రంజాన్ మాసంలో చేయాల్సిన ప్రత్యేక పుణ్యకార్యాలు
ఇఫ్తార్ విందు అంటే ఉండి తీరాలి?
అల్హందులిల్లాహ్! నేటి ముస్లిం సమాజంలో ఇఫ్తార్ విందులు, ఆ విందుల పట్ల ఆహ్వానాలు, ఘనంగా ఏర్పాటు అవుతున్నాయి. ప్రజలు తమ తమ శక్తికి తగ్గట్టుగా దాని ఏర్పాట్లు చేస్తున్నారు. రోజా పూర్తవ్వాలంటే ఇఫ్తార్ చేయడం తప్పనిసరి' అని, మునపటి వ్యాసంలో తెలియజేయడం జరిగింది. అంతేకాక, ఈ ఇఫ్తార్ ను కూడా ప్రార్థనలో భాగంగా కలుపుతారు కూడా. కానీ ఈ ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేసే పద్ధతిలో ముఖ్యమైన మూడు అంశాలను దృష్టిలో ఉంచుకొని తీరాలి.
ముందుమాట ఇఫ్తార్, అనగా ఇది ముస్లింల కొరకు ఏర్పాటు చేసుకునేది లేదా చేయబడేది. ఎందుకంటే ఇఫ్తార్, రోజా యొక్క ముగింపు భాగం. ఇంకా ముస్లింలే రోజా పెడతారు. ఇది ఒక ప్రార్థన అయినందున, ముస్లింలదైతేనే స్వీకరించబడుతుంది గానీ, ఇతర మతాల వారిది కాదు!. ఎందుకంటే ప్రార్థన అనేది అల్లాహ్ తఆలా మరియు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అనుసరించడం పై జరిగేది. ఇంకా ఆ అనుసరణ ఇస్లాం స్వీకరిస్తేనే దక్కుతుంది. అలా కానీ యెడల ఆ ప్రార్ధన ముఖాన విసిరి కొట్టబడుతుంది. ఇందువలనే ఇఫ్తార్ ఆహ్వానితులు కేవలం ముస్లింలు అయితే మంచిది. ఇతరులను ఆహ్వానించడంలో సమస్యేమీ లేదు. ఇతరులను విందులో ఆహ్వానించడం వారికి అతిథి మర్యాదలు చేయడంలోనూ ఎటువంటి సమస్యా లేదు. ఇంకా ఇలా చేస్తే పుణ్యం కూడా దక్కుతుంది. కాకపోతే వారిని ముఖ్యంగా ఇస్లాం వైపునకు ఆహ్వానించే ఉద్దేశంతో భోజనానికి పిలవడం, ఉన్నతమైన ఎంపిక. ఇక ఆ సమయాన, ఇస్లాం యొక్క ఉపోద్ఘాతం వారికి వివరించాలి. ఇస్లామిక్ బోధనల గురించి తెలియజేయాలి. రోజా గురించి తెలియజేయాలి. ఇస్లాం గురించి విస్తరించిన తప్పుడు వ్యాఖ్యాలను దూరం చేయాలి. 'ఇన్షా అల్లాహ్'! ఇలా అయితే గనుక దీని ద్వారా రెండింతల పుణ్యం తప్పక దక్కుతుంది. ఇదే విధంగా ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కలిసి మెలిసి ఉండేందుకు మరియు ఇస్లాం మతం వైపునకు ఆహ్వానించేందుకు, రెండుసార్లు 'బనూ హాశిం' వంశపు వారి చుట్టాలను విందు భోజనానికి ఆహ్వానం పలికారు. ఆ రెండుసార్లు వారితో ఇస్లాం స్వీకరించమని తెలియజేశారు కూడానూ. ఇంకా ఇలా ఇస్లాం వైపునకు ఆహ్వానించే ఉద్దేశంతో, విందు భోజనానికి పిలవడం ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నత్.
కానీ నేటి ముస్లిం సమాజంలో ఒక బాధాకరమైన విషయం, ఏమిటంటే, ముస్లింలు ఇఫ్తార్ విందులో ఇతరులను పిలుస్తారు. అది మంచిది. ఇంకా అందులో ఎక్కువగా ధనవంతులు, నాయకులు కావడం, మనం నేటి సమాజంలో గమనించవచ్చు. ఇంకా ఆ విందులో కనీసం ఒక దుఆ కూడా జరగని పరిస్థితిలా తయారుచేస్తారు. ఇస్లాం మాటలు, అల్లాహ్-రసూల్ మాటలు, అల్లాహ్ తఆలా పట్ల భయం లేకుండా, అందులో నవ్వులాడుకుంటూ వారితో ఫోటోల కొరకై లేదా రేపటి వార్త పత్రికల్లో వచ్చేందుకై, తెగ తపనులు పడిపోతారు. అది ఎక్కడో కాదు ఏకంగా ఇఫ్తార్ వంటి ప్రార్థనల్లోనే నియమించుకుంటున్నారు. ఒకవేళ అదే పనిని ఇస్లామిక్ బోధన ప్రకారం జరిపితే నేటి ఒక రోజు విలువ గల వార్తాపత్రికల్లో కన్నా అల్లాహ్ యొక్క రిజిస్టర్ లో గనుక వస్తే, రేపటి శాశ్వత జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది కదా!. ఎంతటి తెలివి తక్కువ పని అది.
ఇంకా రెండో విషయం, ఇటువంటి విందుల్లో పేదవారిని, ఫకీరులను చిన్న చూపుతో అస్సలు చూడకూడదు. ఇలాంటి సందర్భాల్లో వారికి మర్యాదలు చేసి తీరాలి. అందుకే కదా, ఇస్లాంలో ఈద్-ఉల్-ఫితర్ నాడు, సదఖతుల్-ఫితర్ (దానధర్మం) చేయడం తప్పనిసరి అని పేర్కొనబడింది. దీని ద్వారానైనా పేదలు, బీదవారు, ఫకీరులు ఇలా.... ప్రతి ఒక్కరి ఇండ్లలో పండుగ సందర్భం చోటు చేసుకుంటుంది. ఇంకా వారు తమ తమ సంతోషాలను వ్యక్తం చేసుకోగలరు. అంతేకాక ఈదుల్ అజ్హా లో కూడా ఖుర్బానీ ఇచ్చి, తప్పనిసరిగా ఆ బలి ఇవ్వబడిన జంతువు మాంసం మూడు భాగాలుగా పంచడం కూడా తప్పనిసరి అని పేర్కొనబడింది. ఒక భాగం పేదవారికి. రెండవది కుటుంబ చుట్టాలకు. ఇందులో పేద చుట్టాలు కూడా వస్తారు. ఇంకా మూడవది సొంతవారికి.
ఇంకా మూడవ విషయం, దీనిపై ముఖ్యంగా దృష్టి ఉంచి తీరాలి. ఇఫ్తార్ విందులో ఒక రకమైన ప్రార్థనా రంగు తప్పక ఉండి తీరాలి. ఇఫ్తార్ కు కొంత ముందు సమయాన, ప్రతొక్కరి నాలుకలపై అల్లాహ్ స్మరణ ఉండాలి. దరూదులు చదవాలి. పవిత్ర ఖురాన్ పారాయణం చేయాలి. లేకపోతే ఇస్లామిక్ మాటల్లో నిమగ్నులై ఉండాలి. ఇంకా ఇది ప్రత్యేకంగా దువా చేసి తీరాల్సిన సమయం. ఈ సమయాన దువా తప్పక స్వీకరించబడుతుంది. ఇదంతా కేవలం అల్లాహ్ తఆలా కొరకు చేయబడుతుందే తప్పా, వేరే ఏ ఉద్దేశంతోనూ, అస్సలు చేయకూడదు. అల్లాహ్ తఆలా నేటి సమాజపు ముస్లింలందరికీ ఈ మాటలను పాటించే భాగ్యాన్ని ప్రసాదించుగాక! ఆమీన్!.


