షైఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ (ర) గారి ఆఖరి ఘడియలు
షైఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ (ర) గారు ఇస్లామీయ ఆధ్యాత్మిక చరిత్రలో గొప్ప పండితుడు, వలీ మరియు మురబ్బీ. ఆయన గారి పూర్తి నామధేయం "షైఖ్ అబ్దుల్ ఖాదిర్ బిన్ అబీ సాలిహ్ మూసా అల్-జీలానీ". ఇంకా ప్రసిద్ధ పేరు: 'షేక్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ'. వారి గౌరవ బిరుదులు 'గౌస్-ఏ-ఆజమ్', 'షైఖుల్ అక్బర్' వంటి బిరుదులు భక్తి సంప్రదాయాల్లో సుప్రసిద్ధి. గౌస్-ఏ-ఆజమ్ అనేది అరబిక్ మరియు ఉర్దూ మూలాలు ఉన్న ఒక గౌరవప్రదమైన బిరుదు. దీని అర్థం "అత్యున్నత సహాయకుడు" లేదా "గొప్ప రక్షకుడు". ఈ పదాన్ని ఇస్లామిక సంస్కృతిలో ముఖ్యంగా ప్రసిద్ధ సూఫీ, అయిన షేక్ అబ్దుల్ ఖాదిర్ జిలానీ గారిని గౌరవపూర్వకంగా సంబోధించడానికి ఉపయోగిస్తారు.
అయితే ఆయన వ్యక్తిత్వాన్ని కేవలం కరామాత్ కథనాలు లేదా భక్తి సంప్రదాయాల ద్వారా మాత్రమే చూడటం వల్ల ఆయన చారిత్రక మరియు ఆధ్యాత్మిక ప్రాధాన్యతను పూర్తిగా అర్థం చేసుకోలేరు. ఆయన ఒక పండితుడు, బోధకుడు, గొప్ప ఉపన్యాసకుడు మరియు వారు ఆధ్యాత్మిక మార్గదర్శిగా చేసిన కృషి కూడా చాలా ముఖ్యమైనది. ఇంకా ఆయన దృష్టిలో జ్ఞానం కేవలం పుస్తకాలలో ఉండటానికి కాదు. మనిషి జీవితాన్ని సరిదిద్దడానికి తోడ్పడాలనే గొప్ప దృక్పథం వారిది. షైఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ (ర) గారి ఆధ్యాత్మిక బోధనలను అర్థం చేసుకోవడానికి ఖుర్ఆన్ అత్యంత ముఖ్యమైన పునాది. దీని గురించి స్వయంగా ఖురాన్ ఇలా చెబుతుంది:
وَمَا خَلَقْتُ الْجِنَّ وَالْإِنسَ إِلَّا لِيَعْبُدُونِ
“జిన్నులను మరియు మానవులను నా ఆరాధన కొరకే సృష్టించాను.”( అజ్-జారియాత్) 51:56
ఈ శ్లోకం మనిషి జీవితపు ప్రధాన లక్ష్యం, 'అల్లాహ్ ఆరాధన' అని తెలియజేస్తుంది. అదేవిధంగా ఖురాన్ ఏకేశ్వారాధనను బలంగా ప్రతిపాదిస్తుంది. అల్లాహ్ ఒక్కరే ఆరాధనకు అర్హుడు. ఇంకా ఈ విశ్వాసమే ఇస్లామీయ ఆధ్యాత్మికతకు పునాది.
చివరి రోజులు: మానవాళికి మార్గదర్శిగా నిలిచిన జిలానీ గారికి 90 సంవత్సరాల వయస్సు నిండిన తర్వాత, వారి ఆరోగ్యం కొద్దిగా క్షీణించింది. అకస్మాత్తుగా ఒకరోజు వారి శరీరంలో మొదలైన నీరసం, రోజురోజుకూ పెరుగుతూ వచ్చింది. చివరికి వారు నడవడం, తిరగడం కూడా చేయలేకపోయారు. ఇంకా వారి శరీరం ఏమాత్రం సహకరించలేదు. వాస్తవానికి ఇది అల్లాహ్ యొక్క నిర్ణయం. ఆఖరికి హిజ్రీ 561వ సంవత్సరం, రబీ ఉస్సానీ (రబీ ఉల్ ఆఖిర్) మాసం ప్రారంభంలో వారి అనారోగ్యం ఎంతో కఠినమైన పరిస్థితికి చేరుకుంది. ఇక అల్లాహ్ తఆల తరపు నుంచి ఈ ఆ శాశ్వత ప్రపంచం నుండి కదిలే సమయం దగ్గర పడిందనే సందేశం, ఆయన వద్దకు చేరింది. కావున ఆయన గారు తన ఆఖరి రోజులు, తనకు సంబంధించిన మనుషులతో, తాను వెళ్లబోయే సమయం దగ్గర పడిందని మరియు ప్రస్తుత రోగం దానికి సంకేతంమని తెలిపారు.
కుమారులకు మరియు బంధువులకు చేసిన ఆఖరి హితబోధలు.
తీవ్రమైన అనారోగ్యంలో ఉన్నప్పటికీ వారి నోట అల్లాహ్ స్మరణ ఆగలేదు. ఆ సమయంలో వారి కుమారులు మరియు ముఖ్య అనుచరులు వారి చెంతకు చేరారు. వారి కుమారుడు షైఖ్ అబ్దుల్ వహ్హాబ్ గారు "మీ తర్వాత మేము ఎలా జీవించాలి తండ్రి?" అని అడిగినప్పుడు, జిలానీ గారు ఈ క్రింది ముఖ్యమైన విషయాలను ఉపదేశించారు:
కేవలం అల్లాహ్‌కే భయభక్తులు: "ఎల్లప్పుడూ అల్లాహ్ తఆలాకు భయపడుతూ జీవించండి. ఆయనకు తప్ప మరెవరికీ భయపడకండి, ఎవరిపైనా ఆశలు పెట్టుకోకండి!. మీ అవసరాలన్నింటినీ కేవలం అల్లాహ్ ముందే ఉంచండి!. సృష్టిపై ఆధారపడకండి!.మానవులపై లేదా ఇతర ప్రాణులపై భారం వేయకండి. మీకు ఏది కావాలన్నా అల్లాహ్ తోనే అడగండి.
ఇంకా ఎవరికీ అన్యాయం చేయవద్దు. కుటుంబ బంధాలను,పేద ప్రజలను గౌరవించండి మరియు జ్ఞానాన్ని అన్వేషించే వారికి నిరంతరం సేవ చేయండి.
ఇక కుమారులు తండ్రి గారి నొప్పి గురించి అడిగినప్పుడు, "నా శరీరం అంతా నొప్పితో నిండి ఉంది కానీ, నా హృదయం మాత్రం అల్లాహ్ స్మరణతో ఎంతో ప్రశాంతంగా, సురక్షితంగా ఉంది" అని చెప్పారు.
అతిథులకు స్వాగతం: కాలం చేయడానికి కొద్దిసేపటి ముందు వారు, గదిలో ఎవరూ లేకపోయినా ఎవరో ఉన్నట్లు చూస్తూ.. "మీపై అల్లాహ్ శాంతి, కరుణ, శుభాలు కలుగుగాక" అని పలికారు. ఇక్కడ అల్లాహ్ యొక్క ఇతర సృష్టి (దూతలు) వచ్చారు, వారికి స్థలం ఇవ్వండి అని కుటుంబ సభ్యులతో చెప్పారు.
ఇక వారి చివరి పలుకులు శ్వాస నెమ్మదించినప్పుడు, సంపూర్ణ విశ్వాసంతో వారి నాలుకపై నిరంతరం కలిమా సాగింది. వారి నోటి నుండి వచ్చిన ఆఖరి మాటలు: "అల్లాహు, అల్లాహు, అల్లాహు... భాగస్వాములు లేని ఆ ఏకైక అల్లాహ్ సహాయాన్ని నేను కోరుతున్నాను. ఆయనే సజీవుడు, ఆయనకు మరణం లేదం'టూ స్మరించారు.
హిజ్రీ 561, రబీవుస్సానీ మాసం 11వ రాత్రి బాగ్దాద్ నగరంలో వారు, ఈ నశ్వర (తాత్కాలిక) లోకాన్ని వీడి పరమపదించారు. వారి జ్ఞాపకార్థమే భక్తులు ప్రతి సంవత్సరం ఈ 'గ్యార్వీ షరీఫ్' జరుపుకుంటారు.
ఇక 'గౌస్-ఏ-ఆజమ్' గారి నుండి నేటి తరానికి దక్కే సందేశం, నేటి ప్రపంచంలో సాంకేతికత పెరిగినా, మనిషి ఎదుర్కొనే అనేక సమస్యలు అంతర్గతమైనవే.
అహంకారం, అసూయ, అత్యాశ,ప్రదర్శన, స్వార్థం,అశాంతి... ఇలాంటి సమస్యల మధ్య గౌస్-ఏ-ఆజమ్ గారి బోధనలు మనకు హృదయ సంస్కరణను గుర్తుచేస్తాయి.
జ్ఞానం సంపాదించుకొని దాన్ని ఆచరించాలి.
అల్లాహ్ ను ఎన్నటికీ మరవకూడదు. నీకు నువ్వై చెడు నుండి నియంత్రించుకోవాలి. హలాల్ మార్గంలో జీవిస్తూ, ప్రజలకు మేలు చేయాలి. కష్టాల్లో సహనం పాటిస్తూ, ప్రతి పరిస్థితిలోనూ అల్లాహ్ పై నమ్మకం ఉంచాలి. ఇదే ఆయన ఆధ్యాత్మిక వారసత్వంలోని ముఖ్యమైన సందేశం.
ఇక ఆఖరిగా, షైఖ్ అబ్దుల్ ఖాదిర్ జీలానీ (ర) గారి జీవితం కూడాఇస్లామీయ చరిత్రలో మనకు విద్య, దైవ భయం, ఏకేశ్వారాధన, నిజాయితీ మరియు ఆధ్యాత్మిక సంస్కరణకు సంబంధించిన ఒక ముఖ్యమైన అధ్యాయం. ఆయనను గౌస్-ఏ-ఆజమ్గా గౌరవించే కోట్లాది మంది ముస్లింలకు, ఆయన జీవితం అల్లాహ్ తఆలాను గుర్తుచేసే ఒక ఆధ్యాత్మిక స్మరణ. కానీ ఆయనను నిజంగా గౌరవించాలంటే కేవలం ఆయన పేరును స్మరించడం మాత్రమే కాకుండా, ఆయనకు సంబంధించిన ప్రధాన బోధనలను జీవితంలో తప్పక ఆచరించి తీరాలి.


