మహిళలకు వారి హక్కులు స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయమూనూ!
ప్రియ ప్రవక్త (స)గారు ఈ భూమి మీద అడుగుపెట్టిన యుగాన స్త్రీలు చెప్పలేనంత చిత్రాహింసలు అనుభవిస్తుండేవారు. వారి కొరకు ఏ హక్కు ఉండేది కాదు. ఎక్కడ చూసినా వారి పట్ల అన్యాయాలే తప్ప, ఏ ఒక్కరూ న్యాయం చేయడానికి ముందడుగు కాదు కదా, కనీసం వారి వైపు కన్నెత్తైనా చూసేవారు కాదు. వారికై తగిన న్యాయం గురించి ఆలోచించేవారు కూడా లేకపోయారు. మగవారు వారిని ఒక సామాను వలె చూస్తుండేవారు. ఇష్టమొచ్చిన విధంగా వాడుకుంటూ ఉండేవారు. వారిపై ఆఖరికి దౌర్జన్యాలు చేసి, తమ చేతుల్లో కీలుబొమ్మల్లా ఖబ్జాల్లో ఉంచుకునేవారు.
స్త్రీలకు కనీసం వారసత్వాల్లోనైనా ఏది చేతికి దక్కేది కాదు. భార్యల సంఖ్యకు ఒక హద్దు అనేది ఉండేది కాదు. ఆనాటి మృగాలు పెళ్లిళ్లు చేసుకోవడం, విచ్చలవిడిగా విడాకులతో తెగదెంపులు చేయడం, ఇదే పని! ఒకవేళ ఇలాగే వాళ్ళ అమ్మలు లేదా వారి కుటుంబీకుల ఆడవారి పరిస్థితి అయితే, అప్పుడు తెలిసి వచ్చేది ఆడవారి నరకయాతన, ఎంతటి అన్యాయమోనని. ఆ విషయాల్లో ఆడవారి ఇష్టా అయిష్టాలతో వాళ్లకు ఏ పని ఉండేది కాదు. ఆ తెగదుంపుల్లో కనీసం వాళ్ళవైపు కన్నెత్తైనా చూసేవారు కాదు. వీరికి ఇంతటి అహంకారం వారి తాత ముత్తాతల నుండే వచ్చినది. వాళ్ల సొమ్ము బాగా ఉండేది కనుక, ఎంతటి నీచమైన స్థాయికి దిగజారడానికైనా వారు తప్పక సిద్ధపడేవారు. ఇక అది ఎలానో వారి తండ్రులు చచ్చిన తర్వాత కొడుకులకే వస్తుంది తప్ప, ఆడబిడ్డలకు అణాపైసా కూడా రాదు! కాదు! కాదు! ఆ నీచులు ఇచ్చేవారు కాదు.
‘ఇంతటి నీచమైన బ్రతుక్కన్నా చావడం మేలు! అది ఇది ముమ్మాటికి నిజం.
అంతేకాదు, ఆ యుగంలో అతి ఘోరమైన హింస, అరబ్బులు ఆడబిడ్డలను పుట్టగానే వారిపై సమాధులు కడుతుండేవారు. వారి పుట్టుక ఒక దరిద్రంలా మరియు వారిని పెళ్లి చేసి, అత్తవారింటికి పంపడంలో ఒక సిగ్గుచేటని, వారు బలంగా నమ్మేవారు.
క్రీస్తుశకం 5వ మరియు 6వ యుగంలో యునానివాసులు, రోమ్లు, చైనీయులు, ఆఖరికి మన భారతీయులు సైతం అరబ్బుల కన్నా దరిద్రంగా తయారై ఉండేవారు. మరికొన్ని విషయాల్లోనైతే వారి కన్నా, వీరే స్త్రీలను ఎక్కువ మొత్తంలో హింసిస్తుండేవారు. ఇటువంటి పరిస్థితుల్లో అల్లాహ్ తఆలా మహా ప్రవక్త (స) గారిని ఈ ప్రపంచంలోకి పంపించారు. ఇక పరిష్కార మార్గం ఏదైనా ఉంది అనంటే, అది కేవలం ప్రవక్త (స) గారి ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం సాధ్యమవుతుంది. అది అల్లాహ్ నిర్ణయం.అటువంటి హింసలను తొలగించేసి,ఇక స్త్రీలకంటూ వారి హక్కులనే ఏర్పాటు చేయాలని ప్రవక్త (స) గారు సిద్ధపడ్డారు.
క్రీస్తుశకం 5వ యుగంలోనే, ఆ విదేశీయుల పెద్దవారు, వారి మధ్యే ఒక సమావేశం కుదుర్చుకున్నారు. ఆ సమావేశపు అంశం ‘స్త్రీ అనగా కేవలం ఒక శరీరమేనా? లేక అందులోనూ అంతరాత్మ ఉందా?
ఇలా పొడవాటి చర్చలు, రచ్చలు జరిగిన తర్వాత వచ్చిన తీర్పులో ‘స్త్రీ అంటే కేవలం అందరి ఉపయోగం కొరకు వాడబడే ఒక శరీరం మాత్రమేనని మరియు వారు కేవలం నరకానికి మాత్రమే సృష్టించబడ్డారని, వాళ్ళకి వాళ్లే వెల్లడించుకున్నారు.
అంతేకాక 1958లో ఫ్రాన్స్ దేశంలో జరిగిన సమావేశంలోని తీర్పూ అలానే ఉంది: స్త్రీలు అంటే మానవులే కానీ, వారు కేవలం పురుషుల సేవల కోసం మాత్రమేనని వెల్లడించుకున్నారు.
ఇలా గుండేది! ఆ కాలంనాటి పరిస్థితి! స్త్రీలను గుర్తించని సమాజం, అసలు ఒక సమాజమేనా? అసలు ఆ సమాజము కూడా ఎక్కడి నుంచి పెంచి పోషించబడిందని కనీసం ఏ ఒక్కరైనా ఆలోచించరా!
ప్రియ ప్రవక్త (స) గారు స్త్రీల గురించి చాలా క్లుప్తంగా, ఇంకా వారితో పాటు సమానత్వ గుణంతో మెలగాలని, వివరించారు. వారి గురించి ఒక గొప్ప హదీస్ కూడా ఇలా ఉంది:
حديث أبي هريرة قال: قال رسول الله ﷺ: "أكمل المؤمنين إيماناً أحسنهم خلقاً، وخياركم خياركم لنسائهم"[1]، رواه الترمذي وقال: حديث حسن صحيح
"పూర్తి విశ్వాసులు అనగా మీలో మంచి నడవడికను కలవారే. మీలో ఉత్తములు తమ భార్యల పట్ల ఉత్తమంగా ప్రవర్తించే వారు మాత్రమే.”(తిర్ముథీ)
ప్రియ ప్రవక్త (స) గారు ఇలానే ఇంకో హదీస్ లో కూడా తెలిపారు:
عن عائشة-رضي الله عنها- قالت: قال رسول الله -صلى الله عليه وسلم-: «خيرُكم خيرُكم لأهله، وأنا خيرُكم لأهلي»
(صحيح البخاري)
“మీలో ఉత్తముడు, తమ కుటుంబానికి ఉత్తమంగా ప్రవర్తించేవాడు; అలానే, నేను నా కుటుంబానికి ఉత్తముడిని."(సహీహ్ బుఖారి)
ఇక ఆలస్యం దేనికి, ఇంతగా మన ముందు ఇన్ని దారులు తెరిచి ఉన్నాయి. కనుక, వీటిని సద్వినియోగం చేసుకొని ఈ లోకంలో, ముఖ్యంగా మహిళలకై, శాంతిని, సుఖాన్ని విస్తరింపజేద్దాం. వారికి వారి హక్కులను అందజేద్దాం. మనమూ సుఖపడదాం, వారిని కూడా సుఖపెడదాం.
స్త్రీల గురించి పవిత్ర గ్రంథమైన ఖురాన్ లో కూడా స్త్రీల పట్ల నిజాయితీగా ఉండాలని ఆదేశాలూ ఉన్నాయి. అందులో అన్నిటికన్నా ముఖ్యమైనది సురహ్ నిసాఅ్ యొక్క 19వ శ్లోకంలో ఇలా ఉంది. అల్లాహ్ తఆలా ఇలా తెలియజేస్తున్నారు:
وعاشروهن بالمعروف. {النساء:19}.
“మరియు మీరు వారితో గౌరవంతో సహవాసం చేయండి”. !
ప్రియమైన సహోదరులారా, ఇక దేనికి ఆలస్యం, మానవుడు అనగా, వాడితో జరిగే తప్పులు జరగడం సహజం. అలాగని ఎల్లప్పుడూ తప్పులు చేస్తూ ఉండడం బుద్ధిహీనం. కనుక చేసిన తప్పులను ‘తౌబా’ ద్వారా తొలగొట్టి ఒక కొత్త జీవితాన్ని నేటి నుండి సృష్టించుకుందాం.
ఇన్షా అల్లాహ్….


