తరావీహ్ నమాజ్: రకాతుల సంఖ్య  (Part - 2)

తరావీహ్ నమాజు 20 రకాతులు అన్న విషయం పై సహాబాలు ఏకీభవించారు. అలాగే తాబఈన్, అధిక పండితులు, కూఫా వారు, షాఫఈ మరియు ఫిఖ్ పండితులు యొక్క సామూహిక ఆచరణగా మారింది. బుఖారీ యొక్క వివరగ్రంథం అయన ఉందతుల్ ఖారీలో ఇలా ప్రస్తావించబడింది - وقال ابن عبد البر: وهو قول جمهور العلماء، وبه قال الكوفيون والشافعي وأكثر الفقهاء، وهو الصحيح عن أبي بن كعب من غير خلاف من الصحابة

       ఇబ్ను అబ్దుల్ బర్ ఇలా అన్నారు – ఈ (20 రకాతుల తరావీహ్ నమాజు అన్నది) అధిక పండితుల యొక్క వాక్కు. దీనినే కూఫా వారు, షాఫఈ మరియు ఫిఖ్ పండితులు కూడా చెప్పారు. ఉబయ్యి ఇబ్ను కఅబ్ రదియల్లాహు అన్హు యొక్క ఉల్లేఖనమే సరైనది, ఇందులో సహాబాల ఎటువంటి వ్యతిరేకణ లేదు.

       బుఖారీ వివరకులు, ఉందతుల్ ఖారీ గ్రంథకర్త అల్లామా బద్రుద్దీన్ ఐనీ హనఫీ రహ్మతుల్లాహ్ అలైహి (వఫాత్ – 855 హి), నమ్మకస్థులైన పండితులు.

 واحتج أصحابنا والشافعية والحنابلة بما رواه البيهقي بإسناد صحيح عن السائب بن يزيد الصحابي، قال: كانوا يقومون على عهد عمر، رضي الله تعالى عنه، بعشرين ركعة، وعلى عهد عثمان وعلي، رضي الله تعالى عنهما، مثله

       హనఫీ పండితులు, షాఫఈ పండితులు, హంబలీ పండితులందురూ తరావీహ్ నమాజు 20 రాకతులని ఆ హదీసునే మూలాధారంలా పరిగణిస్తారు. ఆ హదీసును ఇమాం బైహఖీ సరైన సనద్ ద్వారా హజ్రత్ సాయిబ్ బిన్ యజీద్ (సహాబీ) రదియల్లాహు అన్హు ఉల్లేఖనంతో ప్రస్తావించారు- ప్రజలందరూ ఉమర్ రదియల్లాహు అన్హూ యొక్క కాలంలో 20 రకాతుల తరావీహ్ చదివేవారు, అలాగే ఉస్మాన్ మరియు అలీ రదియల్లాహు అన్హుమా కాలంలో ఇలాగే (20 రకాతుల తరావీహ్) చదివేవారు.

       నాలుగు ఇమాములు – ఇమాం అబూ హనీఫా, ఇమాం షాఫఈ, ఇమాం అహ్మద్ ఇబ్ను హంబల్ మరియు ఇమాం మాలిక్ రహిమహుముల్లాహ్ (వారి రెండు అభిప్రాయాల్లో ఒకదాని అనుసారం)- తరావీహ్ నమాజు 20 రకాతులని ఏకీభవించారు. ఇమాం మాలిక్ రహిమహుల్లాహ్ వారి రెండో అభిప్రాయంలో తరావీహ్ 20 రకాతులు మరియు 16 రకాతులు దానికి తోడుగా నఫిల్. ఎందుకంటే మక్కాలో ఉన్నవారికి ప్రతి 4 రకాతుల తర్వాత ఒకసారి ప్రదక్షిణం చెయ్యాలి. అందుకని మక్కాయేతర వాసులకు ప్రదక్షిణానికి బదులుగా 4 రకాతులు ఎక్కువగా జోడించారు. అలా అయితే పూర్తిగా 36 రకాతులయ్యాయి. అందులో తరావీహ్ కి 20 రకాతులు మాత్రమే.

       అల్లామా ఇబ్ను నుజైం మిస్రీ రహ్మతుల్లాహి అలైహి కంజు దఖాయిఖ్ యొక్క భావగ్రంథంలో ఇలా వివరించారు- తరావీహ్ నమాజు 20 రకాతులు, ఫిఖ్ పండితులంతా ఇలానే తాకీదిచ్చారు. అలాగే తూర్పు పడమరలో ఉండే వారంతా దీన్నే అమలు పరుస్తారు. وعليه عمل الناس شرقا وغربا

       అల్లామా ఇబ్ను రుష్ద్ మాలికీ రహ్మతుల్లాహి అలైహి బిదాయతుల్ ముజ్తహిద్ గ్రంథంలో 20 రకాతుల తరావీహ్ గురుంచి చర్చిస్తూ -

فاختار مالك في أحد قوليه ، وأبو حنيفة ، والشافعي ، وأحمد ، وداود ، القيام بعشرين ركعة سوى الوتر .

ఇమాం మాలిక్ (వారి రెండు అభిప్రాయాల్లో ఒకదాని అనుసారం)- ఇమాం అబూ హనీఫా, ఇమాం షాఫఈ, ఇమాం అహ్మద్ ఇబ్ను హంబల్ మరియు దావూద్ రహిమహుముల్లాహ్ విత్ర్ మినహా, 20 రకాతులు తరావీహ్ అని ఎన్నుకున్నారు.

عن يزيد بن رومان قال: كان الناس يقومون في زمن عمر بن الخطاب بثلاث وعشرين ركعة. وعليه عمل الناس شرقا وغربا

యజీద్ ఇబ్ను రూమాన్ రహ్మతుల్లాహి అలైహి ఇలా చెప్పారు: ఉమర్ ఇబ్ను ఖత్తాబ్ రదియల్లాహు అన్హు కాలంలో ప్రజలు (విత్ర్ తో కలిపి) 23 రకాతులు చదివే వారు.

      8 రకాతుల తరావీహ్ నమాజు యొక్క అర్థం – సహీహ్ బుఖారీలో ఆయిషా రదియల్లాహి అన్హా కథనంలో 8 రకాతుల ప్రస్తావన వచ్చింది.

      عن أبي سلمة بن عبد الرحمن، أنه سأل عائشة رضي الله عنها، كيف كانت صلاة رسول الله صلى الله عليه وسلم في رمضان؟ فقالت: «ما كان رسول الله صلى الله عليه وسلم يزيد في رمضان ولا في غيره على إحدى عشرة ركعة، يصلي أربعا، فلا تسل عن حسنهن وطولهن، ثم يصلي أربعا، فلا تسل عن حسنهن وطولهن، ثم يصلي ثلاثا» فقلت: يا رسول الله، أتنام قبل أن توتر؟ قال: «يا عائشة، إن عيني تنامان ولا ينام قلبي»

       హజ్రత్ అబూ సల్మా ఇబ్ను అబ్దుర్రహ్మాన్ రదియల్లాహు అన్హు కథనం: ఆయిషా రదియల్లాహు  అన్హాను  “రమజాన్ నెలలో రాత్రిపూట దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్ని రకా'అత్ నమాజు చేసేవారు? అని అడిగారు. అందుకామె సమాధానమిస్తూ, "దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రంజాన్ లో గాని, ఇతర నెలల్లో గాని రాత్రిపూట నమాజు పదకొండు రకాతుల కంటే ఎక్కువ చేసేవారు కాదు. ముందు నాలుగు రకాతులు చేసేవారు. వాటిని చెప్పలేనంత సుదీర్ఘంగా, చక్కగా నెరవేర్చేవారు. తర్వాత మళ్లీ నాలుగు రాకాతులు చెప్పలేనంత సుదీర్ఘంగా, సుందరంగా చేసేవారు. తర్వాత (చివర్లో) మూడు రకాతులు విత్ర్ చేసుకునేవారు. నేను ప్రవక్తతో అడిగాను -  ఓ దైవప్రవక్తా, విత్ర్ కు ముందు మీరు నిద్రిస్తారా. అందుకు బదులుగా ఓ ఆయిషా రదియల్లాహు అన్హా, నా రెండు కళ్ళు నిద్రిస్తాయి, కానూ నా హృదయం నిద్రపోదు. (బుఖారీ-ముస్లిం).

       8 రకాతుల తరావీహ్ అనే వాదనకి సరికాని మూలాధారం - ఈ కథనం ప్రకారం తరావీహ్ యొక్క రకాతుల సంఖ్య ఎనిమిది అని వాదించడం సరైనది కాదు, ఎందుకంటే బుఖారీ వివరణలో ఇమాం ఇబ్ను హజర్ అస్కల్లానీ ఫత్హుల్ బారీలో లిఖించారు - ఆయిషా రదియల్లాహు అన్హా కథనంలో 11 రకాతుల చర్చ కూడా ఉంది. అలాగే 7 రకాతుల, 9 రకాతుల, 13 రకాతుల కథనం కూడా లభిస్తుంది. ఇందులో మూడు రకాలు విత్ర్ కి మినహాయిస్తే మిగతా నాలుగు రకాతులు, ఆరు రకాతులు, ఎనిమిది రకాతులు మరియు 10 రకాతులు కలుగుతాయి. ఒకే నమాజ్ గురించి ఇన్ని వివాదాలు ఉండడం వలన కొందరు హదీస్ శాస్త్రజ్ఞులు ఈ కథనాన్ని ముజ్తరబ్ అని పేర్కొన్నారు. ముజ్తరబ్ హదీసును మూలాధారం చేయడం సరికాదు.

قال القرطبي‏:‏ أشكلت روايات عائشة على كثير من أهل العلم حتى نسب بعضهم حديثها إلى الاضطراب،

ఖుర్తుబీ రహ్మతుల్లాహ్ అలైహి ఇలా చెప్పారు: ఆయిషా రదియల్లాహు అన్హా యొక్క ఉల్లేఖనాలు ఎంతోమంది పండితులకు చిక్కు తెచ్చి పెట్టింది. వారిలో కొందరు ఆమె హదీసుని ముజ్తరబ్ అని పేర్కొన్నారు.

       కాగా, ఆ 8 రకాతుల కథనం తరావీహ్ నమాజు గురించి కాదు, ఆ కథనం తహజ్జుద్ నమాజ్ కు సంబంధించినది. విశ్వాసుల మాత ఆయిషా రదియల్లాహు అన్హా కథనాన్ని మూలాధారం చేసుకొని తరావీహ్ ఎనిమిది రకాతులని చెప్పడం సరాసరి తప్పు, దీనికి విరుద్ధంగా హదీశాస్త్రం మరియు హదీస్ జ్ఞానం సాక్ష్యంగా ఉన్నాయి. ఒకవేళ ఆయిషా రదియల్లాహు అన్హా గారి కథనాన్ని చాలా సుదీర్ఘంగా దృష్టి సారిస్తే, ఈ కథనం తరావీకి సంబంధించినది కాదని స్పష్టంగా తెలిసిపోతుంది. పైగా ఈ కథనం తహజ్జుద్ నమాజ్ కు సంబంధించినది. ఎందుకంటే ఆయిషా రదియల్లాహు అన్హా ఈ కథనం గురించి రంజాన్ మరియు రంజానేతర రోజుల్లో అని ప్రస్తావించారు. అందరికీ తెలిసిన విషయమేమిటంటే తరావీహ్ నమాజు రంజాన్ లోనే చదువుతారు రంజానేతర రోజుల్లో చదవరు. లేకపోతే తరావీ నమాజు పూర్తి సంవత్సరం చదవాలని చెప్పాల్సి ఉంటుంది. కానీ అలా ఎవరు ఇంతవరకు చెప్పలేదు. ఈ కథనం తహజ్జుద్ నమాజ్ కు సంబంధించినదని నమ్మితేనే ఈ హదీస్ పై అమలు చేయగలం. అలాగే ఈ కథనం తహజ్జుద్ నమాజ్ కి సంబంధించినది చెప్పడానికి ఇంకొక కథనం కూడా ఉంది.

 عن ‌عائشة رضي الله عنها: «كان النبي صلى الله عليه وسلم يصلي من الليل إحدى عشرة ركعة، فإذا طلع الفجر صلى ركعتين خفيفتين، ثم اضطجع على شقه الأيمن حتى يجيء المؤذن فيؤذنه.»

       హజ్రత్ ఆయిషా రదియల్లాహు  అన్హా కథనం ప్రకారం: ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాత్రి వేళలో 11 రకాతులు నమాజ్ చేసేవారు. ఫజర్ వేళయితే రెండు చిన్నచిన్న రకాతులు చేసేవారు. ఆ తరువాత ముఅజ్జిన్ అజాన్ ఇచ్చే వరకు వారి కుడివైపున పడుకునేవారు

       ఈ హదీసు ప్రకారం అక్కడ తరావీహ్ నమాజు అని అర్థం తీసుకుంటే తరావీ నమాజు నిద్రపోయి మేలుకొన్నాక రాత్రి చివరి సమయంలో నమాజ్ చదవాలని చెప్పాల్సి ఉంటుంది. కానీ ఇలా ఇప్పటివరకు ఎవరూ చెప్పలేదు, చేయలేదు. ఒకవేళ ఆయిషా రదియల్లాహు అన్హా  ఈ కథనాన్ని తరావీహ్ అని చెప్పి ఉంటే వారు కూడా 8 రకాతులు తరావీహ్ నమాజ్ చదివేవారు. అలాగే ఉమర్ రదియల్లాహు అన్హు కాలంలో కూడా 20 రకాతుల నమాజు ప్రజలు చదువుతుంటే వారిని నిరాకరించి ఉండేవారు. కానీ వారు కూడా 20 రకాతుల తరావీహ్ నమాజుపై అమలు చేసేవారు మరియు ప్రజలు చేస్తున్నా కూడా వారిని చూసి ఏమి అనలేదు. కాబట్టి తెలిసింది ఏమిటంటే ఈ కథనం తరావిహ్ కి సంబంధించినది కాదు.

       అల్లాహ్ తఆలా అందరినీ సరైన సన్మార్గం పై ఉంచుగాక మరియు రంజాన్ మాసంలో ప్రార్థను శుద్ధి హృదయంతో, నిజాయితీగా అదా చేసే అనుగ్రహం ప్రసాదించుగాక. ఆమీన్.

Related Posts

Leave A Comment

Voting Poll

Get Newsletter