ఇస్లాంపై అపోహాలు: జిహాద్ అంటే ఏమిటి?

“జిహాద్” అనే పదం వినగానే ఈ రోజుల్లో చాలా మంది భయపడటమే కాకుండా,ముస్లిములు తీవ్రవాదులని తప్పుగా అర్థం చేసుకుంటారు.  ఖురాన్ మరియు ప్రవక్త ﷺ గారు బోధించిన “జిహాద్”కు, ఈ రోజుల్లో విస్తరించే అర్థానికి చాలా తేడా ఉంది. జిహాద్ అంటే నిజంగా యుద్ధమేనా? లేక మనలోనే నడిచే ఒక నిశ్శబ్ద పోరాటమా. మన బలహీనతలతో జరిగే యుద్ధమా? ఈ డిజిటల్ ప్రపంచంలో, వార్తల్లో, సోషల్ మీడియాలో వినిపించే “జిహాద్” అర్థాలు కేవలం అపోహాలు మాత్రమే. నిజానికి, జిహాద్‌ అంటే కేవలం యుద్ధం మాత్రమేనా? అస్సలు కాదు. ఇది అంతకంటే గొప్పగా, మనిషిని తన అంతర్గత శత్రువులపై గెలిపించి, ఉన్నత వ్యక్తిత్వానికి తీసుకెళ్లే ఒక సున్నితమైన మరియు శక్తివంతమైన ప్రయత్నం

అంతేకాకుండా, అల్లాహ్ తమ పవిత్రమైన ఖురాన్ లో జిహాద్ అనే పదం చాలా చోట్ల ఉపయోగించాడు. ఉదాహరణకి ,

(وَجَاهِدُوا فِي اللَّهِ حَقَّ جِهَادِهِ)

(అల్లాహ్‌ మార్గంలో పోరాడవలసిన విధంగా ధర్మపోరాటం చేయండి) — (సూరహ్ అల్-హజ్ 22:78)

మరొక చోట:

(وَالَّذِينَ جَاهَدُوا فِينَا لَنَهْدِيَنَّهُمْ سُبُلَنَا)

( ఎవరైతే మా కొరకు హృదయ పూర్వకంగా పాటుపడతారో, వారికి మేము మా మార్గాల వైపునకు మార్గదర్శకత్వం చేస్తాము) — (సూరహ్ అల్-అంకబూత్ 29:69)

జిహాద్ నేపథ్యం

జిహాద్ గురించి తెలియాలంటే ముందు దాని యొక్క నేపథ్యం గురించి తెలుసుకోవాలి.  అరబీ భాషలో “జిహాద్” అనే పదానికి అసలు అర్థం “శ్రమించడం”, “ప్రయత్నించడం”, “పాటుపడడం”.  అయితే జిహాద్ కు కేవలం “పవిత్ర    యుద్ధం” అనే అర్థం మాత్రమే అంకితం కాదు. వాస్తవానికి జిహాద్ అంటే, ఎవరైనా తప్పు మార్గంలో ఉన్నప్పుడు అతనిని మంచి దారిలోకి తీసుకురావడానికి ప్రయత్నించడం కూడా జిహాద్‌గా భావించవచ్చు. అంటే, ఇది మనలోని చెడు అలవాట్లతో పోరాడటం కూడా కావచ్చు. మరియు ఖురాన్ (సూరా 2:256) లో  స్పష్టంగా చెబుతుంది: (لَا إِكْرَاهَ فِي الدِّينِ) “మతంలో ఎటువంటి బలవంతం లేదు”. అంటే, ఇస్లాం మతాన్ని ఎవరిపైనైనా రుద్దడం,  మతం మార్చించడం, అస్సలు సరికాదు.

ఇస్లాం యొక్క  చట్టం ప్రకారం చూస్తే, జిహాద్, యుద్ధం అనేది కేవలం రక్షణ కోసం మాత్రమే.అంతేగాకుండా ఎవరికైనా అన్యాయం జరిగితే, దాన్ని ఆపడానికి మాత్రమే యుద్ధం చేయాలి. మరియు ప్రవక్త యొక్క కాలంలో ముస్లింలపై ఎందరో ముస్లిమేతరులు దాడి చేసేవారు అయితే వారినుంచి రక్షణ పొందడానికి మరియు ఇస్లాం మతమును కాపాడటానికి  అల్లాహ్ జిహాద్ ను ఆజ్ఞపించాడు. అంతేగాకుండా ఇస్లాం మతంలో ఒక్క వ్యక్తి లేదా చిన్న గుంపు తమ ఇష్టం వచ్చినట్టు యుద్ధం చేయలేరు. అది ఒక ప్రభుత్వ నిర్ణయం కావాలి.

ఖురాన్ ఇంకా చెబుతుంది:( وَقَاتِلُوا فِي سَبِيلِ اللَّهِ الَّذِينَ يُقَاتِلُونَكُمْ وَلَا تَعْتَدُوا ۚ إِنَّ اللَّهَ لَا يُحِبُّ الْمُعْتَدِينَ)

(మీతో, పోరాడేవారితో, మీరు అల్లాహ్‌ మార్గంలో పోరాడండి, కాని హద్దులను అతిక్రమించకండి.అల్లాహ్ హద్దులు దాటేవారిని ఇష్టపడడు) — (సూరహ్ అల్-బఖరా 2:190) 

అయితే ఈ శ్లోకం ద్వారా తెలియబడుతున్నదేమనగా ఇస్లాంలో జిహాద్ అనేది హింస కాదు, నియమాలు పాటించే పని.

ఖురాన్‌లో జిహాద్ సూచనలు

జిహాద్ గురించి ఖురాన్ ఏమి చెబుతోంది? కొన్ని ముఖ్యమైన వచనాల ద్వారా అర్థం చేసుకుందాం.అయితే  దివ్య ఖురాన్‌లో “జిహాద్” అనే భావం ఒక్క యుద్ధానికి మాత్రమే పరిమితం కాదు. ఇది రెండు ప్రధాన భాగాలుగా అర్థం కలిగి ఉంది:

1) బయటి రక్షణ (యుద్ధం అవసరమైనప్పుడు మాత్రమే)

2) అంతర్గత పోరాటం (జిహాద్ అన్-నఫ్స్)

1) రక్షణ కోసం జిహాద్ : ప్రవక్త గారి కాలంలో చాలా మంది ఇస్లాం శత్రువులు ముస్లిం సహచరులపై దాడి చేసే వారు అంతేగాకుండా వారు ప్రవక్త ముహమ్మ గారి పై కూడా కక్షపెట్టి యుద్ధాలను ప్రారంబిభించేవారు. అయితే అలాంటివారి నుంచి విముక్తి పొందటానికి అల్లాహ్ వారితో యుద్ధం చేయమని ఆదేశించాడు  మరియు అల్లాహ్ ఖురాన్ లో సూరహ్ అల్-బఖరా (2:190): ఇలా అన్నాడు:

(وَقَاتِلُوا فِي سَبِيلِ اللَّهِ الَّذِينَ يُقَاتِلُونَكُمْ وَلَا تَعْتَدُوا ۚ إِنَّ اللَّهَ لَا يُحِبُّ الْمُعْتَدِينَ)

అర్థం: (మీతో యుద్ధం చేసే వారితో మాత్రమే పోరాడండి, కానీ హద్దులు దాటవద్దు)

ఇస్లాంలో యుద్ధం కూడా నియమాలతో ఉంటుంది. ప్రవక్త ﷺ గారు యుద్ధానికి పంపే ముందు వీటిని స్పష్టంగా చెప్పేవారు:

  • మహిళలను, పిల్లలను హాని చేయొద్దు
  • వృద్ధులను చంపొద్దు
  • చెట్లు నరకొద్దు, పంటలను నాశనం చేయొద్దు
  • ఎలాంటి కీడు తలపెట్టవద్దు

ఒక హదీస్‌లో ప్రవక్త ﷺ ఇలా చెప్పారు:

"మహిళలను, పిల్లలను చంపవద్దు" (సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం)

అయితే జిహాద్ అనేది అంధ హింస కాదు, నియంత్రణతో కూడిన రక్షణ చర్య.

చరిత్రలో కూడా, యుద్ధాల్లో ముస్లింలకు ముందుగా దాడి చేయకుండా, శాంతి అవకాశాన్ని ఎదుటివారికి ఇవ్వమని ఆదేశించబడింది.

  • మరొక శ్లోకం లో సూరహ్ అల్-అన్ఫాల్ (8:61) ఇలా అల్లాహ్ తఆలా అన్నాడు :

(وَإِن جَنَحُوا لِلسَّلْمِ فَاجْنَحْ لَهَا وَتَوَكَّلْ عَلَى اللَّهِ )

అర్థం: (వారు శాంతి కోరితే, నువ్వూ శాంతిని అంగీకరించు)

ఈ శ్లోకం స్పష్టంగా చెబుతుంది ఏమనగా,  శత్రువు యుద్ధం ఆపి శాంతి కోరితే, వెంటనే శాంతిని అంగీకరించాలి. ప్రతీకారం కోసం యుద్ధం కొనసాగించడం ఇస్లాం మతంలో  అనుమతించబడదు. అంతేగాకుండా ప్రవక్త ﷺ జీవితం లో కూడా ఇదే కనిపిస్తుంది. ఉదాహరణకు, హుదైబియా ఒప్పందం సమయంలో నియమించుకున్న ఒప్పందాలు ముస్లింలకు అనుకూలంగా లేకపోయినా, ప్రవక్త ﷺ శాంతిని ఎంచుకున్నారు. అది తాత్కాలికంగా కష్టం అనిపించినా, తరువాత అది పెద్ద విజయంగా మారింది.

మరొక హదీస్‌లో ప్రవక్త ﷺ ఇలా చెప్పారు:

(لاَ تَمَنَّوْا لِقَاءَ الْعَدُوِّ، وَسَلُوا اللَّهَ الْعَافِيَةَ، فَإِذَا لَقِيتُمُوهُمْ فَاصْبِرُوا)

అర్థం: శత్రువును ఎదుర్కోవాలని ఆశపడకండి; అల్లాహ్‌ను శాంతి కోసం అడగండి." (సహీహ్ బుఖారీ)

అయితే ఇస్లాం మతం లో యుద్ధాలు, హింసలు  లక్ష్యం కాదు, చివరి సన్మార్గం మాత్రమే. అవకాశం ఉంటే ఎప్పుడూ శాంతినే ముందుగా ఎంచుకోవాలి.

2) జిహాద్ అన్-నఫ్స్ (మనసుతో పోరాటం)

ఈ డిజిటల్ యుగంలో మనిషి ఇతరులతో కాకుండా, తన కోరికలతోనే ఎక్కువగా ఓడిపోతున్నాడు. అధిక ఆశలు, కోపం, , అలవాట్లు ఇవే ఇప్పుడు నిజమైన యుద్ధభూములు, శత్రువులు. మొత్తాని ఒక మనిషి ఈ భూమి మీద ఎందుకున్నాడో కూడా మర్చిపోయాడు.  అంతేగాక ప్రవక్త ముహమ్మద్ నేర్పిన బోధనలు అయన ఇస్లాం కోసం పడిన కష్టాలు ఈ కాలం యొక్క మనుషులు మర్చిపోయారు.

ఖురాన్‌లో “జాహిదూ”  అనే పదం మనిషి తనలోని చెడు లక్షణాలపై పోరాడాలని సూచిస్తుంది.

అల్లాహ్ సూరహ్ అల్-అంకబూత్ (29:69) లో ఇలా పలికాడు :

(وَالَّذِينَ جَاهَدُوا فِينَا لَنَهْدِيَنَّهُمْ سُبُلَنَا)

(మా కోసం ప్రయత్నించే వారికి మేము మార్గాలు చూపుతాము)

అర్థం:కోపం, అహంకారం, లోభం వంటి వాటిని జయించడం, మంచి మార్గంలో నిలబడటం తప్పు చేయకుండా తనను తాను నియంత్రించుకోవడం దీని తాత్పర్యం.

మరియు ప్రవక్త మొహమ్మెద్ ﷺ ఇలా చెప్పారు:

( لَيْسَ الشَّدِيدُ بِالصُّرَعَةِ، إِنَّمَا الشَّدِيدُ الَّذِي يَمْلِكُ نَفْسَهُ عِنْدَ الْغَضَبِ)

అర్థం: బలవంతుడు అనేవాడు పోరులో గెలిచేవాడు కాదు; కోపం వచ్చినప్పుడు తనను నియంత్రించేవాడే నిజమైన బలవంతుడు. (సహీహ్ బుఖారీ, సహీహ్ ముస్లిం)

యుద్ధ జిహాద్‌పై ఉన్న అపోహాలు మరియు జిహాద్‌ను తప్పుగా ఉపయోగించడం:

ఈ రోజుల్లో “జిహాద్” అనే పదాన్ని ఎక్కువగా హింస, ఉగ్రవాదం, అంధ యుద్ధంతో కలిపి చూస్తున్నారు. ముఖ్యంగా మీడియా మరియు సోషల్ మీడియాలో, ఈ పదాన్ని సరైన అర్థం లేకుండా వాడటం వల్ల ఈ అపోహలు పెరుగుతున్నాయి. కానీ ఖురాన్ మరియు సహీహ్ హదీస్ ప్రకారం, జిహాద్ ఎప్పుడూ అన్యాయ హింసను అనుమతించదు.

ఉదాహరణకు అల్లాహ్ ఖురాన్లో ఇలా సెలవిచ్చాడు:

(لَا إِكْرَاهَ فِي الدِّينِ) (2:256)

“మతంలో బలవంతం లేదు.”

ఈ శ్లోకం చెప్పేది ఏమిటంటే, ఇస్లాం మతంలో ఎవరికీ బలవంతంగా మతం మార్చమని లేదా ఇస్లాం ను స్వీకరించమని చెప్పదు. ఇకపోతే, నిరపరాధులపై హింసించడం, భయాన్ని పుట్టించడం — ఇవి జిహాద్ కాదు, ఖురాన్‌కు వ్యతిరేకమైనవి.

నేటి సమాజంలో ఉన్న సమస్య ఏమిటంటే ఈ రోజుల్లో కొన్ని తీవ్రవాద గుంపులు “జిహాద్” అనే పదాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారు. వారు ఖురాన్ వచనాలను తప్పుగా అర్థం చేసుకుని, హింసను సమర్థించడానికి ప్రయత్నిస్తున్నారు.

కానీ ఇస్లామీయ పండితులు స్పష్టం చేసంది ఏమనగా:

జిహాద్ అనేది ఎవరైనా వ్యక్తిగతంగా ప్రకటించే యుద్ధం కాదు. అది క్రమబద్ధమైన అధికారం మరియు కఠిన నియమాల కింద మాత్రమే అనుమతించబడుతుంది.

ఖురాన్‌ను తప్పుగా అర్థం చేసి హింసకు ఉపయోగించడం — అది జిహాద్ కాదు, అది మత దుర్వినియోగం.

జిహాద్ అంటే కేవలం యుద్ధం కాదు అది మంచి కోసం చేసే ప్రయత్నం. అంతేగాక ఇస్లాం మతం శాంతి, నియంత్రణ, మరియు న్యాయం నేర్పుతుంది, హింస లేదా ద్వేషాన్ని అయితే అస్సలు నేర్పదు . అసలు జిహాద్ అనేది మనలోని కోరికలతో, మరియు చెడు అలవాట్లతో పోరాడి, మంచి మనిషిగా మారే ప్రయత్నం చేసే పనిని జిహాద్ అంటారు.  “జిహాద్” అనే పదాన్ని హింస కోసం ఉపయోగించడం ఇస్లాం బోధనలకు వ్యతిరేకం. కాబట్టి, జిహాద్ యొక్క నిజమైన అర్థం తెలుసుకోవాలంటే, ఖురాన్ మరియు ప్రవక్త ﷺ బోధనలను సరైన రీతిలో అర్థం చేసుకోవాలి.

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter