మంబురం తంగల్: కేరళాకే కాదు, మొత్తం భారతదేశానికి దొరికిన మహా వ్యక్తి

జననం మరియు బాల్యం:

తంగల్ కుటుంబం హదర్ మౌత్‌లోని తారీమ్ అనే చిన్న పట్టణంలో నివసించేది. వారి తండ్రి, సయ్యిద్ ముహమ్మద్ బిన్ సహ్ల్ మౌలద్దవీలా (QA), ఆధ్యాత్మిక జ్ఞాన రంగంలో లోతైన విద్య ఉన్న కుటుంబంలో జన్మించారు.

ముహమ్మద్ బిన్ సహ్ల్ మౌలద్దవీలా (QA) గారు జిఫ్రీ కుటుంబ పెద్ద కుమార్తె మరియు షేక్ హసన్ జిఫ్రీ సోదరి సయ్యిదా ఫాతిమాను వివాహం చేసుకున్నారు. ఆమె మత పండితురాలు, భక్తురాలు. వారి సంతానంగా, తంగల్ దుల్ హిజ్జా 23వ తేదీ శనివారం రాత్రి 1166 AHన జన్మించారు. వారు ప్రవక్త కుటుంబంలో (33) ముప్పై మూడవ మనవడు. వారి చిన్నతనంలోనే తల్లి తండ్రులు మరణించారు. కాగా కొన్నిరోజులు గడిచాక తమ పిన్ని సయ్యిదా హమీదా బీవీ తమరిని పోషించసాగింది. తంగల్ తన చిన్నతనంలోనే ఆకర్షణీయమైన లక్షణాలను చూపించడం ప్రారంభించారు. ఓర్పు, మంచి స్వభావం, నిజాయితీ, తెలివితేటలు, ధైర్యం, సేవ చేయాలనే సంకల్పం వంటి ఎన్నో మంచి లక్షణాలను సంపాదించుకున్నారు. వారు చాలా చిన్న వయస్సులోనే పవిత్ర ఖురాన్‌ను కంఠస్థం చేసుకున్నారు. తంగల్ తన ప్రాథమిక విద్యను తన స్థానిక తారీమ్‌లో పూర్తి చేశారు.

తన బంధువులలో అతని మామ (పిన్ని భర్త) మరియు కొంతమంది బంధువులు మత ప్రచార నిమిత్తం కేరళకు వెళ్లారు. అతను తన పిన్ని నుండి ఇస్లాం మత ప్రచారకులుగా కేరళలో వారి వెంచర్లు మరియు వారి సేవల గురించి విన్నారు. ఆ తర్వాత ఇస్లామిక దావాలో తన మేనమామల మార్గాన్ని అనుసరించాలనే కోరికను తన పిన్నితో పంచుకున్నారు. పదిహేడేళ్ల వయస్సులో తంగల్ 'షహర్ముకల్లా' ఓడరేవు నుండి కార్గో షిప్‌లో మలబార్ చేరుకున్నారు. హిజ్రీ 1183 రంజాన్ 19వ తేదీన కోజికోడ్‌లో అడుగుపెట్టారు.

వారి మేనమామ హసన్ జిఫ్రీ తంగల్ తన పద్నాలుగు సంవత్సరాల వయస్సులో మంపురంలో మరణించారు. సయ్యిద్ హసన్ జిఫ్రీ తారీమ్ నుండి కేరళకు వెళ్ళినప్పుడు తంగల్‌కి రెండేళ్లు. కోజికోడ్ చేరుకున్నాక తంగల్‌ను తనతోటి ప్రయానికులలోని కొంతమంది అరబ్ వ్యాపారులు షేక్ జిఫ్రీ ఇంటికి తీసుకెళ్లారు. మరుసటి రోజు ఉదయం ప్రార్థన మరియు భోజనం తర్వాత, ఇద్దరూ మంబురమంతా తిరిగి వచ్చారు. ఋషుల కేంద్రంగా మారిన మంబురం ప్రాంతాన్ని తెలుసుకోవడం మరియు అతని మేనమామ సమాధిని సందర్శించడం వారి ప్రధాన లక్ష్యం.

కుటుంబ జీవిత:

తంగల్ కుటుంబ జీవితం ఆదర్శప్రాయమైనది. కేరళకు వచ్చిన అదే ఏడాది మంబురం స్థానికుల నాయకుడిగా పరిగణించబడే హసన్ జిఫ్రీ కుమార్తె ఫాతిమా బీవీతో 1183 హిజ్రీ రబీవుల్ అవ్వల్ నెలలో వివాహం చేసుకున్నారు. వివాహ సమయానికి ఫాతిమా బీవీకి పదిహేనేళ్లు, తంగల్‌కి పదిహేడేళ్లు. ఇది చాలా సాధారణ వివాహం. నికాహ్ ఖుత్బా షేక్ జిఫ్రీ చదివించారు.

వివాహానికి తంగల్ తన బంధువులను, తండ్రి కుటుంబాన్ని మరియు స్నేహితులను ప్రత్యేకంగా ఆహ్వానించి చిన్న విందు (వలీమా) నిర్వహించారు. వేడుక ముగిసిన తరువాత తంగల్ తనతో పాటు అతని కుటుంబ ఖర్చులను భరించవలసిందిగా చాకిరి అవరన్ అలియాస్ అబ్దుర్ రెహమాన్‌ని అభ్యర్థించారు. అతను దానిని ప్రశ్నించకుండా అంగీకరించాడు. అతను ప్రతి సంవత్సరం తంగల్ ఇంటిని పునర్నిర్మించేవాడు. తన మరణం తరువాత అతని కుమారులు మంబురం తరమ్మాళ్ ఇంటిని పునర్నిర్మించడాన్ని కొనసాగించారు. వారి పెళ్లయిన మొదట్లో తంగల్ తన అత్తారింట్లో నివసించేవారు. అనంతరం మంబురం మసీదు ఎదురుగా ఉన్న మలికల్ ఇంటికి చేరారు. అప్పట్నుండి చివరి వరకు అక్కడే నివసించారు. తన ఇంటి వద్ద ఓ రాయిని మనం చూడవచ్చు, దానిపై వారి పాదాలు ముద్రించబడ్డాయి. ఫాతిమా బీవీకి ఇద్దరు కుమార్తెలు జన్మించారు. మొదటి కూతురు పేరు షరీఫా అలవియ్యా. ఆమె చిన్నతనంలోనే మరణించింది.

పెళ్లయిన నాలుగో సంవత్సరంలో రెండో బిడ్డ పుట్టింది. మరణించిన బిడ్డ జ్ఞాపకార్థం తంగల్ రెండో బిడ్డకు షరీఫా అనే పేరు పెట్టారు. ఆ తర్వాత ఆమెను కుంఝీ బీవీ అని పిలిచేవారు. కుంఝీ బీవీని తంగల్ ఇబ్న్ అహ్మదుల్ జిఫ్రీ వివాహం చేసుకున్నారు.

మంబురం తంగల్ తన మొదటి భార్య మరణం తరువాత కోవిల్కండి అంబకంటకట్‌కు చెందిన ప్రముఖ పండితుడు సయ్యద్ అబూ బకర్ మదనీ కుమార్తె ఫాతిమాను వివాహం చేసుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత పండితుడు, రచయిత, ఆక్రమణ వ్యతిరేక వీరుడు మరియు స్వాతంత్ర్య సమరయోధుడైన సయ్యద్ ఫద్ల్ పూకోయ తంగల్ (QA) ఈ భార్యనుండి జన్మించారు.

తన 50 సంవత్సరాల వయస్సులో తంగల్ ఇదే ప్రాంత పొన్ముండం, తానూర్ లో ఆర్థికంగా బాగా ఉన్న కుటుంబానికి చెందిన ఆయిషాతో మరొక వివాహం చేసుకున్నారు. ఆమె చెరూర్ అమరవీరులలోని ముహ్యుద్దీన్ అనే వ్యక్తి సోదరి, ఈ వివాహం రెండవ భార్య జీవించి ఉండగానే జరిగింది. ఈ భార్యలో తంగల్‌కు ఫాతిమా మరియు స్వాలిహా పేరిట ఇద్దరు కుమార్తెలున్నారు.

 తంగల్ జీవితకాలంలో ఇండోనేషియా ద్వీపమైన తైమూర్‌లోని 'దిలి'కి చెందిన స్వాలిహా (చివరి భార్య) తప్ప వారి మొదటి ముగ్గురు భార్యలను కోల్పోయారు.

'మంబురం'లో తంగల్ ­­:

మంబురంలో స్థిరపడిన తర్వాత తంగల్‌కి 'మంబురం తంగల్' అనే పేరు వచ్చింది. తరమ్మాల్ తంగల్ అని కూడా పిలుస్తారు. తిరురంగాడి పాత జుమా మస్జిద్ ఆ సమయంలో ఈ ప్రాంతంలోని పురాతన మరియు అత్యంత ముఖ్యమైన మసీదు. మంబురంలో స్థిరపడిన మరుసటి శుక్రవారం, తంగల్ జుమా ప్రార్థన కోసం తిరురంగాడిలోని గ్రాండ్ జుమా మసీదుకు వెళ్లారు. ఆ మసీదు పండితుడు మరియు ఋషి అయిన ఖాజీ జమాలుద్దీన్ మఖ్దూమీ అక్కడ శుక్రవారం ఖుత్బాను అందించేవారు. ఖుత్బా తర్వాత, జుమా ప్రార్థన జరుగుతుండగా, తంగల్ అకస్మాత్తుగా ప్రార్థన నుండి వెళ్లిపోయి మస్జిదు మరొక భాగానికి వెళ్లి జుహర్ నమాజును ప్రారంభించారు. ప్రార్థన అనంతరం ఈ చర్య స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది. వారి ఈ అసాధారణ ప్రదర్శనకు పలువురు ఆశ్చర్యపోయారు. ఏది ఏమైనప్పటికీ పరిస్థితిని అర్థం చేసుకేవాలనే లక్ష్యంతో  కొందరు వ్యక్తిగతంగా కలిసి చర్య గురించి అడిగారు. వారు సమాధానంగా ఇలా అన్నారు: "నేను ప్రార్థనలో ప్రవేశించిన వెంటనే ఖాజీ ఒక ఆవు గురించి ఆలోచించడం ప్రారంభించారు. అందుకే నేను ఆ జమాత్ నుండి విడిపోయాను." ప్రజలు వెంటనే ఖాజీని సంప్రదించి విషయం గురించి ఆరా తీశారు. ఈ విషయాన్ని వినగానే  ఖాజీ ఆశ్చర్యపోయారు. "ఇది నూటికి నూరుపాళ్లు నిజం. వాలియోరకు చెందిన ఓ వ్యక్తి ఈరోజు నా భార్య కోసం ఆవును తీసుకువస్తానని చెప్పాడు. ప్రార్థన సమయంలో అది గుర్తుకు వచ్చింది"  అని అన్నారు ఖాజీ గారు. ఈ సంఘటనతో స్థానికులలో తంగల్ యొక్క ప్రజాదరణ మరింత పెరిగింది.

సూత్రం మరియు ఆలోచన:

మతపరమైన విషయాల్లో అలవి తంగల్ చాలా కఠినంగా ఉండేవారు. అల్లాహ్ యొక్క న్యాయశాస్త్ర నియమాలు విశ్వాసులలో వ్యాప్తి చెందాలనేది ఆయన కోరిక. ఆధ్యాత్మిక నాయకత్వం ద్వారా సామాజిక పరివర్తనకు వీలుగా కేరళ ముస్లింలలో అనేక అంశాలలో సుపరిచితుడైన పొన్నాని మఖ్దూమ్‌ల వైఖరిని ఆయన అవలంబించారు. ఇది రాజకీయ మరియు సాంస్కృతిక రంగంలో జోక్యం చేసుకున్నప్పటికీ, దాని వెనుక ఉన్న ప్రేరణ పూర్తిగా మతపరమైనది.

తంగల్ సామాజిక మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేశారు. ఇస్లామియ విశ్వాసంలో చీలికలు సృష్టిస్తున్న వారిని గుర్తించి, వారి కదలికలను మొగ్గలోనే తుంచేయడానికి ప్రయత్నిస్తూ తనతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్న ఓ బృందాన్ని తయారు చేసుకున్నారు. ఆ సమయంలో మరొక సవాలు ఏమిటంటే ఇస్లాం మతంలోకి ప్రవేశించినవారి హక్కులు మరియు స్థానాలను రక్షించడం, బోధనా కార్యకలాపాల ద్వార తంగల్ మరియు తమరి కుమారులు సయ్యద్ ఫజ్ల్ పూకోయా (QA) ఈ సమస్యపై న్యాయమైన మరియు నిజాయితీగల వైఖరిని తీసుకొని హిందూ జాగిర్దారుల భూస్వామ్య ఆధిపత్యాన్ని అంతం చేసి ముస్లింలుగా మారడానికి  పూర్తి స్వేచ్ఛ మరియు భద్రతకు హామీ ఇచ్చారు. వారు ముస్లింగా మారడాన్ని గర్వకారణంగా తీసుకున్నారు . దాంతో భూస్వాముల ముందు మునుపటిలా తల వంచేవాళ్లు తమ హక్కులు మరియు అధికారాలను గుర్తించారు.

వలస రాజ్యాల ఆక్రమిత శక్తులకు వ్యతిరేకంగా తంగల్ బలమైన మరియు తీవ్రమైన విధానాలను అవలంబించారు. ఆయన ఆక్రమణ బలాల నుండి ప్రత్యేకమైన ఇస్లామియ సంప్రదాయం ద్వారా కొనసాగిన కేరళ ప్రావిన్సులను నిరోధించేందుకు ప్రణాళికలు రూపొందించాడు. ఈస్టిండియా కంపెనీకి ధ్వజమెత్తిన భూస్వామ్య దురాగతాలను ఆయన తీవ్రంగా ఖండిస్తూ వారి పక్షాన ఉన్న తెల్ల సైన్యాన్ని తరిమికొట్టడానికి హిందూ-ముస్లిం ఐక్యత యొక్క ఆవశ్యకతను ప్రకటించారు.

తన ప్రాణస్నేహితుడైన ఉమర్ ఖాజీ వలె బ్రిటిష్ వారు స్థాపించిన రాజకీయ మరియు పరిపాలనా వ్యవస్థకు వ్యతిరేకంగా తీవ్రంగా ప్రతిస్పందిస్తూ చివరి వరకు బ్రిటిష్ వారితో పోరాడాలని స్థానికులను ఉద్దేశించి 'సైఫుల్ బత్తార్' అనే పుస్తకాన్ని కూడా వ్రాసారు.

ఆధ్యాత్మిక జీవితం :

తంగల్ బాఅలవి సూఫీ త్వరిఖత్‌ను అనుసరించారు. ఇది షేక్ అబ్దుల్ ఖాదర్ జీలానీ (RA) శిష్యులు అయిన సయ్యద్ బాఅలవీ కుటుంబంచే ప్రాచుర్యం పొందిన ఖాదిరీ సూఫీ త్వరీఖత్ యొక్క శాఖ. అందుకే తంగల్ ఒకే సమయంలో ఖాదిరీతో పాటు బాఅలవీ కూడాను.

మంపురం తంగల్ బాఅలవి కుటుంబం క్రిందకు వచ్చే మౌలద్దవీల కుటుంభసభ్యుడు. వలసవాద వ్యతిరేక వీరుడిగా, సామాజిక కార్యకర్తగా, హక్కుల పరిరక్షకుడిగా, మత సామరస్య బోధకుడిగా పేరెన్నికగన్నప్పటికీ, తంగల్ క్రమశిక్షణతో కూడిన ఆధ్యాత్మిక జీవితానికి కూడా ప్రసిద్ది చెందారు. వారు ఖాదిరియ్యా సూఫీ త్వరిఖత్ యొక్క షేఖ్. అక్కడ చాలా మంది మురీదులు మరియు శిష్యుల సమూహాలు ఉండేవి. తమరు ఆనాటి ఖుతుబ్. అందుకే తమరిని ఖుతుబుజ్జమాన్ అని పిలిచేవారు. ఇది అవ్లియా శ్రేణిలో అత్యున్నత స్థానం. అల్లాహ్ వారుని అటువంటి స్థితికి చేర్చాడు. ఖుతుబులు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఈ జన్మభూమికి అలాంటి స్థానం లభించడం గొప్ప వరం. మళయాళీలు (కేరళ భాష మాట్లాడేవారు, లేదా అక్కడ నివసించేవారు) తంగల్ బర్కత్ ను పొంది చాలా అదృష్టవంతులయ్యారు.

మరణము:

కేరళ ముస్లిం పునర్జీవన రంగంలో ఒక కాంతిలా వెలిగిన తంగల్, దాదాపు హిజ్రీ 1259లో వృద్ధాప్య వ్యాధులతో బాధపడటం ప్రారంభించాడు. రోజురోజుకూ వ్యాధి ముదిరిపోయి కాలు నొప్పులు మొదలయ్యాయి. చెరూర్ యుద్ధ సమయంలో బ్రిటిష్ సైన్యం నుండి కాల్పుల ప్రభావం దీనికి కారణం. కానీ వారు దాని గురించి గొప్పగా చెప్పుకోలేదు. ఆ గాయమే చివరి వరకు కొనసాగిన వ్యాధికి కారణం.

మలబార్‌లోని అనేక మంది ప్రముఖ వైద్యులు ఆయనను పరీక్షించడానికి మంబురం వచ్చారు, కానీ వారిలో ఎవరూ వ్యాధికారణాన్ని కనుగొనలేకపోయారు. అలా పుత్తూరుకు చెందిన చెలక్కొట్ అహ్మద్ కుట్టి వైద్యర్ మంబురం చేరుకున్నాడు. వెంటనే ఆయనను పరామర్శించి ఇలా అన్నాడు: "తమరి కాలిపై తాజా గాయం మానలేదు. అది ఆయాసానికి ప్రధాన కారణం. ఆరిపోవడానికి పేస్ట్ వేస్తాను, ఉపశమనం ఉంటుంది."

వ్యాధిని నిర్ధారించడంలో వైద్యుడి సామర్థ్యంతో తంగల్ ఆశ్చర్యపోయాడు. "నువ్వు నిజంగా గొప్ప వైద్యునివి...!"అతన్ని ఆశీర్వదించాడు. ఈ గౌరవం, గుర్తింపు ఆ కుటుంబానికి కూడా దక్కింది. మందులు వాడినప్పటికీ, తాత్కాలిక ఉపశమనం తప్ప తంగల్ పూర్తిగా వ్యాధి నుండి విముక్తి పొందలేకపోయారు. రోజురోజుకూ వారి శరీరం క్షీణంచిపోతుంది. ఈ వార్త వెంటనే వివిధ మలబార్  ప్రాంతాలకు వ్యాపించింది. వారిని పరామర్శించేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన శిష్యులు, ప్రజాప్రతినిధులు తరలివచ్చారు. సమూహంలో చాలా మంది హిందూ నాయకులు మరియు పండితులు కూడా ఉన్నారు.

చివరికి తంగల్ తన 94 ఏళ్ల వయసులో (1260 హిజ్రా (క్రీ.శ. 1845) ముహర్రం 7వ తేదిన ఆదివారం రాత్రి) కన్నుమూశారు. మరణ వార్త తెలియగానే మంబురం జనసముద్రంతో నిండిపోయింది. కేరళలోని వివిధ ప్రాంతాల నుంచి కుల, మతాలకు అతీతంగా ప్రజలు తరలివచ్చారు. ముహర్రం ఎనిమిదో తేదీ సోమవారం నాడు హసన్ జిఫ్రీ సమాధి దగ్గర తంగల్ జనాజాను ఖననం చేశారు.

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter