకాలంలో అతను జాతీయవాదంపైనా, అతివాదంపైనా చూపిన ఆసక్తి క్రియారూపంలోకి రాలేదు. ఈ దశలో సంపన్న పాశ్చాత్య ప్రభావితమైన భారతీయ జీవనంలో ఇమిడిపోవడానికి అదేమీ అడ్డురాలేదు. జవాహర్ ఈ దశలో కొంతమేరకు సామాజిక సేవ కూడా చేసేవాడు. వాటిలో దక్షిణాఫ్రికాలోని భారతీయుల ఉద్యమానికి మద్దతుగా నిధుల సేకరణ ఒకటి. దక్షిణాఫ్రికాలోని భారతీయుల ఉద్యమాలకు సూత్రప్రాయంగా బ్రిటీష్ ఇండియా ప్రభుత్వ సానుభూతి ఉండేది కాబట్టి ఇది ప్రభుత్వ వ్యతిరేక చర్య కాదు. జవాహర్‌లాల్ ఈ క్రమంలో ముందుకుపోయి బ్రిటీష్ పారామిలటరీలో చేరి, తోటి భారతీయ యువకులను ఆ దళంలో చేర్చడానికి అవసరమైన ప్రయత్నాలు చేసేవాడు. అప్పటికే అంతరంగంలో జాతీయవాద పోరాటాలు, అతివాద ఉద్యమాల పట్ల ఆరాధనాభావం ఉన్నా, ఈ దశలో అతని క్రియాశీల రాజకీయ అవగాహన దయాళువులైన బ్రిటీష్ వారు భారతీయుల న్యాయమైన కోర్కెలు తీరుస్తారన్న నమ్మకానికి పరిమితమై ఉండేది.
సహాయ నిరాకరణోద్యమం నుంచి పూర్ణ స్వాతంత్ర్యం వరకు (1919 - 1930)
ప్రధాన వ్యాసం: భారత స్వాతంత్ర్యోద్యమంలో జవాహర్ లాల్ నెహ్రూ
రాజకీయాల్లోకి ప్రవేశం: రెండవ ప్రపంచయుద్ధం, హోంరూల్ లీగ్
అలహాబాద్ ఉన్నత న్యాయస్థానంలో తండ్రి చాటు న్యాయవాదిగా పనిచేస్తున్న జవాహర్‌లాల్ తండ్రితో పాటుగా 1912లో పాట్నాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశాలకు హాజరయ్యాడు. జీవితకాలం పాటు అనుబంధం పెంచుకున్న ఆ సంస్థ అప్పటి దశలో చేస్తున్న రాజకీయాలు జవాహర్‌లాల్‌కు కనీస ఆసక్తి కలిగించలేదు. అతనికి ఆ సమావేశాలు - "ఇంగ్లీషు తెలిసిన ఉన్నత వర్గాల వ్యవహారంగా మాత్రమే" అనిపించాయి. ఆ దశలో కాంగ్రెస్ దాదాపుగా మితవాద రాజకీయ నాయకులతో నిండి ఉండేది. మొదటి ప్రపంచయుద్ధం వచ్చిన ఆ దశలో తనకు ఒక స్పష్టమైన వైఖరి లేదని జవాహర్ తర్వాతి దశలో అంగీకరించాడు. నెహ్రూ జీవితచరిత్రకారుల్లో ఒకడైన ఫ్రాంక్ మోరిస్ రాసినదాని ప్రకారం "అతని (జవాహర్‌లాల్) సానుభూతి ఏ దేశంతో అయినా ఉందంటే అది ఫ్రాన్స్. ఫ్రెంచి సంస్కృతి పట్ల అతనికి ఎంతగానో గౌరవం ఉండేది." యుద్ధసమయంలో జవాహర్ "సెయింట్ జాన్స్ అంబులెన్స్"కు స్వచ్ఛంద సేవకునిగా ఉన్నాడు. అలహాబాదులో సెయింట్ జాన్స్ అంబులెన్స్ సర్వీసు వారి ప్రాంతీయ కార్యదర్శుల్లో అతను ఒకడు. కానీ ప్రభుత్వం అమలు చేసిన సెన్సార్‌షిప్ బిల్లులను వ్యతిరేకించాడు. 1917లో ప్రాంతీయ సైన్యం నమూనాలో తయారుచేసిన భారతీయ రక్షణదళంలో చేరడానికి తన సమ్మతిని తెలియజేశాడు. తనవంటి యువకులను అందులో చేరేలా ప్రోత్సహించే కార్యకలాపాల్లో పాల్గొనడానికి సంసిద్ధుడైనాడు.
కాంగ్రెస్ సంస్థలో అతివాదులకు ప్రవేశం ఇప్పించే ప్రయత్నాలు బెడిసికొట్టి మితవాదులు విజయం సాధించడంతో బాలగంగాధర తిలక్, అనీ బిసెంట్ హోంరూల్ లీగులు స్థాపించారు. స్వయంపాలన ఆవశ్యకతను ప్రచారం చేసే ఉద్దేశంతో ఈ సంస్థలు స్థాపించారు. ప్రభుత్వం అనీబిసెంట్‌ని బొంబాయి, సెంట్రల్ ప్రావిన్సుల నుంచి బహిష్కరించింది. దీనిపై దేశవ్యాప్తంగా ఎందరో విద్యావంతులు, అనీబిసెంట్ అనుచరులు ఆందోళన వ్యక్తం చేశారు. అలా ప్రభుత్వ చర్యలను నిరసించినవారిలో జవాహర్‌లాల్ ఒకడు. ప్రతిస్పందనగా తాను భారతీయ రక్షణదళంలో చేరడానికి చేసిన దరఖాస్తు ఉపసంహరించుకుని, దళంలో చేరేలా ఇతరులను ప్రోత్సహించేందుకు నిర్వహించబోయిన సభ రద్దుచేశాడు. మోతీలాల్ అధ్యక్షతన జవాహర్‌లాల్ ఒకానొక కార్యదర్శిగా యునైటెడ్ ప్రావిన్సుల హోంరూల్ లీగ్ ఏర్పాటుచేశారు. అయితే హోంరూల్ సాధించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ విషయంలో జవాహర్‌లాల్‌కి స్పష్టత లేదు. హోంరూల్ నాయకులైన అనీబిసెంట్ ఆంగ్లో-సాక్సన్ పద్ధతి కానీ, తిలక్ తీవ్రమైన అతివాదం కానీ అతన్ని ఆకర్షించలేదు. అలాగని స్వంతంగా తనే కార్యాచరణ ఏర్పురుచుకోగల స్పష్టత కూడా లేదు. సిరిసంపదల వల్ల దేశప్రజలకు సేవచేయగల స్థితిలో ఉండి కూడా తండ్రి స్థాపించిన ఇండిపెండెంట్ పత్రిక నిర్వహణలో సహకారం తప్ప మరేమీ చేయలేకపోతున్నందుకు అసంతుష్టితో గడిపేవాడు.
మరణం
చైనా భారత యుద్ధం ప్రారంభించిన కొద్ది రోజులలోనే చైనా సైన్యం ఈశాన్య భారతదేశంలోనిఅస్సాం వరకు చొచ్చుకు రావడం భారత సైన్య బలహీనతను బహిర్గత పరచింది.భద్రతపై అయన ప్రభుత్వ నిర్లక్ష్యానికి తీవ్ర విమర్శలు ఎదుర్కొని,రక్షణ మంత్రి అయిన కృష్ణ మీనన్ను తొలగించి, యు.ఎస్. సైనికసహాయం అర్దించవలసి వచ్చింది. క్రమంగా నెహ్రూ ఆరోగ్యం మందగించ సాగింది, కోలుకోవడానికి అయన 1963 లో కొన్ని నెలలు కాశ్మీర్లో గడపవలసి వచ్చింది. కొంతమంది చరిత్ర కారులు ఈ ఆకస్మిక ఇబ్బందికి కారణం చైనా దండయాత్ర వలన అయన పొందిన అవమానం , విశ్వాస ఘాతుకంగా భావిస్తారు కాశ్మీర్ నుండి తిరిగి వచ్చిన తరువాత నెహ్రూ గుండెపోటుతో బాధపడి తరువాత మరణించారు. 1964 మే 27 వేకువ సమయంలో ఆయన మరణించారు. హిందూమత కర్మల ననుసరించి యమునా నది ఒడ్డున గలశాంతివన్లో నెహ్రూ అంత్య క్రియలు జరుప బడ్డాయి, వందల వేల మంది సంతాపం ప్రకటించడానికి ఢిల్లీ వీధులలో , అంత్యక్రియా స్థలం వద్ద గుమికూడారు.
నెహ్రూ జీవితం పై ఎన్నోడాక్యుమెంటరీలు నిర్మింపబడ్డాయి.ఎన్నో కల్పిత చిత్రాలలో ఆయన చిత్రీకరింప బడ్డారు. 1982 లో రిచర్డ్ అటెన్ బరో చిత్రంగాంధీ లోను, నెహ్రూ చే రచింపబడిన ది డిస్కవరీ అఫ్ ఇండియా గ్రంథం పై ఆధారపడి 1988 లోశ్యాం బెనెగల్ యొక్క టెలివిజన్ సీరియల్ భారత్ ఏక్ ఖోజ్ లోను, 2007 లో ది లాస్ట్ డేస్ అఫ్ ది రాజ్ అనే టెలివిజన్ చిత్రం లోను మూడు సార్లు నెహ్రూ పాత్రను పోషించినరోషన్ సేథ్ ఆ పాత్రకు పరిపూర్ణత నిచ్చారు. కేతన్ మెహతా చిత్రం సర్దార్లో నెహ్రూపాత్రను బెంజమిన్ గిలానీ పోషించారు. శేర్వాని ధారణను నెహ్రూ వ్యక్తి గతంగా ఇష్ట పడడం దానిని ఉత్తర భారతదేశంలో నేటికి కూడా ప్రత్యేక సందర్భ వస్త్ర ధారణగా నిలిపింది. ఒక రకమైన టోపీకి ఆయన పేరును ఇవ్వడంతో పాటు, ఆయన ప్రాధాన్యతనిచ్చిన కోటుకు కూడానెహ్రూ కోటు అనే పేరునిచ్చి గౌరవిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా అనేక ప్రభుత్వరంగసంస్థలు, జ్ఞాపక చిహ్నాలు నెహ్రూస్మృతికి అంకితం ఇవ్వబడ్డాయి. భారతదేశంలోని విశ్వవిద్యాలయాలలో ఢిల్లీ లోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది. ముంబై నగరానికి దగ్గరలో నున్న జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ భారీ సరుకు రవాణాకు, రాకపోకలకు అనువుగా నిర్మించ బడిన ఆధునికమైన పోర్ట్ ,డాక్. ఢిల్లీ లోని నెహ్రూ నివాసము నెహ్రూ జ్ఞాపకార్ధ మ్యూజియం , గ్రంధాలయంగా సంరక్షించ బడుతోంది. నెహ్రూ కుటంబ భవనాలైన ఆనంద్ భవన్ , స్వరాజ్ భవన్లు నెహ్రూ జ్ఞాపకార్ధం , కుటుంబ వారసత్వంగా కాపాడబడుతున్నాయి. 1951 లో ఆయన అమెరికన్ ఫ్రెండ్స్ సర్వీసు కమిటీ (AFSC)ద్వారానోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించ బడ్డారు