దైవ ప్రవక్త ﷺ  గారి జీవితంలో నిజాయితి

       ప్రియ ప్రవక్త (స)గారి జీవితంలోని సద్గుణాలలో ఒకటైన సద్గుణం నిజాయితీ. అంతేకాక వారు ఏ పనైనా చేసి చూపెట్టేవారు. హుజూర్(స) గారు సత్కార్యాలను చేస్తూనే, ఇతరులకు కూడా వాటి ఆదేశాన్ని ఇచ్చేవారు. అలా ఆదేశం ఇచ్చిన పనులలో, అందరికన్నా శ్రేష్టంగా, పద్ధతిగా చేసేవారిలో అందరికంటే ముందడుగై, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారే నిలిచేవారు. అటువంటి సద్గుణాలలో ఒక గొప్ప సద్గుణం నిజాయితీని కలిగి ఉండడం.

   ఆనాటి సంగతి ఖురైష్ వంశంలో ‘బనూ మఖ్జూమ్’ అన్న కుటుంబం ఒకటి ఉండేది. ఒకనాడు ఆ కుటుంబం నుండి ఒక స్త్రీ ఓ ఇంట్లోదొంగతనం చేస్తుంది. తర్వాత ఆ విషయం ప్రజల మధ్యలోకి ఇట్టే విస్తరిస్తుంది. దీనితో ఖురైషీయులు చాలా పరేషానవుతారు. ఏం చేయాలో వారికెవ్వరికీ ఆ సమయాన ఏం తోచలేదు. దీనితో వారందరూ కలిసి ఓసారి చర్చ చేసి, ప్రవక్త  సల్లల్లాహు అలైహి వసల్లం గారితో ఈ విషయాన్ని చర్చించడానికి సిద్ధపడతారు. అది కూడా ఆ తప్పుడు పని గురించి సిఫారిషు కొరకు. అందుచేత ప్రవక్త  సల్లల్లాహు అలైహి వ సల్లం గారి వద్దకు ఎవరినైనా పంపాలని నిర్ణయించుకుంటారు. వెంటనే వారి చూపు ప్రవక్త  ఉసామా(ర)గారిపై పడుతుంది. ఎందుకంటే వేరే ఎవరికీ వారంతాటి ధైర్యం లేకపోయింది. అంతేకాక ప్రవక్త  సల్లల్లాహు అలైహి వ సల్లం గారికి వారిపై కొద్దిగా అభిమానం కూడా ఉండేది కనుక.

      కానీ ప్రవక్త  ఉసామా (ర)గారు, ఈ విషయంలో  జోక్యం చేసుకోదలచలేదు. అంతమంది ఖురైషీయులు ఒత్తిడి చేయడం వలన, ఆయన గారు కాదనలేక,వెళ్లి, సంగతి వివరించి, బతికే దారేదైనా ఉందేమో చూడండి అనేసరికి ప్రవక్త  సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సెలవిచ్చారు:

         “ఏంటి ఉసామా! నీవు నన్ను ఒకరు చేసింది అపకారమని తెలిసి కూడా ,అల్లాహ్ యొక్క హద్దును ఒకరు దాటిన తర్వాత కూడా, వారి కోసం సిఫారిషు చేస్తున్నావా?”

   అలా సెలవిచ్చి, అక్కడ నుంచి వెళ్ళిపోతారు. దాని తర్వాత ప్రవక్త  (స) గారు ప్రజలందరి ముందు నుంచుని, ప్రసంగం చేస్తారు.అందులో ఇలా తెలియజేశారు:

     “ఓ ప్రజలారా! మీ పూర్వీకులు కూడా దీని ద్వారానే మట్టి కొట్టుకుపోయారు. ఎవరైనా గొప్ప వ్యక్తి దొంగతనం చేస్తే, వాణ్ణి వదిలిపెడుతుండేవారు. ఇంకా ఏ పేదవాడు దొంగతనం చేసినా, అతను హద్దు మీరాడని, అతనిపై శిక్షణు జారీ చేసేవారు.

              నేను అల్లాహ్ మీద ప్రమాణం చేసి చెబుతున్నా, ఒకవేళ ముహమ్మద్ (స)గారి కుమార్తె అయిన ఫాతిమా (ర.అ) గారు కూడా చోరీకి పాల్పడినట్లయితే, నేను ఆమె చేయి తీసేయడానికి సైతం వెనుకాడను.”(సహీహ్  బుఖారి :3475)

      దీని గురించి ఒక హదీసు సహీహ్  బుఖారిలో ఇలా ఉంది:

                حَدَّثَنَا قُتَيْبَةُ بْنُ سَعِيدٍ حَدَّثَنَا لَيْثٌ عَنْ ابْنِ شِهَابٍ عَنْ عُرْوَةَ عَنْ عَائِشَةَ رَضِيَ اللَّهُ عَنْهَا أَنَّ قُرَيْشًا أَهَمَّهُمْ شَأْنُ الْمَرْأَةِ الْمَخْزُومِيَّةِ الَّتِي سَرَقَتْ فَقَالُوا وَمَنْ يُكَلِّمُ فِيهَا رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَقَالُوا وَمَنْ يَجْتَرِئُ عَلَيْهِ إِلَّا أُسَامَةُ بْنُ زَيْدٍ حِبُّ رَسُولِ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ فَكَلَّمَهُ أُسَامَةُ فَقَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ أَتَشْفَعُ فِي حَدٍّ مِنْ حُدُودِ اللَّهِ ثُمَّ قَامَ فَاخْتَطَبَ ثُمَّ قَالَ إِنَّمَا أَهْلَكَ الَّذِينَ قَبْلَكُمْ أَنَّهُمْ كَانُوا إِذَا سَرَقَ فِيهِمْ الشَّرِيفُ تَرَكُوهُ وَإِذَا سَرَقَ فِيهِمْ الضَّعِيفُ أَقَامُوا عَلَيْهِ الْحَدَّ وَايْمُ اللَّهِ لَوْ أَنَّ فَاطِمَةَ بِنْتَ مُحَمَّدٍ سَرَقَتْ لَقَطَعْتُ يَدَهَا.     ( صحيح البخاري:٣٤٧٥)

         ఇందులో ఉన్న విషయం ఏమిటంటే, ఆ కాలంలో ఆ కుటుంబపు మహిళ అరబ్ వంశాలలోనే గొప్ప పతివ్రతయై పరిగణింపబడేది. అదే వంశంలోని చాలామంది కాబా వద్ద సేవలు చేసుకుంటూ గడిపేవారునూ. వారి వంశపు స్త్రీని ఇలా అందరి ముందూ, శిక్షించడానికి వారి మనస్సు ఒప్పలేదు. అంతేకాక వారి నుండి చాలామంది ఈ తప్పుని కప్పిపుచ్చేందుకు శతవిధాల ప్రయత్నాలు చేశారు.

          కానీ, ఆఖరికి ఆ స్త్రీ ఇలా చేసినందువలన అందరి ముందు శిక్షించక తప్పలేదు. ఇలా చేయడం పూర్తి ఖురేష్ వంశానికే సిగ్గుచేటుగా మారింది. దీనితో ఇక్కడ,ఒక గొప్ప పాఠం ప్రతి ఒక్కరూ గమనించదగ్గ విషయం. అది దైవ ప్రవక్త (స) గారు వారందరి ముందు ఈ సంఘటన జరిగిన పక్షంలో, న్యాయం ముందు ప్రతి ఒక్కరూ సమానమేనని నిరూపించారు. ఇది ప్రతి ఒక్క మానవునికి ఒక చక్కని సందేశం. ఒకవేళ ఇలా మాత్రం జరగకపోయి ఉంటే గనుక, మనకూ, మన మునపటి వారికి, ఇక తేడా అంటూ ఏమీ ఉండేది కాదు. వారిలాగే మనము అంతమైపోవాల్సి వచ్చేది. కానీ ప్రియ ప్రవక్త (స)గారు చాలా గుండె ధైర్యం కలవారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిజాన్ని, న్యాయాన్ని మాత్రం వదిలేవారు కాదు. దీనితో మనం, ఒకవేళ మన మధ్య సత్యం అనేది నిలవ లేకపోతే ఏ ఒక్కరం మిగలమని గుర్తుంచుకోవాలి! ఇంకా, ఇస్లాం ముందు అందరూ సమానమేనని అర్థం చేసుకోవాలి.

       దైవ ప్రవక్త (స) గారు యావత్ ప్రపంచానికి కనికరమై పంపబడ్డారు. అంతేకాక, సమాజంలో గొప్ప వ్యక్తిత్వం కలిగి, నీతీ, నిజాయితీని సత్యాన్ని నిలబెట్టారు. ప్రియ ప్రవక్త (స) గారు కేవలం మానవుల హక్కులు తీర్చిదిద్దడమే కాక, పశు పక్షుల మధ్య కూడా దయాగుణం కలిగి మెలిగారు. మొత్తానికి తమ జీవితం మొత్తంలో సదా గడపా, గడపా, ఊరూ, వాడా ఇలా ప్రతొక్క చోట వారి సందేశం వెలుగులోకి వచ్చిందనడంలో ఎటువంటి సంశయమూ లేదు.

   కనుక, అల్లాహ్ తఆలా, మన జీవితం మొత్తం ప్రియ ప్రవక్త (స)గారి నడవడికను అనుసరించే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక! ఆమీన్!

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter