ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క వ్యక్తిత్వం

ప్రపంచంలో ఎందరో వ్యక్తులు పలు ప్రాంతాలలో, పలు ప్రదేశాలలో, పలు సమాజాలలో నాయకులుగా మారి తమకంటూ ఓ ముద్ర ను స్థాపించుకుని చరిత్రలో నిలిచారు. అందులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కూడా ఒకరు. పదిహేను వందల సంవత్సరాల ముందు అంధకారం మరియు అజ్ఞానానికి గురై, అవిశ్వాసం మరియు మూడునమ్మకాలకి బానిసై, విగ్రహారాధన మరియు బహు దేవతలను పూజించడంలో శిఖరానికి చేరుకున్న అరబ్ దేశంలో ఆ మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించారు.

ఆ కాలంలో అరబ్ దేశం యొక్క నాగరికత మరియు సంస్కృతి ఎంత దిగజారిపోయిందంటే ఒక సాధారణమైన వ్యక్తి దీనిని ఊహల్లో కూడా ఊహించలేడు. ఇంతేకాక అరబ్ దేశం దౌర్జన్యానికి మరియు హింసకి మారుపేరుగా మారింది. ధనికుల అణిచివేత, నల్లజాతి తెగకు చెందిన ప్రజలను బానిసలుగా చేసే ఈ ప్రజలు స్త్రీలను పశువులకన్నా హీనంగా మరియు నీఛంగా చూసేవారు. వారి నరాల్లో రక్తం కన్నా మద్యం ఎక్కువగా ప్రవహించేది, మద్యం కోసం కన్న తల్లిదండ్రులను తాకట్టు పెట్టడంలో కూడా వెనుకాడేవారు కాదు. ఇలాంటి సమయంలో ఈ దురాచారాలను, అంధ విశ్వాసాలను ఆటకట్టించేందుకు మక్కాలో ఓ విప్లవం స్వరించింది. ఆ మహనీయ విప్లవం పేరే ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం).

అరబ్బులకు అరబ్బేతరుల పై, అరబ్బేతరులకు అరబులపై, తెల్లవారికి నల్లవారికి పై, నల్ల వారికి తెల్ల వారిపై ఎలాంటి ప్రాముఖ్యత మరియు ప్రాధాన్యం లేదు. ధనికులైనా బీదవాళ్ళైనా, రాజైనా బానిసైనా ప్రతి ఒక్కరు అల్లాహ్ దృష్టిలో సమానమే అంటూ ఓ మహోన్నతమైన నైతికతతో అల్లహ్ సందేశాన్ని మరియు ఇస్లాం మతాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు ఆ మహానీయ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం). కరుణామయున్ని సందేశం రాకముందు మక్కాలో ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తన విశిష్ట నైతికతతో సమాజంలో అల్-సాదిక్ (నిత్యం నిజం పలుకువారు) మరియు అల్-అమీన్ (నమ్మకస్తుడు)గా పిలువబడే వారు.

శత్రువులు తనని ఎంత హింసించినా, తనపై ఎంతటి అన్యాయానికి పాల్పడిన ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) తన ప్రేమానురాగాలతో సమాధానం ఇచ్చేవారు. నమాజు చదువుతున్నప్పుడు ఒంటె ప్రేగులు వేయడం, దారి మధ్యలో ముళ్ళు మరియు చెత్త విసరడం, తాయిఫ్ కి వెళ్ళినప్పుడు రాళ్ళదెబ్బలతో రక్తం చిందించినా కూడా ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఎన్నటికీ ఎవ్వరిని శపించలేదు, ఎవరిపై ప్రతీకారము కోరలేదు. వ్యక్తిగతంగా ఎవరిపైన శత్రుత్వం పెట్టుకోలేదు. హిజ్రీ 8వ ఏట మక్కాను జయించినప్పుడు, ప్రవక్తను హింసించిన మరియు తనను హతమార్చడానికి కుట్రలు పన్నిన ఎందరో ప్రజలు ఉన్నా, వారందరినీ క్షమించి వదిలేసారు మరియు తన ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలియజేశారు.

అమెరికన్ శాస్త్రవేత్త మరియు రచయిత అయిన మైఖేల్ హెచ్. హార్ట్ రాసిన పుస్తకం "ది 100: ఎ ర్యాంకింగ్ ఆఫ్ ది మోస్ట్ ఇన్పుయెన్షియల్ పర్సన్స్ ఇన్ హిస్టరీ"(THE 100: A RANKING OF THE MOST INFLUENTIAL PERSONS IN HISTORY) అనే పుస్తకంలో ప్రపంచంలోని అత్యంత ప్రభావంతులైన వంద మంది జాబితాలో మొట్టమొదటి స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)కి అందించారు. దాని గల కారణాన్ని కూడా మైఖేల్ హెచ్ హార్ట్ ఇలా తెలియజేశారు:

"ప్రపంచంలోని అత్యంత ప్రభావితమైన వ్యక్తుల జాబితాలో ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)కి మొదటి స్థానం ఇవ్వడమంటే కొంతమంది పాఠకులు ఆశ్చర్యపోవచ్చు మరికొందరు ప్రశ్నించగలరు, కానీ అతను ఇటు మతపరంగానూ మరియు అటు లౌకిక పరంగానూ చరిత్రలో విజయవంతమైన ఏకైక వ్యక్తి"

Related Posts

Leave A Comment

1 Comments

Voting Poll

Get Newsletter