మనం చేసే ప్రయాణాల దారి ఎటువైపుకి?
మనం దైనందిన జీవితంలో తరచుగా బస్సుల్లో, రైళ్లలో ఎన్నో ప్రయాణాలు చేస్తుంటాం. కొన్నిసార్లు కిటికీ పక్కన కూర్చుని బయటకు చూస్తూ ఉంటాం. చాలాసార్లు మన ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. లేదా చేతిలో ఉన్న ఫోన్ స్క్రీన్‌లో మునిగిపోయి ఉంటాం. కనీసం మన పక్కన ఏం జరుగుతుందో కూడా గమనించలేనంత బిజీ అయిపోతాం. లేదా కొన్నిసార్లు, మన దృష్టి ఎప్పుడూ 'గమ్యం ఎప్పుడు చేరుకుంటాం?' లేదా 'ఈ ప్రయాణం ఎప్పుడు ముగుస్తుంది?' అన్నదానిపైనే మన ధ్యాస మొత్తం ఉంటుంది.
కానీ, ఇస్లాం దృష్టిలో ప్రయాణం అంటే కేవలం పయనమవడం మాత్రమే కాదు, అది మన మనసును మేల్కొల్పే ఒక ఆత్మ పరిశీలన. మనం ఇంట్లో ఉన్నప్పుడు ఒకే రకమైన వాతావరణానికి, పనులకు అలవాటు పడిపోతూ ఉంటాం. ఇక అలాగే మెల్లిమెల్లిగా అల్లాహ్ సృష్టిలోని గొప్పదనాన్ని, ఆంతర్యాన్ని మర్చిపోతాం. అందుకే ఖురాన్ మనల్ని ఇంటి నుండి కదిలి, ప్రపంచాన్ని చూస్తూ ఆశీర్వదించమని చెబుతుంది. ఇకపోతే, మనం ఎన్నో నిర్ణయాలు, వ్యూహాలు వేసుకుని అనుకొనే ప్రయాణాలు, ఇట్టే వృధా అవ్వకుండా (ఈ ప్రపంచానికి మాత్రమే అంకితం కాకుండా) అల్లాహ్ ఆదేశాల మేరకు ఈ కార్యాలన్నీ చేపడుతున్నామని సంకల్పం చేయడం, చాలా శ్రేష్టం మరియు ఉత్తమం. ఇక మన సాధారణ ప్రయాణాలు, కుటుంబ విహారయాత్రలను కేవలం కాలక్షేపంగా కాకుండా, ఒక అందమైన ఆధ్యాత్మిక అనుభవంగా ఎలా మార్చుకోవాలో ఇప్పుడు చూద్దాం.
ఎక్కువగా మనం సెలవుల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఏ జలపాతాల వద్దకో, పచ్చని కొండల మధ్యకో విహారయాత్రలకు వెళ్తుంటాం. అక్కడ ఆ అద్భుతమైన దృశ్యాలను చూడగానే, ముందుగా మన చేతులు ఫోన్ కెమెరా వైపు వెళతాయి. జ్ఞాపకాలను భద్రపరుచుకోవడం తప్పు కాదు, కానీ ఒక ముస్లింగా ఆ ప్రకృతితో మన అనుబంధం కేవలం ఒక ఫోటోకు మాత్రమే పరిమితం కాకూడదు. ఇంకా ఇటువంటి మంచి కార్యాలను ఇతరుల మన్ననలు పొందేందుకు, గొప్పలు చెప్పించుకునేందుకై చేయడం ఎంత మాత్రం సరికాదు. ఉదాహరణకు చూస్తే, ఆకాశం నుంచి జాలువారే ఆ నీటిని, ఆ పచ్చదనాన్ని చూసినప్పుడు మన హృదయం లోపలి నుంచి అప్రయత్నంగా 'సుభానల్లాహ్' (సృష్టికర్త ఎంత పవిత్రుడు) అనే భావన కలగాలి.
ఇందుమూలంగా ఖురాన్‌లో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
"భూమిలో పర్యటించండి మరియు ఆయన సృష్టిని ఎలా ప్రారంభించాడో పరిశీలించి చూడండి..." (అల్-అన్కబూత్ 29:20).
అంటే ఆ కొండలు, ఆ నదులు కేవలం మనం చూసి ఆనందించడానికి ఉన్న పర్యాటక ప్రదేశాలు మాత్రమే కావు, అవి అల్లాహ్ అపారమైన శక్తికి సజీవ సాక్ష్యాలు. సృష్టిని చూసి మురిసిపోవడంతో పాటు, ఆ సృష్టికర్త గొప్పదనాన్ని స్మరించినప్పుడే మన ప్రయాణానికి ఒక నిజమైన అర్థం దొరుకుతుంది.
ఎప్పుడైనా ప్రాచీన కోటలు, కట్టడాలు లేదా శిథిలాల మధ్య నడిచేటప్పుడు, మనకు ఒక వింతైన ఆశ్చర్యం కలుగుతుంది. ఉదాహరణకు, ఈజిప్టులోని పిరమిడ్లు లేదా పర్వతాలను తొలిచి అద్భుతంగా నిర్మించిన 'మదాయిన్ సాలేహ్' (సమూద్ జాతి నగరాలు) లాంటివి చూసినప్పుడు, 'ఆ కాలంలో ఎంత గొప్పగా నిర్మించారు!' అని మురిసిపోతాం.
కానీ ఖురాన్ ఆ చరిత్రను వేరే కోణంలో చూడమని చెబుతోంది:
"భూమిపై పర్యటించి చూడండి, మీకు పూర్వం గతించిన వారి ముగింపు ఏమైందో!" (అర్-రూమ్ 30:42)
ఒకప్పుడు "నేను దేవుణ్ణి" అని విర్రవీగిన ఫిరౌన్ లాంటి రాజులు ఇప్పుడెక్కడున్నారు? అహంకారంతో భూమిని ఏలిన వారి సైన్యం, వారి అపారమైన సిరిసంపదలు ఏమయ్యాయి? ఇహలోకం (దునియా) ఎంత తాత్కాలికమో, అల్లాహ్ అధికారం మాత్రమే శాశ్వతమని మనకు ఒక గొప్ప సందేశాన్ని ఆ శిథిలాలు మౌనంగా బోధిస్తాయి. చరిత్రను చూసి ఈ గుణపాఠం నేర్చుకోవడం కూడా ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభవమే.
ఇంకా మరో విషయం గమనించినట్లయితే, మనిషి అసలు స్వభావం అతని నడవడిక ఇంట్లో ఎలాగున్నా ఒకరితో ప్రయాణం చేస్తే అతని అసలు స్వభావం కనబడుతుంది. హజ్రత్ ఉమర్ (ర) వద్దకు ఒక వ్యక్తి వచ్చి వేరొకరి గురించి సాక్ష్యం ఇస్తుంటే, ఉమర్ (ర) గారు అతన్ని అడిగిన ఒక ముఖ్యమైన ప్రశ్న: "నువ్వు అతనితో ఎప్పుడైనా ప్రయాణం చేశావా?" దానికి ఆ వ్యక్తి "లేదు" అనగానే, "అయితే నీకు అతని అసలు వ్యక్తిత్వం తెలియనట్లే" అన్నారు ఉమర్ (ర) గారు.
మనం బస్సులు లేదా రైళ్ల ప్రయాణాల సమయాల్లో ఇటువంటి జగడాలు ఎన్నో విషయాలు మన కళ్ళ ఎదుటే జరుగుతుంటాయి. అలిసిపోయి ఉన్నప్పుడు, రద్దీగా ఉన్నప్పుడు తోటి ప్రయాణికులకు కాస్త చోటు ఇవ్వడం, వయసు పైబడిన వారితో మర్యాదగా మాట్లాడటం, ఇస్లాం నేర్పిన సున్నత్. ప్రయాణంలో ఎవరైనా మనకు కోపం తెప్పించినా, సహనం కోల్పోకుండా ఉండటమే అసలైన సత్ప్రవర్తన. ఒక ముస్లింగా ప్రయాణంలో మన ప్రవర్తనే ఇస్లాంకు మొదటి బ్రాండ్ అంబాసిడర్ అని మనం ఎన్నటికీ మర్చిపోకూడదు.
తిరుగు ప్రయాణంలో మనతో ఏం తీసుకెళ్తున్నాం?
ప్రయాణం ముగించుకుని తిరిగి ఇంటికి చేరుకునేసరికి మన చేతుల్లో ఏం మిగులుతున్నాయి? కేవలం బరువెక్కిన కొన్ని బ్యాగులు, ఫోన్ గ్యాలరీ నిండా కొన్ని ఫోటోలు, అలిసిపోయిన దేహం మాత్రమే కాకూడదు.
అల్లాహ్ సృష్టిని చూసిన తర్వాత ఆయన అపారమైన గొప్పదనం పట్ల మరింత స్పష్టత మనతో పాటు రావాలి. గతించిన చరిత్రను చూసిన తర్వాత ఈ తాత్కాలిక ప్రపంచం పట్ల సరైన అవగాహన కలగాలి. తోటి ప్రయాణికులతో గడిపిన తర్వాత మనుషుల పట్ల దయ, మనలో వినయం పెరగాలి. దీన్నే ఇస్లాం మనకు నేర్పుతుంది.
అంతేకాకుండా, ఒక ప్రయాణం మన అహంకారాన్ని తగ్గించి, అల్లాహ్‌కు మనల్ని మరింత దగ్గర చేస్తున్నప్పుడు... మనం కేవలం ఒక గమ్యాన్ని చేరుకున్నట్లు. మన సృష్టికర్తను చేరుకున్నట్లు. ఖురాన్ తెలిపిన అసలైన ప్రయాణం అదే!


