ప్రియ ప్రవక్త ﷺ గారి బోధన మరియు వారి న్యాయగుణం
ఒకప్పుడు ఓ ప్రపంచం ఉండేది. బలం ఉన్నోడిదే అక్కడ ఇష్టా రాజ్యం. పేదల బ్రతుకులకు అసలు విలువే ఉండేది కాదు. ధనవంతులు వారి జీవితాలతో ఆటలాడుతుండేవారు. స్త్రీల పట్ల గౌరవ మర్యాదలతో ఏ ఒక్కడు నడుచుకునేవాడు కాదు. అది ఆమె భర్త అయినా సరే, ఆఖరికి కొడుకు అయినా సరే. ఇందుచేత ఆడబిడ్డల్ని పుట్టగానే దరిద్రం అనుకుంటూ, పూడ్చిపెడుతుండేవారు. అంతేకాక, దానిని ఒక ఆచారంగా భావించేవారు. అన్నిటికంటే ముఖ్యంగా అల్లాహ్ ఆరాధన చేయకుండా, విగ్రహాలను పూజిస్తుండేవారు. అటువంటి అంధకార యుగంలో ప్రియ ప్రవక్త (స) గారు జన్మనెత్తారు. వారి రాకతోనే ప్రపంచంలోని చీకట్లు ఏ దిక్కుకి ఆ దిక్కు పరుగులు తీయసాగాయి. అల్లాహ్ తఆల ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఈ లోకాల కన్నిటి కన్నా ముందే సృష్టించారు. తర్వాత ఆయన నిర్ణయం ప్రకారం, వీరిని ఆఖరి ప్రవక్తయై ఈ లోకంలో పంపించారు. వీరి రాక కొరకు ప్రవక్త ఇబ్రాహీం (అ) గారు కూడా అల్లాహ్ ను ప్రార్థించారు. ఇంకా ప్రవక్త ఈసా (అ) గారు కూడా వీరి రాక శుభవార్తని తమ ప్రజలకీ వినిపించారు.
అల్లాహ్ తఆలా ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని, యావత్ ప్రపంచానికే ఒక శాంతికి నమూనాగా తయారుచేసి పంపారు. అంతేకాక వారు యావత్ మానవత్వానికీ ఒక కనికరమై పంపబడ్డారే తప్ప, కేవలం వారి వంశం లేదా కుటుంబానికై మాత్రమే కాదు. దీని గురించి స్వయాన ఖురాన్ ఇలా బోధిస్తుంది:
(وَمَا أَرْسَلْنَاكَ إِلَّا رَحْمَةً لِّلْعَالَمِينَ) (الأنبياء: 107]
“మరియు మేము నిన్ను (ఓ ప్రవక్త!) సర్వ లోకాల వారి కొరకు కారుణ్యంగా మాత్రమే పంపాము. ”. (అల్-అంబియా: 107)
అలా ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లం గారు వచ్చి,అటువంటి పాపిష్ఠి మానవత్వానికి, పవిత్ర ఖురాన్ ద్వారా సరైన బుద్ధి గుణపాఠం నేర్పారు. అది ఆషామాషీ పాఠం కాదు. దాని అనుసరణ మానవుని జీవితంలోని ప్రతి విషయంలో తోడ్పడి విజయం వైపునకు మార్గదర్శి అవుతుంది. అందుకనే ఒక మనిషి తన పుట్టుక నుండి మరణించేంతవరకు తప్పక జ్ఞానాన్ని అనగా చదువును స్వీకరిస్తూ ఉండాలని సెలవిచ్చారు మన ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు.
" طلب العلم فريضة على كل مسلم ومسلمة". (ابن ماجه)
దాని అర్ధం “విద్యాభ్యాసం ప్రతి ముస్లిం స్త్రీ పురుషుల కచ్చితమైన కర్తవ్యం!”. (ఇబ్న్ మాజహ్)
అంతేకాక ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా కూడా సెలవిచ్చారు. జ్ఞానం అనేది విశ్వాసి యొక్క ఒక పోగొట్టుకున్న వస్తువు. కనుక, అది ఎక్కడ ఏ కొంచెం దొరుకుతున్నా దాన్ని వదులుకోకూడదని కూడా ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు సెలవిచ్చారు. అంతేకాక ఒక మనిషికి ఏది లభించిన అది అతని కష్టాన్ని బట్టి ఉంటుంది. ఎటువంటి ప్రయత్నం చేయకుంటే ఏ ఫలితమూ ఉండదు. దానికి తోడుగా మంచి, చెడు ఏది జరిగినా అందులో అల్లాహ్ నిర్ణయ ప్రమేయం లేకుండా ఎటువంటి కార్యము జరగదని మనకు నేర్పారు ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు. అది ఉపకారమైనా,అపకారమైనా, ఏదైనా అవ్వచ్చు.
నేటి రోజుల్లో ఏది జరిగినా దానికి మూలంగా ఇస్లాం మరియు ముస్లింలు గురవుతున్నారు!.ఇలా ఎందుకు? దానికి కారణం కేవలం, ముస్లింలు ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి నడవడికను, సాంప్రదాయాన్ని మరిచినందువలనే!
ఇటువంటి దుస్థితిని దారుల్ హుదా పుంగనూరు, ఆంధ్రప్రదేశ్, యొక్క బాధ్యులు చూసి, స్పర్శించి మరియు దీని కోసం ఒక చక్కటి పరిష్కార మార్గ రూపంలో ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పవిత్ర జీవితపు వేరువేరు భాగాలని, వేరువేరు సందర్భాలను, సమాజానికి చేరవేసే బాధ్యతల్ని, తమ భుజాలపై వేసుకుని మరీ తయారయ్యారు. అటువంటి విద్యాలయంలో ఒక విద్యార్థి నైనందుకు, నేను చాలా గర్వపడుతున్నాను. ఈ వ్యాసం ద్వారా ప్రజలు తప్పక అవాక్కవుతారు. నేటి మన భారతదేశంలో దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి విస్తరించే తప్పుడు వ్యాఖ్యలను అరికట్టడంలో ఈ వ్యాసం సహాయపడుతుందని భావిస్తున్నాను.
ఈ వ్యాసానికి తోడు ఏడు భాగాలు కూడా ఉన్నాయి దీనితో పాటు వాటిని కూడా చదవవలసినదిగా నా మనవి.


