మక్కా విజయం: ప్రపంచ చరిత్రలో మానవత్వ పునాదికి గొప్ప సందేశం
మక్కాలో "బనుకుసాహ్" "బనుబకర్" అనే రెండు తెగలుండేవి. ఈ రెండు తెగల మధ్య పూర్వం నుండీ కూడ వైరముండేది. ఇస్లాం మతమును వ్యతిరేకించడానికి ఈ రెండు తెగలవారు వైరములు మాని ఏకమయ్యారు. కాని హుదైబియ సంధిలో మక్కా వారు తమ ఇష్టమొచ్చిన వారి పక్షము వహించవచ్చనే షరతు కూడ ఉండిన దానివలన "బనుకుసా" వారు మహా ప్రవక్త(స) వారి పక్షము వహించారు. దానిని అదనుగా తీసుకొని 'బనుబకర్' తెగవారు "బనుకుసా" తెగవారిని హింసించసాగారు. ఈ రెండు తెగల మధ్య పోరాటం ప్రారంభమైనది. ఈ పోరాటంలో ఖురేషీయుల నాయకులైన "ఇక్రమా" "సుహైల్ " మొదలగువారు "బనుబకర్" వారికి అన్నివిధాలుగ సహాయ పడిన దానివలన చాలమంది "బనుఖుసా” వారు మరణించారు. "బనుఖసా" వారు మహాప్రవక్త(స) వద్దకు వచ్చి జరిగిన వృత్తాంతాన్ని ఏడుస్తూ విన్నవించి తమకు సహాయపడవలసినదిగా వేడుకున్నారు. ఖురేషీయులు "బనుఖుసా" వారిపై చేసిన దురాగతాన్ని మహా ప్రవక్త(స) సహించలేక పోయారు. అందువలన ఆ వెంటనే ప్రవక్త(స) గారు కొన్ని షరతులతో కూడిన ఒక పత్రము వ్రాసి ఒక సహాబీ (అనుచరుని) చేతికిచ్చి దాని పై ఖురేషీయుల సమాధానం పొంది రావసినదిగా ఆదేశించారు. కాని ఖురేషీయులు అందులోని మూడవ షరుత్తు ను మాత్రం ఆమోదించారు."హుదైబియా సంధి" రద్దు పరచుకుంటున్నట్లు ప్రకటన గావించి పత్రముపై సమాధానము కూడ పంపించారు. ఆ సమాధాన పత్రమును చూసి మహాప్రవక్త(స) అగ్రహించారు. ఈ లోపల ఖురేషీయులు తాము చేసింది చాల పొరపాటని గ్రహించి సంధిని పునరుద్దరించు కోవటానికి ఖురేషీయులు, అబూ సుఫియాన్ ను తమ రాయబారిగా ప్రవక్త(స) వద్దకుపంపారు. ఖురేషీయుల రాయబారియైన అబూసుఫియాన్ ప్రవక్త[స] గారి సన్నిధికి వచ్చి సంధిని పునరుద్దరించవలసినదిగా కోరాడు. ప్రవక్త[స] దీనికిబదులు చెప్పలేదు. అందువలన మదీనాలో తమ కుమార్తె మరియు రసూల్[స] గారి సతీమణి అయిన ఉమ్ముహబీబా ఇంటికొచ్చి సంధి తిరిగి ఆరంభించమని ప్రవక్త[స] గారికి సిపారసు చేయమని కోరాడు. తరువాత అబూబకర్ సిద్దీఖ్[ర], ఉమర్[ర], అలీ[ర], ఫాతిమా[ర] మున్నగువారిని కూడా ఈ విషయం గురించి రసూల్[స] గారితో మాట్లాడి సిఫారసు చేయవలసినదిగా వేడుకున్నాడు. కాని వారెవరు ఖాతరు చేయలేదు. ఈవిధంగా అబూసుఫియాన్ సర్వ ప్రయత్నాలు చేశాడు. కాని లాభం లేకుండా పోయినది. అబూసుఫియాన్ రాయబారం విఫలమైనది. అధర్మం నశించే సమయం ఆసన్నమైనది. ఈవిధంగా మక్కాలో ధర్మ స్థాపనకు నాంది ఏర్పడినది. ఇక మహాప్రవక్త[స] ఖురేషులపై ప్రతీకార చర్య తీసుకోవాడానికి 10 వేల మంది సైనికులను తీసుకొని తమ అనుచరుల తో కలిసి హి.శ 8వ యేట రంజాన్ నెల 10 వ తేదీన మక్కాకు బయలు దేరారు. దారిలో కూడ అనేక మంది వారితో కలిసినారు. ఇంత పెద్ద సైన్యము పయనమై 'మక్కా'కు దగ్గర లో మర జహారాన్ "వద్ద విడిది చేసినది. ఈ విషయం ఖురేషీయులకు తెలిసినది. ఇది నిజమో కాదో తెలుసుకోవడానికి వారు అబూ సుఫియాన్ ను మరికొంత మందినిపంపారు. అబూసుఫియాన్ ముస్లిం సైన్యము వద్దకు వెళ్ళి వీక్షించుచున్న సమయంలో సైన్య గుడారములను కాపలా కాస్తున్న భటులు మరియు అబ్బాస్(ర) అబూసుఫియాన్ ను గుర్తించి పట్టుకొని మహాప్రవక్త(స) ముందు హాజరు పరచగా ప్రవక్త(స) అతనిని క్షమించి ఇస్లాం స్వీకరించ మని కోరారు. అబూసుఫియాన్ ఇష్టపడలేదు. అప్పుడు అబ్బాస్(ర) ఇలా అన్నారు: "మెడ పై తల ఉండాలంటే ఇప్పుడే ముస్లిం అవ్వాలి" అందువలన అతను అప్పుడే ఇస్లాం స్వీకరించి, తరువాత కాలంలో ముస్లిం సైన్యము లోని మొదటి పంక్తిలో నిలిచారు. మక్కాపట్టణం ముట్టడి సమయము లో ప్రజలు ఇండ్లల్లో నుండి బయటకు రాకూడదని, ఇండ్లల్లో గాని, కాబామసీదులో గాని, అబూసుఫియాన్ ఇంటిలోగాని ఉంటే రక్షణ ఉంటుందని మహాప్రవక్త[స] అబూసుఫియాన్ ను పరిగణలోనికి తీసుకొని తీర్మానించి అందరికి తెలియజేశారు. ముస్లిం సైనికులకు ఉత్తరువు జారీ చేస్తూ మక్కా పవిత్రతను కాపాడాలని, ప్రజల పై హత్యాచారాలు చేయరాదని స్త్రీలు, పిల్లలు, బానిసల జోలికి వెళ్ళరాదని దుకాణాలను ఇండ్లను లూటి చేయరాదని చెట్లను జంతువులను నరకరాదని హెచ్చరించారు. నీతిని, సమానత్వాన్ని పటిష్ట పరచటానికి ప్రవక్త[స] గారు తమ ఒంటెపై ఉసామాను వెనుక భాగాన కూర్చోబెట్టారు. ఇంతకుముందు తమకు బానిస అయ్యిఉండిన జైద్[ర] గారి కుమారుడే ఉసామ. రంజాన్ నెల20వ తేదీ శుక్రవారం రోజున మక్కాను జయించారు. పరిస్థితులు శాంతించిన తరువాత రసూల్[స] కాబా వద్దకు వచ్చి తవాఫ్ చేశారు. తమచేతిలో ఉండిన బాణం తో కాబా లోపల మరియు బైట ఉండిన మొత్తం 360విగ్రహాలను నేల త్రవ్వి పూడ్చేశారు. అప్పుడు సత్యము జయించినది.అసత్యము ఓడిపోయినది. ఖచ్చితంగా అసత్యం ఓడిపోయే తీరుతుంది అని చెప్పుచుండిరి. కాబా మసీదు గోడలపై చిత్రీకరించబడి ఉండిన రకరకాల బొమ్మలన్నికూడా తుడిపించేశారు. కాబాలయానికి కాపలాకాయుచుండిన ఉస్మాన్ ఇబ్ను తల్హా ను పిలిపించి తాళంచెవులు తీసుకున్నారు. కాబాలయం తెరిచి లోనికెళ్ళి శుద్దిచేసి నమాజు ఆచరించారు. హి.శకానికి ముందు ఒకసారి ఉస్మాన్ ఇబ్ను తల్హా ను రసూల్[స] గారు కాబాలయ తాళంచెవులు అడిగిఉండిరి. అప్పుడతను చాలా దురుసుగా ప్రవర్తించి తాళంచెవులు ఇవ్వటానికి నిరాకరించిఉండెను.
ఇప్పుడు కాబాలయ ప్రాంగణము లో వేలాది మంది ఖురేషీయులు గుమికూడి ఉన్నారు. ఇస్లాం బద్దశత్రువులందరూ కాబాలయం ఎదుట హాజరుపరచబడ్డారు. ప్రవక్త[స] గారిని, వారిని విశ్వసించిన అనుచరులందరిని అనేక చిత్రహింసలకు గురిచేసిన సత్య తిరస్కారులు వీరు. తాము ముస్లిముల ఎడల చేసిన దురాగతాలనన్నిటిని తలుచుకుంటూ తమకు శిక్షలు తప్పవనిభావించి లోలోన భయపడుతూ ఊపిరిబిగబట్టి ఉన్న సమయములో రసూల్[స] కాబామసీదు లోపలి నుండిబైటకు వచ్చేటప్పుడు ఇప్పుడేమి జరగబోతోందోనని ఉత్కంఠ భరితంగా ఎదురు చూడసాగారు.