రమదాన్ మాసాన్ని ఎలా స్వాగతించాలి
అనంత కరుణామయుడు అల్లాహ్ తఆల, మానవాళికి ప్రసాదించిన గొప్ప గొప్ప మాసాల్లోకన్నింటికీ అత్యంత పవిత్రమైన మాసం, రంజాన్ మాసం. దీన్ని ముస్లింలు నిండు మనసు హర్షంతో స్వాగతిస్తారు. దాదాపు రెండు నెలల ముందు నుండే మసీదుల్లో, మద్రాసాలల్లో, ఇస్తేమాలల్లో, ఇలా రకరకాల చోట్ల ఈ దివ్య మాసపు ప్రసంగాల కేరింతలు చెలరేగుతాయి. సంవత్సరంలో ఒక్కసారి వచ్చే ‘రోజాల మాసం” కదా! ఆ మాత్రం తప్పక ఉండాలి. కానీ ఈ దివ్య మాసాన్ని స్వాగతించడంపై తప్పక ఒక కన్ను వేసి తీరాలి. కేవలం సంబరాలు చేసుకుంటూ ఆహ్వానం పలకడం వల్ల ఎటువంటి ప్రయోజనమూ, ఏ లాభమూ లేదు. ఉండదు కూడానూ. ఈ మాసానికి తప్పక మన మది మనసుల్లో జాగా ఇచ్చి తీరాలి. మర్యాదపూర్వకంగా ఆహ్వానించాలి. అప్పుడే దీని హక్కు అదా అవుతుంది.
మామూలుగా స్వాగతం అనేది రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది, బాహ్య స్వాగతం. రెండవది, అంతర స్వాగతం. ఇక బాహ్య స్వాగతాలు అనగా మన రోజు వారి దినాల్లో ప్రజలు ఎన్నో సంబరాలు చేస్తూ రకరకాల సందర్భాల్ని స్వాగతిస్తుంటారుఇక రెండవది అంతర స్వాగతం అంటే దేన్నైనా హృదయపూర్వకంగా స్వీకరించి ఆహ్వానించడం. ఇకపోతే, ఇస్లాంలో ప్రతి కార్యాన్ని, ప్రతి విషయాన్ని, హృదయపూర్వకంగా అదా చేసి తీరాలి. ఇంకా, రంజాన్ మాసం ప్రతి సంవత్సరం వచ్చేదే కదా అని, దానిని చిన్న చూపుతో తీసిపారేయకూడదు. దానికి కారణం, ఈ ప్రపంచంలో దాని విశిష్టతను మించినది ఏదీ లేదు కాబట్టి..
కనుక, ప్రతి రంజాన్ మాసం దేవుని తరపు నుండి ఒక విలువైన వరం. వరాన్ని కోరని వాళ్ళు ఎవరు ఉండరు కూడా. ఈ మాసంలోనికి ప్రవేశించక ముందే తమతమ ఆలోచనల్ని తాజా చేసుకుని ఈర్ష్యలు, ద్వేషాలను మనసుల నుండి తొలగించి తీరాలి. ఈ రోజాల మాసం ఒక విధంగా పరస్పర ప్రేమాభిమానాలను పంచే దివ్యమైన మాసం. ప్రియ ప్రవక్త (స)గారు రంజాన్ మాసం పొందడం కోసం అల్లాహ్ తో ప్రార్థించేవారు: “ఓ అల్లాహ్ మమ్మల్ని రంజాన్ మాసం వరకు చేర్చు” అని. అది కూడా రజబ్,షాబానుల నెలవంకను చూసినప్పటినుంచే ప్రార్థించే వారు. ఇంకా ఈ ‘వరాల వసంతాని’కి స్వాగతం పలకడానికి, ముందు నెల అయినా షాబాన్ నుండే అందరూ సిద్ధంగా ఉండాలని ఉపదేశించారు.
దీని విశిష్టతను గురించి ప్రవక్త (స) గారి అనుచరులైన సల్మాన్ ఫార్సీ (ర) గారి కథనం మేరకు దైవ ప్రవక్త (స) గారు ప్రజలతో, వరాల వసంతమైన రంజాన్ గురించి షాబాన్ యొక్క ఆఖరి రోజున కూడా ఇలా సెలవిచ్చారు: “ఓ ప్రజలారా! ఇక మీ ముందు రాబోయే మాసం, ఒక వరాల వసంతం, గొప్ప గొప్ప విశిష్టతలను, పుణ్యాన్ని కలిగినది. దీని విశిష్టతను గురించి అర్థం చేసుకోవాలనుకునేవారు, ఇందులో దాగి ఉన్న ఒక రాత్రిని ఉదాహరణగా తీసుకుంటే చాలు! ఆ రాత్రి విలువ 100 రోజులు కాదు! 1000 రోజులు కాదు! ఏకంగా 1000 నెలల కన్నా శ్రేష్టమైనది!”.
ఇంకా ఇలా కూడా సెలవిచ్చారు: “శుభప్రదమైన నెల రాబోతోంది. అందులో రోజాలను కూడా అల్లాహ్ తఆలా మీపై విధిగా నిర్దేశించారు. ఇంకా రంజాన్ మాసంలో స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. నరక ద్వారాలు మూసుకుంటాయి. సైతానుల సంకెళ్ళతో బంధీలవుతారు. ఇంకా వెయ్యి నెలల కన్నా శ్రేష్టమైన రాత్రి, ఈ మాసంలో దాగుంది. విశ్వాసంతో ఉత్సాహంగా హృదయపూర్వకంగా దీనికి స్వాగతం పలికే వారు, ఎంతో అదృష్టవంతులవుతారు. ఇంకా ఈ నెలలో ఏ ఒక్క సత్కార్యం చేసినా, దానికి ఫలంగా డెబ్బై మాసాల ఫలితం లభిస్తుంది” అని పేర్కొన్నారు.
రంజాన్ మాసంలో ఏం చేయాలి?
అల్హందులిల్లాహ్! రంజాన్ మాసం వచ్చీ రాగానే, ముస్లింల ఇండ్లలో ఖురాన్ పారాయణాలు తాజాగా, ఒక కొత్త ఉత్సాహంతో, ఒక కొత్త ఉల్లాసంతో కొనసాగించబడతాయి. ‘తరావీహ్’ మరియు ‘తహజ్జుద్’ నమాజులలో కూడా ఖురాన్ పారాయణాన్ని పొడిగిస్తారు. చదవడంతో పాటు, ఖురాన్ ను వినడానికి కూడా అంతే ప్రాముఖ్యత, విశిష్టత ఉంది. ఖురాన్ పారాయణం చేయడం మరియు ఇతరులకు వినిపించడం అనేది, గొప్ప ప్రోత్సహించదగ్గ విషయం. కానీ, నేటి సమాజంలో ఖురాన్ చదవడానికి రాని ప్రజలు ఎంతమంది ఉన్నారో ఆలోచించాలి. చదవడానికి వచ్చినా, ఎంతమంది సరిగ్గా చదువుతున్నారో ఆలోచించాలి. ఎంత మంది దాని అర్ధాన్ని ఆలోచించి చదువుతారో, గమనించి తీరాల్సిన పరిస్థితి ఎదురైంది. కనుక, ఇలాంటి వారి కోసం ప్రతి చోట, ప్రతి మసీదు యందు ప్రత్యేకంగా ‘మకాతిబ్’లను నిర్మించి ఖురాన్ విద్యను కూడా నేర్పించాలి. అప్పుడే ఇస్లాం సమాజం ఖురాన్ వెలుగుతో నిండి, అసలైన ముస్లిం సమాజంగా ఏర్పడుతుంది. రంజాన్ ముబారక్ సందర్భంగా, కొద్దిపాటి మసీదుల యందు తరావీహ్ నమాజ్ లో ఒకటి లేదా రెండు రోజులకు, ఒక ఖురాన్ ముగించేలా చదువుతుంటారు. ఈ విధంగా చదివితే ఖురాన్ హక్కు మాత్రం, అస్సలు అదా అవ్వదు! ఖురాన్ పారాయణం చేసేటప్పుడు, చదవడంలో తప్పులను ధ్యాస పెట్టకపోవడం చాలా పెద్ద తప్పు.
దివ్య ఖురాన్ పారాయనపు ముఖ్య ఉద్దేశం, ఒకరి వ్యక్తిత్వాన్ని సరిదిద్దడం! ఇక మన వ్యక్తిత్వం ఎంతవరకు సరి అవుతుందో, గమనించి తీరాలి. ఇంకా మనసు ఉద్దేశం పై నుండి మల్లకూడదు. ఈ మాసంలో ఖురాన్ అవతరించినందున అల్లాహ్ తఆల దాని కృతజ్ఞతాపూర్వం కొరకై, మనపై ఉపవాసాలను విధిగా నిర్దేశించారు. ఇకపోతే, ముస్లింలు పగటిపూట ఉపవాసం పెడతారు. అది మామూలు విషయం. దాని ద్వారా ఆత్మశుద్ధి కలుగుతుంది. ఇంకా భగవంతుని వద్దకు చేరువయే అవకాశం దక్కుతుంది. ఇంకా రాత్రులు తరావీహ్ నమాజ్ చదవడం వలన మరింత ఆత్మకు శుద్ధి దక్కుతుంది. ఇందువలనే ఉపవాసులు ముఖ్యంగా ఈ మాసపు రాత్రుల్లో అల్లాహ్ వైపునకు ప్రాముఖ్యతను ఇచ్చి తీరాలి. ఇంకా దీని ద్వారా ముస్లింలకు అల్లాహ్ యొక్క అసలైన బానిసలనే తాజా స్పర్శ కలుగుతుంది మరియు ఈ విశిష్టత కొరకే ప్రియ ప్రవక్త ‘మహమ్మద్’ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, దీనికి ‘సున్నత్’ యొక్క స్థానాన్ని కల్పించారు. ఈ పవిత్ర మాసంలో సత్కార్యాలకు ఎన్నో రెట్లు అధిక ఫలం దక్కుతుంది. ఈ శుభవార్తని దైవ ప్రవక్త సల్లలాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా వినిపించారు: “ఈ పవిత్ర మాసంలో ఒక ఫర్జ్ అదా చేస్తే, దానికి 70 ఫర్జులు అదా చేసినంత పుణ్యం దక్కుతుంది! ఇంకా ఒక నఫిల్ అదా చేస్తే ఒక ఫర్జ్ అమలు చేసినంత పుణ్యం! ఈ మాసంలో దానధర్మాలు చేసినా, ఒక ఫర్జ్ అమలు చేసినంత పుణ్యం లభిస్తుంది . ఇంకా ఇది ఓపిక పట్టాల్సిన మాసం”.
ఓపిక సహనం కలిగి ఉండడం మనం అల్లాహ్ ప్రీతి కోసం, ఆయన రాజీ కోసం, మన ప్రాపంచిక ఉద్దేశాలను, మనసుకు నచ్చిన వాటిని వదులుకుంటూ, కొన్ని కష్టాలు ఉన్న వాటిని సైతం ఎదుర్కొంటూ, సహనం పాటించడం ఎంతో ఉత్తమం మరియు ఇలా చేయడం వల్లే స్వర్గం దక్కనుంద’ని కూడా ఉపదేశించారు.
(షాబుల్ ఈమాన్:5/223)
పై హదీసులో స్వర్గపు శుభవార్త ఇవ్వబడింది. అదే కాక దివ్య ఖురాన్ లో అల్లాహ్, సహనం పాటించే వారికి తన తోడుని ప్రసాదిస్తాడని తెలిపారు. ఇక అంతకంటే గొప్ప శుభవార్త ఏదైనా ఉంటుందా? దీని గురించి దివ్య ఖురాన్ లో ఇలా ఉంది:البقرة:١٥٣) “ان الله مع الصابرين)”
“నిశ్చయంగా అల్లాహ్ సహనం గలవారితో ఉంటాడు”.
(అల్ బఖరహ్ :153)
ఈ శ్లోకం విశ్వాసుల గురించి తెలుపుతూ మొదలుపెట్టబడింది. “ఓ విశ్వాసులారా! సహనం మరియు నమా'జ్ ద్వారా సహాయం అర్థించండి. నిశ్చయంగా అల్లాహ్ సహనం గలవారితో ఉంటాడు.”
ఇక్కడ అల్లాహ్ తోడు అనగా మద్దతు! ఆ మద్దతు ఒకరి కార్యాలను బట్టి ఉంటుంది. ఆ మద్దతు మనం ఊహించని తరపు నుండి కూడా రావచ్చు. ఒక్కోసారి దాన్ని మనం గమనించవచ్చు! నమాజు వలన అల్లాహ్ తో సంబంధం కలుగుతుంది. దేవునికి అతి దగ్గరగా చేరువవుతాము. దీనితో దేవుని పట్ల విశ్వాసం మరియు భరోసా పెరిగి ఎంతటి ఆపదలు వచ్చినా, ఇట్టే పరిష్కరించుకో గలుగుతాం. ఇంకా దుర్ఘటనలు, బాధలు సంభవించినప్పుడు పాటించే సహనం, ఎంతో మిన్నది! దాంతో గొప్ప మద్దతు తప్పక దక్కుతుంది. ఒకవేళ ఆ సహనంలో ప్రాపంచిక ఉద్దేశాలు ఏవైనా ఉంటే ఆ మద్దతు అస్సలు దక్కదు. ఇంకా సహనం కలిగి ఉన్న వారిని ఎవరూ, ఏ విషయంలోనూ అస్సలు మించలేరు. మొత్తంగా నమాజ్ మరియు సహనం వలనే ఆత్మకు అటువంటి శక్తి దక్కుతుంది! ఈ రెండు ఒక మానవుణ్ణి చక్కగా సరిదిద్దుతాయి. ఒకవేళ ఎక్కడైనా అటువంటి వారు ఓటమిని చెవి చూడాల్సి వచ్చినా, అల్లాహ్ తఆలా వారిపై రాబోయే రోజుల్లో, వరాల వర్షాన్ని తప్పక కురిపిస్తాడు. ఇకపోతే రోజా (ఉపవాసం) కూడా ఒక విధంగా గొప్ప సమానమే.
‘నిరంతర చింతన’ తో దేవునికి చేరువవటమే, ఉపవాసపు అంతిమ లక్ష్యం. ఈ స్థితిని అరబిక్ లో ‘తఖ్వా’ అని అంటారు. ఈ ‘తఖ్వా’ ను పొందడం పెద్ద కష్టమేమీ కాదు. ఇతరుల పట్ల మంచిగా ప్రవర్తిస్తూ, బాధా సమయాల్లో ఒకరినొకరు ఓదారుస్తూ, ఆపదలో చిక్కుకున్న వారి మనసుపై ప్రేమతో అల్లాహ్ పట్ల భరోసాని నింపుతూ, డబ్బు అవసరం ఉన్న వారికి డబ్బుతో ఆదుకోవడం, అటువంటి విషయాల ద్వారా తఖ్వా అనేది మనసులో నిండుతుంది. ఒక పవిత్ర హదీసు కథనం మేరకు ఇలాగుంది: “ఇతరుల పట్ల సుగుణాలతో మెలిగిన వారు అల్లాహ్ యొక్క అత్యంత గొప్ప ప్రేమను పొందేవారు అవుతారు”!.
“ఇంకా ఎవరైనా తమ సహోదరుడిని ఆపదలో ఆదుకున్నట్లయితే అతన్ని అల్లాహ్ తఆలా ప్రపంచంలో మరియు ఆఖిరత్ లో, రెండు చోట్లా ఆదుకుంటాడు. ఇంకా ఈ సహాయం తన సోదరుని సహాయపు సమయానికి సమానమై అతనికి దక్కుతుంది”.
(షాబుల్ ఈమాన్:9/523)
రంజాన్ మాసంలో ఉపవాసులకు ఇఫ్తార్ తినిపించడంలో గొప్ప పుణ్యం దాగుంది. దీని గురించి ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా ఉపదేశించారు: “ఎవరైనా ఒక ఉపవాసికి ఇఫ్తార్ చేయిస్తే, దానికి ప్రతిఫలంగా అల్లాహ్ తఆలా అతని పాపాల్ని మన్నించి, నరక దండన నుండి దూరం చేస్తాడు. ఇంకా విచిత్రమైన విషయం ఏమిటంటే, ఇఫ్తారీ చేయించిన వారికి కూడా, రోజా పుణ్యాన్ని ఏమాత్రం తక్కువ చేయకుండా అందివ్వబడుతుంది”!.
(షాబుల్ ఈమాన్:5/223)
దీనితో ప్రియా ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం గారి అనుచరులు తమ స్థితిని గురించి ఆలోచించారు. వారు బీదవారు. ఒకరికి ఇఫ్తారీ చేయించేందుకు మరియు దానికి సరిపడినంత పైకమూ, వారి వద్ద ఉండేది కాదు. ఇకదైనందున ఒకసారి ఈ స్థితిని ప్రియ ప్రవక్త సల్లలాహు అలైహి వసల్లం గారి ముందు వారు పెట్టి ఇలా అడగసాగారు: ఓ ప్రవక్త (స)ఈ ఇఫ్తారీ పుణ్యం ప్రతి ఒక్కరూ చేజిక్కించుకోవాలనే ఉన్నారు. కానీ, మాకు దానికి సరిపడినంత డబ్బు లేదన్న విషయం మీకు బాగా తెలిసినదే. ఇక మేము ధనవంతులవకపోతే తప్ప, ఆ పుణ్యాన్ని చేజిక్కించుకోలేమా? ఇలా అడగసాగారు. ఇదంతా దైవ ప్రవక్త (స) గారికి తెలిసినదే. ఎందుకంటే ఆయన గారు ఒక బీదవారై మరియు బీద వారితోనే మొత్తం పుణ్య పవిత్ర జీవితాన్ని గడిపారు. అందుకు ప్రతొఒక్కరినీ దృష్టిలో పెట్టుకుని, అందరికీ సమ్మతమైన అంశాన్నే ఇలా సెలవిచ్చారు: “ఒక ఉపవాసకి ఎవరైనా పాలు లేదా ఖర్జూర లేదా ఆఖరికి ఒక్క గుటక నీరు ఇచ్చైనా ఇఫ్తారీ చేయిస్తే గనుక, వారు ఆ పుణ్యానికి అర్హులవుతారు”!.(షాబుల్ ఈమాన్:5/223)
ఈ జవాబు వినగానే అనుచరులందరి హర్షానికి హద్దులు లేవు. చాలా ఆనందపడ్డారు ఇంకా ప్రియ ప్రవక్త సల్లలాహు అలైహి వసల్లం గారు ఇలా కూడా సెలవిచ్చారు: “ఎవరైనా ఒక ఉపవాసకి కడుపునిండా భోంచేపిస్తే, ప్రళయ దినాన, హశర్ మైదానం నుండి స్వర్గంలో ప్రవేశించే దాకా, నా ‘హౌజే కౌసర్’ ద్వారా తన కడుపు నింపబడుతుంది. ఇంకా అతనికి స్వర్గంలో ప్రవేశించేంతవరకు అస్సలు దప్పికే కలగదు”.
(షాబుల్ ఈమాన్:5/223)
ఈ పవిత్ర మాసంలో 30 లేదా 29 దినాలు మూడు రకాలు కలవు. ఈ పూర్తి మాసమే ఒక వరాల వర్షం.మొదటి పది దినాలు అల్లాహ్ తఆలా కరుణించే దినాలు. ఇంకా మధ్య పది దినాలు పాపక్షమాపణవి మరియు ఆఖరివి నరక దండన నుండి స్వతంత్రాన్ని దక్కించేవి.(షాబుల్ ఈమాన్:5/223)
ఇక దేనికి ఆలస్యం, మానవుడు అనగా, వాడితో జరిగే తప్పులు జరగడం సహజం. అలాగని ఎల్లప్పుడూ తప్పులు చేస్తూ ఉండడం బుద్ధిహీనం. కనుక చేసిన తప్పులను ‘తౌబా’ ద్వారా తొలగొట్టి ఈ సరికొత్త రంజాన్ ని, ఒక కొత్త జీవితం తో, నేటి నుండి సృష్టించుకుందాం.
ఇన్షా అల్లాహ్….


